ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ

author img

By

Published : Nov 25, 2021, 7:01 AM IST

Gautam Adani Net Worth

రోజుకు రూ.1000 కోట్లు సంపాదిస్తే.. అలా ఏడాదంతా కనకవర్షం కురిస్తే.. అది కూడా ఒక్క వ్యక్తి సాధిస్తే, ఆయనే అదానీ అవుతారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా గౌతమ్‌ అదానీ (Gautam Adani Net Worth) నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ వెల్లడిస్తోంది.

ఇప్పటి వరకు ఆసియా అపర కుబేరుడి కిరీటం ముకేశ్‌ అంబానీదే. తాజాగా ఈ ఘనత గౌతమ్‌ అదానీకి (Gautam Adani Net Worth) వెళ్లింది. గత ఏడాది కాలంలోనే అదానీ సంపద 55 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4.12 లక్షల కోట్లు/ రోజుకు రూ.1000 కోట్లకు పైగా) పెరగడమే ఇందుకు కారణం. అదే సమయంలో ముకేశ్‌ అంబానీ నికర సంపద విలువ 14.3 బిలియన్‌ డాలర్ల (రూ.1.07 లక్షల కోట్లకుపైగా) మేరే పెరిగినందున ముకేశ్‌ స్థానాన్ని అదానీ (Gautam Adani Net Worth) సొంతం చేసుకోగలిగారని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడిస్తోంది.

ఈ సూచీ ప్రకారం.. 9100 కోట్ల డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ఇప్పటివరకు ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటే, గౌతమ్‌ అదానీ (Gautam Adani Net Worth) 8880 కోట్ల డాలర్లతో అంటే రెండోస్థానంలో ఉన్నారు. బుధవారమూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) షేర్లు నష్టాల పాలు కావడం.. అదే సమయంలో గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు రాణించడంతో, ముకేశ్‌ను అదానీ అధిగమించారు.
నీ షేర్ల విలువ ప్రకారం ఈ స్థానాలు మారుతూ ఉంటాయన్నది గమనించాలి.

సౌదీ ఆరామ్‌కో ఒప్పందం రద్దు వల్లే

ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కోకు 1500 కోట్ల డాలర్లకు విక్రయించాలన్న ప్రతిపాదన రద్దవడంతో, బుధవారం ఆర్‌ఐఎల్‌ షేర్లు నష్టాల పాలయ్యాయి. బీఎస్‌ఈలో షేరు 1.48% తగ్గి రూ.2350.9 వద్ద ముగియడంతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.22,000 కోట్ల మేర తగ్గింది. ఆర్‌ఐఎల్‌లో దాదాపు 50 శాతంగా ఉన్న ముకేశ్‌ అంబానీ నికర సంపద విలువ కూడా రూ.11,000 కోట్ల మేర తగ్గింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు సైతం 1.57% నష్టపోవడంతో, మార్కెట్‌ విలువ కాస్త తగ్గింది. మరో పక్క, అదానీ గ్రూప్‌ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువకు స్థూలంగా రూ.12,000 కోట్లు; నికరంగా రూ.4250 కోట్లు జత చేసుకున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 2.76 శాతం; అదానీ పోర్ట్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ షేరు 4.59% రాణించాయి.

ఆర్‌ఐఎల్‌ అత్యంత విలువైన కంపెనీ

అదానీ గ్రూప్‌ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్లకు చేరగా.. ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.14.91 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఆర్‌ఐఎల్‌యే దేశీయంగా అత్యంత విలువైన కంపెనీ. కానీ ఆర్‌ఐఎల్‌లో ముకేశ్‌కు ఉన్న వాటాతో పోలిస్తే అదానీకి తన గ్రూప్‌ కంపెనీల్లో ప్రమోటరు వాటా అధికంగా ఉండడంతో, ఆయన అత్యంత సంపన్నుడయ్యారు.

ఇదీ చూడండి : Star Health IPO: స్టార్​హెల్త్​ ఐపీఓ తేదీ ఖరారు- వివరాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.