పెట్రోల్, డీజిల్​ ధరలను ఎలా నిర్ణయిస్తారు?

author img

By

Published : Jul 3, 2021, 6:55 PM IST

crude_oil_story

పెట్రోల్, డీజిల్​లకు ఆధారమైన ముడిచమురు ధరను బెంచ్ మార్క్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న బెంచ్ మార్కులు ఏంటి? వివిధ బెంచ్ మార్కుల మధ్య తేడాలు ఏమిటి? మన దేశంలో ముడిచమురు ధర వేటిపై ఆధారపడి ఉంటుంది? తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురును ధరలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని బెంచ్ మార్క్ ఇండెక్స్​ల ద్వారా వీటి గురించి తెలుసుకోవచ్చు. డబ్ల్యూటీఐ(WTI-West Texas Intermediate), బ్రెంట్ బ్లెండ్, దుబాయి క్రూడ్​లను ప్రాథమిక బెంచ్ మార్క్​లుగా తీసుకుంటారు. ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్​పోర్టింగ్ కంట్రీస్) ఉపయోగించే ఒపెక్ రిఫరెన్స్ బాస్కెట్, సింగపూర్ ఉపయోగించే 'టపీస్ క్రూడ్', రష్యా ఉపయోగించే 'ఉరల్స్ ఆయిల్'ను ప్రామాణికంగా పరిగణిస్తారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 195 క్రూడ్ ఆయిల్ ఇండెక్స్​లు ఉన్నాయి.

ముడి చమురులో నాణ్యత పరంగా పలు రకాలు ఉన్నాయి కాబట్టి పలు రకాల బెంచ్ మార్కులు ఉన్నాయి. అమెరికన్ పెట్రోలియం ఇనిస్టిట్యూట్(ఏపీఐ) నిర్ణయించే గ్రావిటీ, సల్ఫర్​ల శాతాన్ని బట్టి ముడిచమురు నాణ్యత నిర్ణయిస్తారు.

ముడిచమురు..

ఏపీఐ గ్రావిటీ 10 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నీటి కంటే బరువు తక్కువ ఉన్నట్లు. అంటే ఇది నీటిపై తేలుతుంది. 10 కంటే తక్కువుంటే నీటి బరువు కంటే ఎక్కువ ఉన్నట్లు కాబట్టి నీటిలో మునుగుతుంది. సల్ఫర్ తక్కువ ఉంటే ఎక్కువ నాణ్యత ఉన్నట్లు. అన్ని క్రూడ్ ఆయిల్స్ కంటే డబ్ల్యూటీఐ ఎక్కువ నాణ్యత కలది. ఏపీఐ గ్రావిటీ 39.6 శాతం ఉంటుంది. సల్ఫర్ 0.26 శాతం మాత్రమే ఉంటుంది. బ్రెంట్ బ్లెంట్​ను 15 ఆయిల్ బావుల నుంచి బ్లెండ్ చేస్తారు. 0.37 శాతం సల్ఫర్ ఉంటుంది. 38.06 ఏపీఐ గ్రావిటీ ఉంటుంది. డబ్ల్యూటీఐతో పోల్చితే ఇది కొంత తక్కువ నాణ్యత కలది.

ఇదీ చదవండి: ఏడాది గరిష్ఠానికి ముడి చమురు ధరలు

భారత్​లో ఎలా..?

భారతదేశంలో ముడిచమురు ధరల ట్రాకింగ్ కోసం ఇండియన్ బాస్కెట్​ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇండియన్ క్రూడ్ బాస్కెట్ దుబాయి, ఒమన్, బ్రెంట్ క్రూడ్ ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. వేటెడ్ యావరేజ్ ద్వారా దీన్ని గణిస్తారు. 2018-19 లో ఇండియన్ క్రూడ్ బాస్కెట్​లో దుబాయి, బ్రెంట్ నిష్పత్తి 75.50:24.50గా ఉంది.

ధరలు ఎలా మారుతుంటాయి?

డిమాండ్ సరఫరా ఆధారంగా ముడిచమురు ధరలు ఉంటాయి. ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్ దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. దీనివల్ల సరఫరా తగ్గి ధరలు పెరుగుతుంటాయి. డాలర్ మారకం విలువ సైతం చమురు ధరలను ప్రభావితం చేస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.