తొమ్మిది కీలక రంగాల్లో 3.08 కోట్ల ఉద్యోగాలు!

author img

By

Published : Sep 28, 2021, 5:31 AM IST

Employment in 9 sectors

తొమ్మిది వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాల సంఖ్య 3.08 కోట్లకు చేరిందని (Employment in India) కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఉద్యోగాల సంఖ్య ఏటా 4 శాతం పెరిగిందని తెలిపింది. మొత్తం ఉద్యోగాల్లో 41 శాతం ఒక్క ఉత్పత్తి రంగంలోనే ఉన్నాయని వివరించింది.

ఎంపిక చేసిన తొమ్మిది వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాల సంఖ్య (Employment in India) ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి 3.08 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిసింది. ఈ జాబితాలో నిర్మాణం, ఉత్పత్తి, ఐటీ/బీపీఓ, వాణిజ్యం, రవాణా, విద్య, వైద్యం, ఆతిథ్యం-రెస్టారెంట్‌, ఆర్థిక సేవల రంగాలు ఉన్నాయి. 2013-14 ఆర్థిక గణాంకాలతో పోలిస్తే ఈ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య ఏటా దాదాపు 4 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం ఏడు సంవత్సరాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ 'ఆల్‌-ఇండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్‌మెంట్‌-బేస్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సర్వే(ఏక్యూఈఈఎస్‌)' (Employment survey in India) పేరిట విడుదల చేశారు.

మొత్తం ఉద్యోగాల్లో 41 శాతం ఒక్క ఉత్పత్తి రంగంలోనే ఉండడం విశేషం. తర్వాత విద్యా రంగంలో 22 శాతం, వైద్య రంగంలో 8 శాతం, వాణిజ్యం 7శాతం, ఐటీ/బీపీఓ 7శాతం చొప్పున ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. గణాంకాల ఆధారంగా విధానాల రూపకల్పనే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. కరోనా సమయంలో దాదాపు 27 శాతం సంస్థల్లో ఉద్యోగాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే, దాదాపు 81 శాతం మంది ఉద్యోగులు మహమ్మారి సంక్షోభంలోనూ పూర్తిస్థాయి వేతనాలు అందుకున్నారని వెల్లడించారు.

ఐటీ/బీపీఓ రంగంలో ఉద్యోగాల కల్పన (jobs in IT sector) 152 శాతం వృద్ధి చెందిందని నివేదిక తెలిపింది. తర్వాత వైద్య రంగంలో 77 శాతం, విద్యలో 39 శాతం, ఉత్పత్తి రంగంలో 22 శాతం, రవాణా రంగంలో 68 శాతం, నిర్మాణ రంగంలో 42 శాతం వృద్ధి కనబడిందని పేర్కొంది. వాణిజ్య రంగంలో మాత్రం ఉపాధి కల్పన 25 శాతం, ఆతిథ్య-రెస్టారెంట్‌ రంగంలో 13 శాతం తగ్గినట్లు తెలిపింది. 90 శాతం సంస్థలు 100 మంది కంటే తక్కువ ఉద్యోగులతో పనిచేస్తున్నాయని వెల్లడించింది.

ఇదీ చదవండి: ఐటీ, ఏఐలో టీసీఎస్ ఫ్రీ కోర్సులు- అప్లై చేయండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.