సమూల మార్పులతో.. సమ్మిళిత వృద్ధి బాటలో బ్యాంకింగ్​!

author img

By

Published : Sep 27, 2021, 8:01 AM IST

india banking sector

వివిధ రంగాల ప్రాథమ్యాలకు అనుగుణంగా వేర్వేరు విధానాలను బ్యాంకులు(banking sector in india) చేపట్టవలసిన అవసరం ఉంది. అందుకు కావాల్సిన రీతిలో బ్యాంకింగ్‌ వ్యవస్థను పునర్నిర్మించాలి. బ్యాంకింగ్‌ రంగ సమస్యలను విధానకర్తలు సమగ్రంగా పరిశీలించి, సమష్టిగా పరిష్కారాలు కనుక్కోవాలి. బ్యాంకుల సమర్థ నిర్వహణకు స్వతంత్ర డైరెక్టర్లను ఎంపిక చేయాలి. అటువంటి ఉద్ధండుల జాబితాను ప్రభుత్వం సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలాంటి విభిన్న మార్పులకు శ్రీకారం చుడితేనే సమ్మిళిత వృద్ధి సాధనంగా బ్యాంకింగ్‌ రంగం(banking sector reforms in india) మారుతుంది.

(నిన్నటి తరువాయి)

వ్యవసాయం, ఉపాధి కల్పన, వ్యవస్థాపకత, మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ ఫైనాన్స్‌ రంగాలన్నింటినీ గంపగుత్తగా నిర్వహించాలని బ్యాంకులను(banking sector in india) ఆదేశించడం వల్ల సరైన ప్రయోజనాలు ఉండవని ఇంతవరకు జరిగిన అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆయా రంగాల ప్రాథమ్యాలకు అనుగుణంగా వేర్వేరు విధానాలను బ్యాంకులు చేపట్టవలసిన అవసరం ఉంది. అందుకు కావాల్సిన రీతిలో బ్యాంకింగ్‌ వ్యవస్థను పునర్నిర్మించాలి. ప్రస్తుతం వ్యవసాయ రంగం సంప్రదాయ సేద్యం నుంచి ప్రణాళికాబద్ధమైన, సేంద్రియ, హరిత సాంకేతికతలతో కూడిన విధానాల వైపు వేగంగా పురోగమిస్తోంది. కోళ్లు, గొర్రెల పెంపకం, రొయ్యల చెరువులు వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు విస్తరించాయి. మారుతున్న రైతుల అవసరాలను తీర్చే పనిని బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)లకు అప్పగించాలి. తమ గ్రామీణ శాఖలను వాటిలో విలీనం చేయాలి. వ్యవసాయ యంత్రాల కొనుగోలు రుణాలు, పంటల బీమా వంటి విధులను ఆర్‌ఆర్‌బీలు నిర్వహించాలి. రైతు రుణ అవసరాలు భారీగా ఉంటాయి కాబట్టి ఆర్‌ఆర్‌బీలతోపాటు గ్రామీణ సహకార బ్యాంకులూ రుణ వితరణ బాధ్యతను నిర్వహించాలి. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి నిర్వహణతోపాటు మరెన్నో కీలక బాధ్యతలు వహించే నాబార్డ్‌నూ పునర్‌వ్యవస్థీకరించాలి(banking sector reforms in india).

మారాల్సిన అజెండా

కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించే వ్యవస్థాపకులను బ్యాంకులు ప్రోత్సహించి, ఉపాధి కల్పనకు ఊతమివ్వాలి. అంకురాలు, భారత్‌లో తయారీ, స్టాండప్‌ ఇండియా(startup India) వంటి కార్యక్రమాలను చేపట్టినా- అవి నత్తనడకన సాగుతున్నాయి. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ప్రాధికార సంస్థను నెలకొల్పి పరిస్థితిలో గుణాత్మక మార్పు తీసుకురావాలని ప్రభాత్‌ కుమార్‌ కమిటీ సూచించింది. దాన్ని వెంటనే అమలు చేయాలి. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) ప్రస్తుతం స్థిరాస్తి, పారిశ్రామికేతర రంగాలకు నిధులు ఇస్తోంది. ఇక నుంచి ఈ తరహా రుణాలను వాణిజ్య బ్యాంకులకు వదిలిపెట్టి- తాను ఎంఎస్‌ఎంఈ రంగంలో కేవలం పారిశ్రామికోత్పత్తి సాగించే యూనిట్లకు ఆర్థిక సహాయం అందించాలి. సిడ్బి దగ్గరున్న నిధులను- ఇంక్యుబేషన్‌ నిధి, వెంచర్‌ క్యాపిటల్‌, ఈక్విటీ మార్కెటింగ్‌, సాంకేతికత-పునరావాస నిధి.. ఇలా అయిదు రకాలుగా సంఘటిత పరచాలి. వీటిని చిన్న పరిశ్రమల విస్తరణకు సమర్థంగా వినియోగించాలి. ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకులు ఇకపై ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ మీద దృష్టి కేంద్రీకరించాలి. గృహ, స్థిరాస్తి, సేవారంగాలు, ఎగుమతి, దిగుమతులకు రుణాల అందజేతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

అదే ఈ దుస్థితికి కారణం..

