భారత్​తో కెయిర్న్​ రాజీ- బిలియన్ డాలర్లు ఇస్తే కేసులు వాపస్!

author img

By

Published : Sep 7, 2021, 2:30 PM IST

Updated : Sep 7, 2021, 3:12 PM IST

CAIRN

రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో కెయిర్న్ ఎనర్జీ, భారత ప్రభుత్వం (cairn energy india case) మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. బిలియన్ డాలర్ల పన్నును తిరిగి తమకు చెల్లించేస్తే.. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్​పై వేసిన పన్నులన్నింటినీ ఉపసంహరించుకుంటామని కెయిర్న్ సీఈఓ ప్రకటించారు.

బ్రిటన్​కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్​సీ (cairn energy) కీలక నిర్ణయం తీసుకుంది. రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో (cairn retrospective tax) రాజీ కోసం భారత్​ చేసిన ప్రతిపాదనకు అంగీకరించింది. బిలియన్ డాలర్ల పన్నును తిరిగి తమకు చెల్లించేస్తే.. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్​పై వేసిన పన్నులన్నింటినీ కొద్దిరోజుల్లోనే ఉపసంహరించుకుంటామని (india cairn dispute ) కెయిర్న్ సీఈఓ సైమన్ థామ్సన్ స్పష్టం చేశారు. పీటీఐ ముఖాముఖిలో ఈమేరకు వెల్లడించారు.

"ప్రభుత్వంపై కేసులు ఉపసంహరించుకునేందుకు రీఫండ్ ఇచ్చే ఆఫర్​ మాకు ఆమోదయోగ్యమే. అమెరికాలోని ఎయిర్​ఇండియా విమానాలతో సహా ప్యారిస్ ఆస్తుల జప్తు కోసం దాఖలు చేసిన కేసులను కెయిర్న్ ఉపసంహరించుకుంటుంది. రీఫండ్ వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియ చేపడతాం. ఈ ఒప్పందాన్ని ఆమోదించి.. ముందుకెళ్లాలనే షేర్​హోల్డర్లు భావిస్తున్నారు."

-సైమన్ థామ్సన్, కెయిర్న్ సీఈఓ

పాత తేదీల నుంచి పన్ను వసూలు చేసే పద్ధతినే రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అని పిలుస్తారు.

'ఆ చట్టం భేష్'

రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలు విధానాన్ని ఉపసంహరిస్తూ చట్టం (retrospective tax law) తీసుకురావడం భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని అన్నారు థామ్సన్. వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం సైతం భావించినట్లు పేర్కొన్నారు.

"భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మేం సంతోషించాం. అది చాలా సాహసోపేత నిర్ణయం. ఇరువురి(భారత్, కెయిర్న్) ఉద్దేశం వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించుకోవడమే. వచ్చే కొన్ని వారాల్లో ఇది జరుగుతుందని భావిస్తున్నా. మాకు, మా షేర్​హోల్డర్లకే కాదు.. భారత్​కు కూడా ఇది చాలా ముఖ్యం. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్​ను భారత ప్రభుత్వం గౌరవించకపోవడం వల్లే ఈ వ్యాజ్యాలు తీసుకురావాల్సి వచ్చింది. రీఫండ్ ఇస్తే.. అన్ని కేసులను ఉపసంహరించుకుంటాం. ఇక ఇంతటితో ఈ వివాదం ముగుస్తుంది."

-సైమన్ థామ్సన్, కెయిర్న్ సీఈఓ

ఈ ప్రతిపాదనను స్వాగతించడం వల్ల.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పు (cairn arbitration award) ప్రకారం భారత్ చెల్లించాల్సిన పెనాల్టీ, దానిపై వడ్డీని కెయిర్న్ వదులుకోనుంది. 'మా సంస్థకు ఉన్న విలువలను తిరిగి సంపాదించడమే మాకు ముఖ్యం. ఆచరణాత్మకంగా వ్యవహరించి.. ఈ వివాదాన్ని వదిలేయాలని భావిస్తున్నాం' అని కెయిర్న్ సీఈఓ థామ్సన్ పేర్కొన్నారు.

కేసు నేపథ్యమిది!

విదేశీ కంపెనీలు భారత్​లోని తమ ఆస్తులను పరోక్ష పద్ధతిలో బదిలీ చేసుకున్నప్పటికీ.. పన్ను చెల్లించేలా ఆదాయ పన్ను చట్టానికి మార్పులు చేస్తూ 2012లో యూపీఏ సర్కారు బిల్లును తీసుకొచ్చింది. ఆ ఏడాది మే 28 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే, ఆ తేదీకి ముందు జరిగిన లావాదేవీలకు(రెట్రోస్పెక్టివ్) కూడా పన్ను వసూలు చేసేలా బిల్లును రూపొందించారు. దీని ప్రకారం.. కెయిర్న్ ఎనర్జీ సహా వొడాఫోన్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ.. ఆయా సంస్థలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాయి.

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో ఈ సంస్థలు దాఖలు చేసిన రెండు వేర్వేరు వ్యాజ్యాల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. వొడాఫోన్ విషయంలో పెద్దగా ప్రభావం లేకపోయినా.. కెయిర్న్ ఎనర్జీ కేసులో మాత్రం 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సొమ్ము చెల్లించకపోవడం వల్ల.. ఫ్రాన్స్​లోని భారత ఆస్తుల జప్తునకూ ఆదేశాలు వెలువడ్డాయి.

2012 నాటి చట్టం ఇలా ప్రభుత్వానికే చిక్కులు తెచ్చిన నేపథ్యంలో ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్​ విధానానికి మంగళం పాడుతూ ఇటీవల చట్టం చేసింది.

ఇదీ చదవండి: కెయిర్న్​ వివాదంలో భారత్​కు ఎదురుదెబ్బ

Last Updated :Sep 7, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.