భారత్​లో ఉద్యోగాల విపణి కళకళ- సెప్టెంబరులో 57% వృద్ధి

author img

By

Published : Oct 10, 2021, 7:05 AM IST

Indian Job Market

వరసగా మూడో నెలలోనూ దేశం​లో ఉద్యోగ నియామకాలు పెరిగాయని ఓ నివేదికలో తేలింది. సెప్టెంబరులో భారత ఉద్యోగాల మార్కెట్‌(Indian Job Market) 57 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఆ నివేదిక చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఐటీ(138 శాతం), ఆతిథ్యం (82 శాతం) చొప్పున వార్షిక వృద్ధిని నమోదు చేశాయని పేర్కొంది.

వరుసగా మూడో నెలా భారత ఉద్యోగాల మార్కెట్‌(Indian Job Market) రికార్డుల జోరును కొనసాగించింది. సెప్టెంబరులో 57 శాతం వృద్ధి నమోదుచేసినట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ నివేదిక పేర్కొంది. సెప్టెంబరులో 2,753 కొత్త ఉద్యోగ పోస్టింగ్‌లతో కొవిడ్‌ మునుపటి స్థాయిని అధిగమిస్తూ సూచీ(Indian Job Market) జీవనకాల గరిష్ఠాన్ని తాకిందని వెల్లడించింది. 2019 సెప్టెంబరులో ఉద్యోగాల వృద్ధి 21 శాతంగా ఉంది.

నౌకరీ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌పై వచ్చే ఉద్యోగాల ఆధారంగా నియామకాల కార్యకలాపాలను నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ(Naukri Jobspeak Index) లెక్కిస్తుంది. వివిధ పరిశ్రమలు, నగరాలు, అనుభవ స్థాయుల్లో నియామకాల ధోరణి తెలుసుకునేందుకు ఈ సూచీని చూస్తారు. గతేడాదితో పోలిస్తే ఐటీ(138 శాతం), ఆతిథ్యం (82 శాతం) చొప్పున వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

నివేదికలోని మరిన్ని అంశాలు ఇలా..

  • భారత సంస్థలు డిజిటల్‌కు మారతుండటంతో టెక్‌ నిపుణులకు అధిక గిరాకీ ఏర్పడింది. సెప్టెంబరులో ఐటీ-సాఫ్ట్‌వేర్‌/సాఫ్ట్‌వేర్‌ సేవల రంగం 138 శాతం వృద్ధి సాధించడమే ఇందుకు నిదర్శనం.
  • కరోనా సంక్షోభంతో ఎక్కువగా కుదేలైన ఆతిథ్యం, రిటైల్‌ రంగాలూ గత నెలలో వరుసగా 82 శాతం, 70 శాతం చొప్పున వృద్ధి చెందాయి. దేశంలో పలు హోటళ్లు, రిటైల్‌ స్టోర్‌లు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి.
  • ఇక విద్య (53 శాతం), బ్యాంకింగ్‌/ఆర్థిక సేవలు (43 శాతం), టెలికాం/ఐఎస్‌పీ (37 శాతం) రంగాల్లో నియామక కార్యకలాపాలు పెరిగాయి.
  • మెట్రో నగరాల్లో 88 శాతం వార్షిక వృద్ధి నమోదుకాగా, ద్వితీయ శ్రేణి నగరాల్లో 30 శాతం మేర ఉద్యోగాల వృద్ధి కనిపించింది. ప్రధాన నగరాల్లో ఐటీ ఉద్యోగాల్లో సానుకూల వృద్ధి ఇందుకు దోహదపడింది.
  • నగరాల వారీగా చూస్తే.. బెంగళూరు (133 శాతం), హైదరాబాద్‌ (110 శాతం), పుణె (95 శాతం), చెన్నై (85 శాతం) అత్యధిక వృద్ధి సాధించాయి. దిల్లీ/ఎన్‌సీఆర్‌ (72 శాతం), ముంబయి, కోల్‌కతా (60 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • ద్వితీయ శ్రేణి నగరాల్లో అహ్మదాబాద్‌ (82 శాతం), కోయంబత్తూర్‌ (46 శాతం), వడోదరా (33 శాతం), కోచి (19 శాతం) ముందు స్థానాల్లో ఉన్నాయి.
  • అనుభవం ఎక్కువగా ఉన్న శ్రేణుల్లో నియామకాలు గణనీయంగా పెరిగాయి. కరోనా నుంచి నియామక విపణి కోలుకోవడాన్ని ఇది సూచిస్తోంది.
  • 8-12 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్‌ నిపుణులకు 75 శాతం గిరాకీ పెరిగింది. 4-7 ఏళ్లు (65 శాతం), 13-16 ఏళ్లు (57 శాతం), 0-3 ఏళ్లు (54 శాతం), 16 ఏళ్లు పైబడిన (38 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఆగస్టులో నమోదైన 2,673తో పోలిస్తే గత నెలలో జాబ్‌ పోస్టింగ్‌లు 3 శాతం పెరిగాయి. భారత్‌ ఇప్పటివరకు చూడని నియామకాల జోరును నమోదుచేస్తోందని, ఐటీ నిపుణులకు గిరాకీ, పండగల సీజన్‌ వంటివి ఇందుకు దోహదపడుతున్నట్లు నౌకరీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.