దీర్ఘకాలిక మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్టులకు రుణాలివ్వడం వల్లనే బ్యాంకులకు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరిగిపోయాయి. ఇలాంటి ప్రాజెక్టుల్లో ఉండే సాధకబాధకాల గురించి బ్యాంకులకు పూర్తి పరిజ్ఞానం, అనుభవం లేకపోవడం ఈ దుస్థితికి కారణం. రిజర్వు బ్యాంకు చేపట్టిన రుణ పునర్‌వ్యవస్థీకరణ వల్ల వాణిజ్య బ్యాంకులకు ఒరిగిందేమీ లేదు. కేవలం మౌలిక వసతుల రంగానికి ఆర్థిక చేయూత అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైంది. బ్యాంకింగ్‌ రంగ సమస్యలను విధానకర్తలు సమగ్రంగా పరిశీలించి, సమష్టిగా పరిష్కారాలు కనుక్కోవాలి. బ్యాంకుల సమర్థ నిర్వహణకు స్వతంత్ర డైరెక్టర్లను ఎంపిక చేయాలి. అటువంటి ఉద్ధండుల జాబితాను ప్రభుత్వం సిద్ధంగా ఉంచుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు విక్రయించి కమిషన్లు సంపాదించే పనిని పక్కనపెట్టి డిపాజిట్ల సేకరణ, రుణ వితరణపైనే బ్యాంకులు పూర్తి శ్రద్ధ వహించడం అవసరం. ఫిర్యాదుల స్వీకరణ, సత్వర పరిష్కారానికి సమర్థ యంత్రాంగాన్ని ఏర్పరచడంపైనా రిజర్వు బ్యాంకు దృష్టి సారించడం తప్పనిసరి. బ్యాంకింగ్‌ ఆంబుడ్స్‌మన్‌ పదవి పదునెక్కాలి. రుణ సంబంధ ఫిర్యాదులకు ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది.

స్వీయ దోషాలే కారణం

నగదు రహిత బ్యాంకింగ్‌ కార్యకలాపాలవల్ల డిపాజిట్లు క్రమేణా తగ్గిపోతున్నాయి. పని చేయని ఏటీఎమ్‌లు బ్యాంకులపై ఖాతాదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. బలహీన బ్యాంకింగ్‌ దేశ ఆర్థిక ప్రగతికి ఏమాత్రం క్షేమం కాదు. ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా ఎడాపెడా రుణాలు ఇచ్చేయడం వల్ల బ్యాంకులకు ఎన్‌పీఏలు పెరిగిపోయాయి. వ్యవసాయానికి, ఎంఎస్‌ఎంఈలకు లక్ష్యాల మేరకు రుణాలిచ్చేశామని బ్యాంకులు చెప్పుకొంటున్నా- వాస్తవంలో ఈ రెండు రంగాలు సరిపడా నిధులు అందక కునారిల్లుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల రాష్ట్రాలు రుణ మాఫీ మంత్రాన్ని జపించడమూ బ్యాంకులను దెబ్బతీస్తోంది. రాజకీయ కారణాలవల్ల కేంద్రం, రిజర్వు బ్యాంకు అటువంటి వాటికి అడ్డు చెప్పలేకపోతున్నాయి. ఏ వ్యాపారం వర్ధిల్లాలన్నా నైతిక వర్తన ముఖ్యం. అది లోపించినప్పుడు నిధులు పక్కదారి పడతాయి. నైతికత కొరవడటం, సమర్థ నిర్వహణ లోపించడం ప్రస్తుతం భారత బ్యాంకింగ్‌ రంగానికి శాపాలుగా పరిణమించాయి. ఈ దుస్థితిని తక్షణం సరిదిద్దాలి.

- డాక్టర్‌ బి.ఎర్రం రాజు (ఆర్థిక రంగ నిపుణులు)

ఇదీ చూడండి: ఆర్థిక సేవల్లో నయా ట్రెండ్​ 'నియో బ్యాంక్​'

ఇదీ చూడండి: Net Direct Tax: ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.