భారత్​ నుంచి అమెరికాకు మామిడి... అక్కడ నుంచి మనకు పంది మాంసం!

author img

By

Published : Jan 11, 2022, 7:46 PM IST

India gets approval to export Mango

Mango Export To USA: కొత్త సీజన్‌లో అమెరికాకు మామిడిని ఎగుమతి చేసేందుకు భారత్​కు అనుమతి లభించింది. ఈ మేరకు ఆ దేశ వ్యవసాయ విభాగం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రెండేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలిగిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు అగ్రరాజ్యం నుంచి పంది మాంసాన్ని దిగుమతి చేసుకునేందుకు కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

Mango Export To USA: భారత్‌ నుంచి అమెరికాకు మామిడి ఎగుమతులపై సుమారు రెండేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త సీజన్‌లో అమెరికాకు మామిడిని ఎగుమతి చేసేందుకు ఆ దేశ వ్యవసాయ విభాగం నుంచి భారత్‌ అనుమతి పొందింది.

భారత్‌లో మామిడిని మాగబెట్టే ప్రక్రియను పరిశీలించేందుకు అమెరికా వ్యవసాయ విభాగం ఇన్‌స్పెక్టర్‌లు వస్తుంటారు. అయితే కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల నేపథ్యంలో 2020 నుంచి వీరు రావడం కుదరలేదు. ఈ నేపథ్యంలో 2020లో భారత్‌ నుంచి మామిడి దిగుమతిని అమెరికా నిలిపివేసింది.

అయితే 2021 నవంబర్‌ 23న రెండు దేశాలు పరస్పర ప్రయోజనం పొందేలా భారత వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ సంఘం, అమెరికా వ్యవసాయ విభాగం మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మామిడిని మాగబెట్టేందుకు రెండు దేశాలు సంయుక్త ప్రోటోకాల్‌ను పాటిస్తాయి. భారత్‌ మామిడి, దానిమ్మను అమెరికాకు ఎగుమతి చేసి చెర్రీ, అల్ఫాల్ఫాను దిగుమతి చేసుకుంటుంది. 2019-20 సీజన్‌లో భారత్‌ అమెరికాకు ఒక వెయ్యి 95 మెట్రిక్‌ టన్నుల మామిడిని ఎగుమతి చేసింది.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మామిడి పంటను సాగు చేసే రైతులు లబ్ధిపొందనున్నట్లు అధికారులు తెలిపారు.

అమెరికా నుంచి భారత్​కు పంది మాంసం..

అమెరికా నుంచి భారత్​ ఇకపై పంది మాంసం, దాని సంబంధిత ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్​, వ్యవసాయ కార్యదర్శి టామ్ విల్సాక్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నిర్ణయంతో అమెరికా వ్యవసాయ వాణిజ్యానికి దీర్ఘకాలికంగా ఉన్న అడ్డంకులు తొలిగినట్లు అయ్యిందని కేథరీన్​ తాయ్​ అన్నారు.

గత ఏడాది నవంబర్‌లో జరిగిన భారత్​ అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరమ్ సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్​ గోయల్‌తో అమెరికా రాయబారి కేథరీన్​ తాయ్ సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి భారత్​కు పంది మాంసం దిగుమతి చేసుకునే విషయంపై చర్చించారు.

2020 గణాంకాల ప్రకారం అమెరికా పంది మాంసాన్ని ఉత్పత్తి చేసే మూడో అతి పెద్ద దేశం. అంతేగాకుండా పంది మాంసాన్ని ఎగుమతి చేయడంలో రెండో స్థానంలో ఉంది.

ఇవీ చూడండి:

వొడాఫోన్​ఐడియాలో ప్రభుత్వం చేతికి 36 శాతం వాటా

అంబానీని మించిన జావో- ప్రపంచ కుబేరుడైన క్రిప్టో బిలియనీర్‌

స్కోడా 'ఎస్​యూవీ కోడియాక్​' న్యూ వెర్షన్​- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.