'చిప్​'తో చైనాకు భారత్ చెక్- తైవాన్​తో కలిసి మాస్టర్ ప్లాన్!

author img

By

Published : Sep 27, 2021, 5:41 PM IST

chip shortage india china taiwan

క్వాడ్‌ కూటమిలో చేరి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు మింగుడుపడకుండా మారిన భారత్‌... డ్రాగన్‌కు చెక్‌ పెట్టే దిశగా మరిన్ని పావులు కదుపుతోంది. 5జీ పరికరాల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు ఉపయోగించే చిప్‌ల తయారీ పరిశ్రమను (Chip Production in India) భారత్‌లో నెలకొల్పేందుకు తైవాన్‌తో (Taiwan chip maker) కేంద్రం చర్చలు జరుపుతోంది. ఇందుకు తైవాన్‌ సుముఖంగా ఉండడం చైనాకు కంటగింపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశీయంగా చిప్‌ల కొరతను అధిగమించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ తైవాన్‌తో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. ప్రపంచంలో ఆధునిక చిప్‌ల తయారీలో తైవాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీదే అగ్రస్థానం. (Taiwan chip maker) ఈ నేపథ్యంలో తైనాన్‌తో చర్చలు జరుపుతున్న భారత్ ఈ ఏడాది చివరికల్లా దేశంలో చిప్‌ల తయారీ (Chip Production in India) కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం భారీగా ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ చర్యతో భారత్‌-చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు (India China Relations) తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విస్తృత చర్చలు

5జీ పరికరాల నుంచి ఎలక్ట్రిక్‌ కార్లలో ఉపయోగించే అన్ని రకాల (uses of Semiconductor) చిప్‌లను సరఫరా చేసేలా 7.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో చిప్‌ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు భారత అధికారులు తైవాన్‌తో కొన్నివారాలుగా (Taiwan chip maker) చర్చిస్తున్నారు. చిప్‌ పరిశ్రమ నెలకొల్పేందుకు అనువైన ప్రాంతం, భూమి, నీళ్లు, మానవ వనరుల లభ్యతపై మోదీ సర్కార్ ఇప్పటికే అధ్యయనం కూడా చేస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చిప్‌ తయారీ పరిశ్రమకు పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలతో పాటు 2023 వరకు 50శాతం ఆర్థిక సహకారాన్ని కూడా అందించేందుకు కూడా.. భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వీలైనంత త్వరగా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని తైవాన్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

చైనాకు కంటగింపు!

అయితే.. ఈ అంశంపై మాట్లాడేందుకు తైవాన్ అధికారులు నిరాకరిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా ప్రజాసామ్య దేశాలు ఆర్థికంగా, సైనిక పరంగా ఏకమవుతున్న తరుణంలోనే తైవాన్‌తో భారత్‌ చర్చలు జరపుతుండటం.. డ్రాగన్‌కు ఆగ్రహం తెప్పించే అవకాశముందని భావిస్తున్నారు. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమని చైనా చెబుతోంది. ఆ వాదనతో తైవాన్ విభేదిస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్‌తో భారత్ ఒప్పందం చేసుకుంటే చైనాకు కోపం రావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

క్వాడ్ అడుగులూ అటే...!

చైనాకు చెక్‌ పెట్టేందుకు క్వాడ్‌ కూటమిగా (QUAD Countries) ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల మధ్య ఇటీవల జరిగిన సమావేశంలోనూ చిప్‌ల సరఫరా అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు దేశాల మధ్య సరఫరా గొలుసు బలోపేతం, సైనిక సహకారం పెంపుపైనా చర్చ జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రధాని నరేంద్ర మోదీ చర్చల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వస్తువులు, సేవలు, పెట్టుబడులపై భారత్‌తో సమగ్రమైన ఒప్పందం వీలైనంత త‌్వరగా కుదరాలని తైవాన్‌ అధికారులు కోరుకుంటున్నారు.

దౌత్యదెబ్బ!

చిప్‌ల తయారీలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పెట్టుబడులను భారత్ ఆశిస్తోంది. ఇదే అదునుగా ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు పెంచుకుని చైనా ఒత్తిడిని అధిగమించాలని తైవాన్‌ భావిస్తోంది. అవసరమైతే తైవాన్‌ను సైనిక చర్యతో అయినా సరే తమ దేశంలో కలుపుకోవాలని చైనా అనుకుంటున్న నేపథ్యంలో భారత్‌-తైపీ మధ్య ఒప్పందం భారత్‌-చైనా మధ్య కొత్త ఘర్షణలకు దారితీసే అవకాశాలు ఉన్నాయనేది నిపుణుల మాట.

తైవాన్​కు హామీ..

భారత్‌ను వేధిస్తున్న చిప్‌ల కొరత రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తలపెట్టిన స్మార్ట్‌ ఫోన్‌ విడుదల వాయిదాకు కారణంగా మారింది. భారత్‌ సెమీకండక్టర్ల దిగుమతులు 24 బిలియన్ డాలర్లు ఉండగా... 2025 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరతాయని అంచనా. భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటును, సహకారాన్ని.... తైవాన్‌ ప్రభుత్వం స్వాగతిస్తోంది. కానీ భారత్‌లో పరిశ్రమ ఏర్పాటుకు తగిన వాతావరణం లేదని భావిస్తోంది. పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై స్పష్టత కోరుతోంది. ఆ మేరకు తైవాన్‌కు తగిన హామీలు ఇచ్చి ఒప్పందం చేసుకునేందుకు.. భారత్‌ సిద్ధమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.