రాబడి హామీ పాలసీలు లాభదాయకమేనా?

author img

By

Published : Mar 11, 2022, 12:13 PM IST

Updated : Mar 11, 2022, 4:11 PM IST

insurance policy

Guaranteed Income Plan: మన పెట్టుబడుల పనితీరు ఎలా ఉంది? అనుకున్న లక్ష్యాల సాధన దిశగానే వెళ్తున్నామా? జాబితాలో మార్పులు చేర్పులు చేయాలా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవడం ఎప్పుడూ ముఖ్యమే. కాలానుగుణంగా మారే లక్ష్యాలు కొత్త పథకాలను ఎంచుకోవాల్సిన అవసరాన్ని తీసుకొస్తాయి. జీవితంలో మారే దశలను బట్టి, సురక్షిత, రాబడి హామీనిచ్చే పథకాలు మీకు అవసరం కావచ్చు. ఏ సందర్భాల్లో ఇవి తోడుగా ఉంటాయో తెలుసుకోవాలి. అప్పుడే వీటి నుంచి ప్రయోజనం పొందగలం.

Guaranteed Income Plan: పాలసీని ఎంచుకునేటప్పుడే జీవిత బీమా రక్షణతో పాటు, వ్యవధి తీరాక ఎంత మొత్తం చెల్లిస్తామనే హామీతో వస్తున్న పథకాలే 'గ్యారంటీడ్‌ ఇన్‌కం స్కీం'లు. పేరులోనే ఉన్నట్లు ఇవి రాబడికి హామీ ఇస్తాయి. అన్ని రకాల నష్టభయాలకు ఇవి పరిష్కారం చూపిస్తాయి. నష్టభయం ఏమాత్రం భరించలేని వారు.. పాలసీ కొనసాగుతున్నన్ని రోజులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పని చెల్లింపులు, వ్యవధి పూర్తయ్యాక ప్రీమియాలను వెనక్కి ఇచ్చే తరహా పాలసీలను ఎంచుకోవచ్చు. కాస్త నష్టభయం భరించేవారు.. పెట్టుబడుల జాబితాలో నష్టభయం ఉండే పథకాలతోపాటు, రాబడి హామీ పథకాలను కలిపి ఎంచుకోవాలి. దీనివల్ల కొంచెం అధిక రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది.

ఆదాయ లోటు భర్తీ

పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి, సంపాదించేటప్పుడే రిటైర్మెంట్‌ తర్వాత క్రమం తప్పని ఆదాయం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికి ఈ రాబడి హామీ పథకాలు నప్పుతాయి. మీ ప్రాథమిక ఆదాయానికి ఇవి తోడుగా ఉండి, కుటుంబ అవసరాలను తీరుస్తాయని చెప్పొచ్చు. ఫలితంగా మీపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.

ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా

మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు, మీ అవసరాలు తీర్చే విధంగా ఈ పాలసీలను తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి, చెల్లింపులు ఎలా చేస్తారు అనే దగ్గర్నుంచి, బీమా సంస్థలు తిరిగి చెల్లించేటప్పుడు ఏ విధంగా ఆదాయం అందుకోవాలి అనే వరకు అన్నీ మీ ఇష్టానుసారమే ఎంచుకోవచ్చు. కొన్నాళ్ల తర్వాతే ఆదాయం వచ్చేలా పాలసీలో మార్పు చేసుకోవచ్చు. దీనివల్ల అవసరాలు ఉన్నప్పుడే ఆదాయం అందుకోవచ్చు. పిల్లల చదువులు, వారి వివాహం తదితర లక్ష్యాలకు ఇవి తోడ్పడతాయి.

ఎలా పనిచేస్తుంది?

రాబడి హామీ పథకాన్ని ఎంచుకున్నప్పుడు.. మీరు ముందుగా ఎన్నేళ్లు ప్రీమియం చెల్లించగలరో చూసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటి నుంచి మీకు ఆదాయం రావాలి అనేది నిర్ణయించుకోవాలి. అప్పుడు పాలసీదారుడి వయసు ఆధారంగా ఎంత ఆదాయం, ఎప్పటి నుంచి కావాలి అనేది చూసి, పాలసీ విలువ ఎంత ఉండాలనేది లెక్కిస్తారు. ఆ పాలసీలో ఉండే వెసులుబాట్లను బట్టి, ఆదాయం లభిస్తుంది. కొన్ని పాలసీల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొన్నింటిలో నిర్ణీత వ్యవధుల్లో ఆదాయం కొంత శాతం పెరుగుతూ ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే దీన్ని ఎంచుకోవాలి.

అదనపు ఖర్చులు:

ప్రస్తుతం మీకు అందుతున్న ఆదాయం మీ రోజువారీ ఖర్చులకు సరిపోతుండొచ్చు. కానీ, భవిష్యత్తులో వచ్చే అదనపు ఖర్చుల సంగతేమిటి? దీనికోసం అప్పులు తీసుకునే వీలుంది. కానీ, వాటిని తిరిగి చెల్లించడం సాధ్యం కాకపోతే.. ఆరోగ్య అత్యవసరం ఏర్పడినప్పుడు వైద్య చికిత్సకు అవసరమైన సొమ్ము గురించి ఇబ్బందులు ఉండకూడదు కదా.. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు రాబడి హామీ పథకాలు ఉపయోగపడతాయి. బీమా రక్షణ ఉండటం వల్ల పాలసీదారుడికి అనుకోనిదేదైనా జరిగినా.. నామినీ/కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుంది. వారు ప్రస్తుత జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు వీలవుతుంది.

అనిశ్చితి లేకుండా

ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి, మార్కెట్‌ ఆధారిత పథకాలు అందించే రాబడుల్లో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. కానీ, రాబడి హామీ పథకాల విషయానికి వస్తే.. వీటిలో మార్కెట్‌తో అనుసంధానమైన హెచ్చుతగ్గులు ఉండవు. పాలసీ ప్రారంభంలోనే రాబడి గురించి హామీ ఉంటుంది. కాబట్టి, చెల్లింపులు క్రమం తప్పకుండా ఉంటాయి.

సుదీర్ఘకాలంలో పెట్టుబడులు సురక్షితంగా ఉండాలని అనుకున్నప్పుడు రాబడి హామీనిచ్చే బీమా పథకాలను ఎంచుకోవచ్చు. వ్యవధి తీరాక అందుకున్న ప్రయోజనాలకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10 (10డీ) ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది.

పెరిగే ఖర్చులను తట్టుకునేలా

ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. మన డబ్బు విలువను ఇది తగ్గిస్తూనే ఉంది. ఖర్చులు అధికం అవుతున్నాయి. భవిష్యత్తులో ఇదే స్థాయి జీవన ప్రమాణాలు కొనసాగించాలంటే.. అధిక ఆదాయం అవసరం. ఇన్‌కం ప్లాన్ల నుంచి వచ్చే మొత్తం సహాయంగా ఉంటుంది.

- సమీర్‌ జోషి, చీఫ్‌ ఏజెన్సీ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఇదీ చూడండి : సన్​ఫ్లవర్​ సాగు పెరిగితే రైతులకు మంచి లాభాలు

Last Updated :Mar 11, 2022, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.