జర్మనీలో ఆర్థిక మాంద్యం.. భారత్‌కు భారం కానుందా?

author img

By

Published : May 26, 2023, 9:15 PM IST

Updated : May 26, 2023, 9:26 PM IST

germany-financial-crisis-effects-on-indian-economy

Germany Recession 2023 : ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయాల వ్యక్తమవుతున్న వేళ.. భారత్‌లో తొమ్మిదో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్న జర్మనీలో మాంద్యం ఏర్పడింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో జర్మనీ జీడీపీ వృద్ధిరేటు క్షీణించింది. ఈ నేపథ్యంలో జర్మనీ ఆర్థికమాంద్యం ప్రభావం భారత్‌ ఎగుమతులు, పెట్టుబడులపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Germany Recession 2023 : జర్మనీ ఆర్థికమాంద్యంలోకి జారుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం భారత్‌పై కూడా పడనుంది. భారత్‌ నుంచి ఐరోపాకు జరిగే ఎగుమతుల్లో కోత పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జర్మనీలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం పడిపోయింది. 2022 నాలుగో త్రైమాసికంలోనూ 0.5శాతం క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని ఆర్థికమాంద్యంగా పేర్కొంటారు. దీని వల్ల ఒక్క జర్మనీకే కాకుండా మొత్తం ఐరోపా దేశాలకు భారత్‌ నుంచి అయ్యే ఎగుమతులపై ప్రభావం పడుతుందని ముంబయికి చెందిన ప్రముఖ ఎగుమతిదారు తెలిపారు.

2022- 23లో భారత్‌ నుంచి జర్మనీకి 10.2 బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఎగుమతులు నమోదయ్యాయి. ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఈ విలువ పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తోలు ఉత్పత్తులు, కెమికల్‌, లైట్‌ ఇంజినీరింగ్‌ వస్తువులపై ప్రభావం అధికంగా ఉండనుంది. దాదాపు రెండు బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చని జీటీఆర్‌ఐ సహ-వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. రోజువారీ వినియోగించే వస్తువులపై ఆర్థిక మాంద్యం సమయంలో అధిక ప్రభావం ఉంటుందని తెలిపారు. త్వరలో అమల్లోకి రానున్న కార్బన్‌ బార్డర్‌ ట్యాక్స్‌ వల్ల ఇనుము, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం ఉంటుందన్నారు.

ఆర్థిక మాంద్యం వల్ల జర్మనీ నుంచి భారత్‌కు వచ్చే దుస్తుల ఆర్డర్లు తగ్గుతాయని అపారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ తెలిపింది. దాదాపు 10 శాతం క్షీణత కనిపించవచ్చని అంచనా. జర్మనీ నుంచి భారత్‌కు వచ్చే పెట్టుబడులు కూడా తగ్గే ప్రమాదం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో జర్మనీ తొమ్మిదో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. ఆర్థికమాంద్యం వల్ల అక్కడి కంపెనీలు చౌక ప్రత్యామ్నాయాల కోసం శోధిస్తాయని, ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చే పెట్టుబడులు తగ్గకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

'ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నా.. భారత్ మాత్రం సేఫ్'..
కాగా కొద్ది రోజుల క్రితం భారత్‌లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌-ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 2023-24లో దేశం 6-7 శాతం ఆర్థిక వృద్ధిని.. నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం.. మాంద్యంలోకి జారుకున్నా భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉండవని తెలిపారు. అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని.. రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల ప్రపంచం మొత్తం మాంద్యంలోకి జారుకుంటుందన్నారు. కానీ.. భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated :May 26, 2023, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.