వడ్డీ భారం తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్​ పాటించండి!

author img

By

Published : Sep 16, 2022, 10:52 AM IST

how to decrease interest rates

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే 5.40 శాతం ఉన్న రెపో రేటు కొత్తగా 50 బేసిస్‌ పాయింట్లు పెరిగితే 5.90 శాతానికి చేరుకోవచ్చు. కీలక వడ్డీ రేటు పెరిగితే వెంటనే బ్యాంకులూ రెపో ఆధారిత వడ్డీ రేట్లను పెంచేస్తాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఒకసారి రుణం తీసుకుంటే.. వ్యవధిని మార్చుకోలేమని చాలామంది అనుకుంటారు. కానీ, మీ చెల్లింపుల చరిత్ర బాగుంటే.. బ్యాంకు/ఆర్థిక సంస్థలను మీరు వ్యవధి తగ్గింపు కోసం కోరవచ్చు. వ్యవధి తగ్గినప్పుడు ఈఎంఐ పెరుగుతుంది. రుణం తొందరగా తీరడంతో వడ్డీ భారం తగ్గుతుంది. మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఈఎంఐని పెంచుకునే విషయాన్ని ఆలోచించవచ్చు.

పాక్షిక చెల్లింపులు చేస్తూ రుణ అసలును తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు ఏడాదికి ఒకటి లేదా రెండు ఈఎంఐలు అదనంగా చెల్లించవచ్చు. అనుకోకుండా మీ చేతికి వచ్చిన డబ్బులను ఇందుకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు బోనస్‌లు, మిగులు మొత్తంలాంటివి. కొన్ని రుణ సంస్థలు ఇలా పాక్షిక మొత్తాన్ని చెల్లించినందుకు కొంత రుసుము విధిస్తాయి. గృహరుణాలపై బ్యాంకులు సాధారణంగా ఎలాంటి రుసుములూ వసూలు చేయవు.

  • అధిక వడ్డీ ఉన్న బ్యాంకు నుంచి ఇతర రుణ సంస్థకు మారేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కనీసం 0.75-1 శాతం వరకూ వడ్డీ రేటులో తేడా ఉన్నప్పుడే ఈ అంశాన్ని పరిశీలించాలి. కొత్త రుణదాత మీకు ఆకర్షణీయమైన వడ్డీ, ఇతర ఖర్చుల్లో రాయితీని అందిస్తుంటే మారేందుకు ప్రయత్నించవచ్చు. ఏది ఏమైనా సంస్థను మారే ముందు కచ్చితంగా ఖర్చులు-ప్రయోజనం తెలుసుకోవాలి. గృహరుణాలు దీర్ఘకాలం కొనసాగుతాయి కాబట్టి, స్వల్ప వడ్డీ రేటు తగ్గినా మిగులు ఎక్కువగానే ఉంటుంది.
  • క్రెడిట్‌ స్కోరు అధికంగా ఉన్నవారికి వడ్డీ రేటులో రాయితీ లభిస్తుంది. మీ క్రెడిట్‌ స్కోరు పెరిగినప్పుడు బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయండి. ఏదైనా రాయితీ లభిస్తుందా తెలుసుకోండి.
  • వడ్డీ ఎక్కువగా ఉన్న రుణాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. ఒకవేళ తీసుకున్నా వాటిని తొందరగా తీర్చేయాలి. చిన్న చిన్న అప్పులు అధికంగా ఉంటే వాటిని నిర్వహించడం కష్టం. వాటికి బదులుగా ఒక పెద్ద రుణానికి చెల్లించడం తేలిక.
  • కొత్తగా రుణం తీసుకోబోయే ముందు.. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పడే భారాన్నీ పరిగణనలోకి తీసుకొని, రుణ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.

ఇవీ చదవండి: పాత కార్ల అమ్మకాల్లో మోసాలకు చెక్‌.. కేంద్రం కొత్త రూల్స్​ జారీ!

భారత వృద్ధిరేటు 7 శాతమే.. అంచనాలను తగ్గించిన ఫిచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.