ఎల్‌ఐసీ ఐపీఓకి మే 12 వరకే గడువు.. ఆ తర్వాత..

author img

By

Published : Mar 14, 2022, 4:43 AM IST

lic ipo

LIC IPO: ఎల్​ఐసీ ఐపీఓ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రానికి మే 12 వరకు గడువున్నట్లు అధికారులు వెల్లడించారు . అయితే ఆ గడువు దాటితే మరోసారి ఐపీఓకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకి సెబీ ఇటీవల ఆమోదం తెలిపింది. మే 12 వరకు ఐపీఓ ప్రక్రియను ప్రారంభించేందుకు సమయం ఉందని సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అప్పటి వరకు తిరిగి తాజా ముసాయిదా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఆ గడువు దాటితే.. మరోసారి ఐపీఓకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికే ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం అడ్డంకిగా మారింది. మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్న ఈ సమయంలో ఐపీఓకి రావడం మదుపర్లకు అంత లాభదాయకం కాదని యోచిస్తోంది. దీంతో ఎంతకాలం ఐపీఓని వాయిదా వేయనున్నారనే దానిపై పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరీ ఆలస్యమైతే మరోసారి సెబీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థకు చెందిన ఉన్నతాధికారి స్పందించారు.

మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తూ.. త్వరలో తుది ముసాయిదా పత్రాలు కూడా సమర్పించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సదరు అధికారి తెలిపారు. అందులో ధరల శ్రేణి, వివిధ వర్గాల వాటా వంటి వివరాలు ఉంటాయన్నారు. ఈ ఐపీఓ ద్వారా రిటైల్‌ మదుపర్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు సమీకరించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ చిన్న మదుపర్లు అంత మొత్తం షేర్లకు బిడ్‌ వేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు కోలుకొని.. వారిలో విశ్వాసం పేరిగే వరకు వేచిచూడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఎల్‌ఐసీ ఎంబెడెడ్‌ వాల్యూ (భవిష్యత్తు లాభాల ప్రస్తుత విలువ, సర్దుబాటు చేసిన నికర ఆస్తి విలువ కలిసి)ని రూ.5 లక్షల కోట్లుగా లెక్కించారు. ఒకవేళ మే 12 నాటికి ఐపీఓకి రాకపోతే.. డిసెంబరు ఫలితాలతో పాటు తాజా పరిచిన ఎంబెడెడ్‌ వాల్యూని పేర్కొంటూ మరోసారి ముసాయిదా పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఫిబ్రవరి 13న దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది.

ఇదీ చూడండి : అమెరికా షేర్లలో పెట్టుబడులు పెట్టాలా? ఇది మీకోసమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.