ఐటీ రీఫండ్​ అంటూ మోసాలు.. ఆండ్రాయిడ్ యూజర్లే టార్గెట్!

author img

By

Published : Sep 22, 2021, 2:32 PM IST

Cyber Attacks on Mobile bank users

భారత సైబర్ స్పేస్​లో మరో భయంకరమైన మాల్వేర్​ స్వైర విహారం చేస్తున్నట్లు ఓ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించింది. ఈ మాల్వేర్​ ఆండ్రాయిడ్ ఫోన్లలో మొబైల్ బ్యాంక్ వాడే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ మాల్వేర్ బారిన పడకుండా ఉండేందుకు.. సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చిన సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

మీరు ఆండ్రాయిడ్​ ఫోన్​ వాడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. భారత సైబర్​ స్పేస్​లో ట్రోజన్​ మాల్వేర్​ను కనుగొన్నట్లు ఫెడరల్​ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మాల్వేర్ ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో మొబైల్ బ్యాంకింగ్ సేవలు వాడే యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ మాల్వేర్ దేశవ్యాప్తంగా ఉన్న 27 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

ఎలాంటి సైబర్ దాడులు జరగొచ్చు?

'ఇన్​కం ట్యాక్స్ రీఫండ్' పేరిట ఈ వైరస్​ ఫోన్​లోకి చొరబడి.. యూజర్ వ్యక్తిగత డేటాతోపాటు.. ఇతర సున్నితమైన సమచారాన్ని తెలుసుకునే వీలుందని పేర్కొంది కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్​ (సీఈఆర్​టీ). దీని ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలు జరగొచ్చని వివరించింది.

ఎలా జరగొచ్చు?

ఆదాయపు పన్ను శాఖను పోలిన నకిలీ లింక్ ఎస్​ఎంస్​ ద్వారా ఫోన్​లోకి వస్తుంది. ఈ లింక్​ను క్లిక్​ చేస్తే.. ఆధార్​, పాన్​ వివరాలతో పాటు.. ఇతర వ్యక్తిగత సమాచారం కోరుతుంది. ఆ వివరాలన్నీ సమర్పిస్తే.. వాటిని నిర్ధరించేందుకు గుర్తింపు లేని ఏపీకే ఫైల్​ను డౌన్​లోడ్​ చేయమని సూచిస్తుంది. ఈ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుని ఇన్​స్టాల్​ చేయాలంటే.. ఎస్​ఎంఎస్​లు, కాల్స్​ సహా ఇతర ఫైళ్లను యాక్సెస్​ చేసేందుకు అనుమతులు అడుగుతుంది. దీని ద్వారా ఈజీగా మాల్వేర్ డేటాను తస్కరించే వీలుంది. అయితే ఆ నకిలీ లింక్​ నిజమైన వెబ్​సైట్​ను పోలి ఉండటం వల్ల ఎక్కువ మంది దానిని నమ్మి మోసపోయే అవకాశముందని సీఈఆర్​టీ పేర్కొంది.

ఎలా జాగ్రత్త పడాలి?

అందుకే లింక్​ను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది సెబర్​ సెక్యూరిటీ ఏజెన్సీ. ఎస్​ఎంస్​ ద్వారా అలాంటి లింక్ వస్తే ముందు.. అది నిజమైందో కాదో అని తెలుసుకునేందుకు ఒరిజినల్​ వెబ్​సైట్​ను చూసి నిర్ధరించుకోవాలని తెలిపింది.

ఇదీ చదవండి: ఇక ఇంటి వద్దే కొత్త సిమ్​ కార్డ్​.. ఆధార్​ ఉంటే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.