పాత కార్ల అమ్మకాల్లో మోసాలకు చెక్‌.. కేంద్రం కొత్త రూల్స్​ జారీ!

author img

By

Published : Sep 16, 2022, 6:47 AM IST

cars

పాత కార్ల విక్రయాల్లో మోసాల నివారణకు నూతన నిబంధనలను ప్రతిపాదించింది కేంద్రం. ఇందుకోసం మోటారు వాహనాల నిబంధనలు-1989లోని చాప్టర్​-3కి సవరణలు చేస్తూ ముసాయిదా జారీ చేసింది. ఆ సవరణలేంటో ఓ సారి తెలుసుకుందాం.

పాత (సెకండ్‌ హ్యాండ్‌) కార్ల విక్రయాల్లో మోసాల నివారణకు నూతన నిబంధనలను కేంద్ర రహదారి, రవాణా శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం మోటారు వాహనాల నిబంధనలు-1989లోని చాప్టర్‌-3కి సవరణలు చేస్తూ ముసాయిదా జారీ చేసింది. డీలర్ల ద్వారా జరిగే పాత వాహనాల కొనుగోలు, అమ్మకాలను మరింత పారదర్శకంగా మార్చి, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికే ఈ సవరణలు ప్రతిపాదించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

'దేశంలో వినియోగ కార్ల క్రయ, విక్రయాలకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లూ అందుబాటులోకి రావడంతో, ఈ విపణి మరింతగా విస్తరిస్తోంది. ఇదే క్రమంలో మోసాలూ ఎక్కువవుతున్నాయి. వాహనాన్ని ఒకరి పేరు మీది నుంచి మరొకరికి బదిలీ చేసేటప్పుడు, థర్డ్‌పార్టీ డ్యామేజ్‌ లయబిలిటీస్‌కి సంబంధించిన వివాదాల పరిష్కార విషయంలో, డిఫాల్టర్లను నిర్ధారించే అంశంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే తాజా సవరణలు ప్రతిపాదించాం' అని కేంద్ర రహదారి రవాణాశాఖ పేర్కొంది. దీని ప్రకారం..

  • రిజిస్టర్డ్‌ డీలర్లకు ఒక అధీకృత ధ్రువీకరణపత్రం జారీ చేయనున్నారు.ఇది అయిదేళ్లపాటు అమల్లో ఉంటుంది.
  • వాహన యజమాని (రిజిస్టర్డ్‌ ఓనర్‌) నుంచి డీలర్‌కు వాహనం వచ్చినప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారుచేశారు. 29సీ పత్రం నింపి, యజమాని తన వాహనాన్ని డీలర్‌కు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. దీన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ పత్రం విజయవంతంగా అప్‌లోడ్‌ అయితే, అందుకు ధ్రువీకరణ (అక్నాలెడ్జ్‌మెంట్‌) జారీ అవుతుంది. తర్వాత సదరు వాహనంపై డీలరుకు యాజమాన్య హక్కులు వస్తాయి. తదుపరి ఆ వాహనం ద్వారా జరిగే అన్ని సంఘటనలకూ అతనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • రిజిస్టర్డ్‌ వాహనాన్ని ఆధీనంలో ఉంచుకున్న డీలర్‌ బాధ్యతలు, అధికారాలను స్పష్టంగా నిర్వచించారు. తమ ఆధీనంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల రెన్యూవల్, డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు, ఎన్‌ఓసీ, యాజమాన్య హక్కుల బదిలీ అధికారాలన్నీ డీలర్లకు ఇచ్చారు.
  • డీలర్లు తమ వద్ద ఉన్న వాహన వివరాల రికార్డును ఎలక్ట్రానిక్‌ రూపంలో నిర్వహించాలి. ఫామ్‌29డీ రూపంలో దాన్ని పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
  • ఈ వాహనాలను డీలర్లు సొంత అవసరాలకు వాడుకోకూడదు. కేవలం కొనుగోలుదార్లు పరీక్షించుకునేందుకు, వారు చూసేందుకు ప్రదర్శన కోసమే ఉపయోగించాలి. వీటిని ట్రయల్స్‌కి పంపితే.. వివరాలను ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్‌ రికార్డులో నమోదు చేయాలి. ప్రతిసారీ 29ఈ పత్రం ప్రింట్‌ తీసి, ట్రయల్‌కు వెళ్లే డ్రైవర్‌కు ఇవ్వాలి. మధ్యలో సంబంధిత అధికారి అడిగితే ఆ డాక్యుమెంట్‌ను చూపాలి.
  • ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల ధ్రువీకరణపత్రాలను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నిబంధనలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉన్నవారు 30 రోజుల్లోగా commentsmorth@gov.in ఈ మెయిల్‌కు పంపొచ్చు.

ఇవీ చదవండి: భారత వృద్ధిరేటు 7 శాతమే.. అంచనాలను తగ్గించిన ఫిచ్‌

లక్ష రూపాయల ల్యాప్‌టాప్‌.. రూ.40వేలకే.. ఎలాగో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.