'జాక్​ మా'ను మళ్లీ వెంటాడుతున్న చైనా సర్కార్!

author img

By

Published : Apr 17, 2021, 5:21 PM IST

Is Xi Jinping hounding Alibaba's Chinese billionaire Jack Ma again?

అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను చైనా ప్రభుత్వం చిక్కుల్లోకి నెడుతూనే ఉంది. తాజాగా.. అలీబాబా అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన చైనా నియంత్రణ సంస్థల అధికారులు.. ఆర్థిక సేవల కార్యకలాపాలను ప్రత్యేక హోల్డింగ్ కంపెనీ కిందకు తీసుకురావాలని సూచించారు. ఈ సంస్థపై ప్రభుత్వ నిఘా ఉంటుందని తెలిపారు.

చైనీస్ బిలియనీర్ జాక్​ మా, ఆయన కంపెనీ అలీబాబాను చైనా విడిచిపెట్టడం లేదు. మళ్లీ ఆయనపై జిన్​పింగ్ సర్కారు గురిపెట్టింది. ఏకపక్షంగా మార్కెట్​ను శాసిస్తున్నారన్న ఆరోపణలతో.. అలీబాబా అనుబంధ సంస్థ యాంట్​ గ్రూప్​పై దర్యాప్తు చేపట్టారు అధికారులు. కంపెనీ ప్రతినిధులతో నాలుగు ప్రభుత్వ ఏజెన్సీలు చర్చలు జరిపాయి.

ప్రభుత్వం తరపున పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్, చైనా సెక్యురిటీస్ కమిషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫారెన్ ఎక్స్ఛేంజీలు.. యాంట్​ గ్రూప్​తో చర్చలు జరిపినట్లు నిక్కీ ఏషియా వార్తా సంస్థ తెలిపింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ రంగ వార్తా ఏజెన్సీ అయిన 'షిన్హువా' కథనాన్ని ప్రస్తావించింది.

నిఘా కోసం ప్రత్యేక హోల్డింగ్!

అలీ పే సహా సంస్థ నిర్వహించే అన్ని ఆర్థిక సేవలను కొత్త ఫైనాన్సియల్ హోల్డింగ్ కిందకు తీసుకురావాలని సోమవారం జరిగిన చర్చల్లో అలీబాబా కంపెనీకి అధికారులు సూచించినట్లు తెలిపింది నిక్కీ. నూతనంగా ఏర్పాటయ్యే హోల్డింగ్ కంపెనీపై పూర్తి నిఘా ఉంటుందని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది.

ఇప్పటివరకు పెద్దగా ఉపయోగించని యాంటీ మోనోపలి(ఏకస్వామ్య వ్యతిరేక) చట్టాన్నీ.. అలీబాబాపై శనివారం ప్రయోగించింది జిన్​పింగ్ సర్కార్. 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇది.. 2019లో అలీబాబా దేశీయ అమ్మకాల్లో 4 శాతానికి సమానం.

చైనా విధానాలను, ఆ దేశ ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థను జాక్ మా విమర్శించినప్పటి నుంచి ఆయనకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమపై చేసే విమర్శలను తట్టుకోలేని జిన్​పింగ్ సర్కార్.. జాక్​ మాను లక్ష్యంగా చేసుకొని పగతీర్చుకుంటోంది. ఇటీవలే ఆయనను టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా పక్కనబెట్టేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.