బిట్​కాయిన్​పై 'బేర్' పంజా.. ప్రభుత్వ నియంత్రణే కారణం!

author img

By

Published : Nov 25, 2021, 9:05 AM IST

Crypto currencies

దేశీయంగా క్రిప్టో కరెన్సీ(cryptocurrency news) విలువ బుధవారం అమాంతంగా పతనమైంది. ఈ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ యత్నాల ఫలితంగా ప్రముఖ ఊహాజనిత కరెన్సీలైన బిట్ కాయిన్, ఎథేరియమ్ వంటి కాయిన్ల విలువ కుప్పకూలిపోయింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి క్రిప్టో కరెన్సీ విలువ కోలుకున్నప్పటికీ సమీప భవిష్యత్​లోనూ అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో(parliament winter session) 'క్రిప్టో' బిల్లు తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్రం. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో ఒడుదొడుకులు తప్పవని అంచనా..

దేశంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ లావాదేవీలను(cryptocurrency trading in india) నియంత్రించడంతో పాటు అధీకృత డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 'క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు-2021'ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో బుధవారం దేశీయంగా బిట్‌ కాయిన్‌, ఎథేరియమ్‌ తదితర క్రిప్టో కరెన్సీల విలువలు భారీగా పతనమయ్యాయి. క్రిప్టో కరెన్సీల్లో అత్యంత అధిక ఆదరణ కల బిట్‌ కాయిన్‌(bitcoin news latest) ధర 25 శాతం, ఎథేరియమ్‌ ధర 30 శాతం క్షీణించినా తర్వాత కోలుకున్నాయి. క్రిప్టో ఎక్స్ఛేంజీ వజీరెక్స్‌లో ఒక బిట్‌ కాయిన్‌ ధర రూ.46 లక్షల నుంచి రూ.36 లక్షలకు పడిపోయినా, మళ్లీ కోలుకుని రూ.40 లక్షల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎథేరియమ్‌ ధర రూ.3.4 లక్షల నుంచి రూ.2.4 లక్షలకు పతనమైనా, మళ్లీ కోలుకుని రూ. 3 లక్షల ధర పలుకుతోంది.

అయితే అంతర్జాతీయంగా బిట్‌ కాయిన్‌, ఇతర క్రిప్టో కరెన్సీల ధరలు మనదేశ ఎక్స్ఛేంజీల్లో మాదిరిగా క్షీణించలేదు. బిట్‌కాయిన్‌ ధర 2.6 శాతం తగ్గినా, మళ్లీ కోలుకుని 56,000 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దీని ప్రకారం చూస్తే, మన ప్రభుత్వ బిల్లు ప్రతిపాదన దేశీయ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లలో(cryptocurrency investors in india) ఆందోళన కలిగించి, పెద్దఎత్తున అమ్మకాలకు దిగేందుకు కారణమైందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు క్రిప్టోకరెన్సీలలో(private cryptocurrency in india) పెట్టుబడులు పెట్టినవారు, నిర్దేశిత గడువులోగా ఉపసంహరించుకునే వీలు కల్పిస్తారని సమాచారం.వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వసూలు చేసే విధంగా క్రిప్టో ఆదాయాలను పన్ను పరిధిలోకి తీసుకురావచ్చని అంటున్నారు.

ఆచితూచి స్పందించిన క్రిప్టో పరిశ్రమ..

క్రిప్టో ఆస్తులను నియంత్రించే విషయంలో ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు తీసుకోరాదని క్రిప్టో కరెన్సీ పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను నిషేధించాలనేది ప్రభుత్వ ఉద్దేశమే అయినా, క్రిప్టో కరెన్సీలో ఉన్న బ్లాక్‌చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానం(cryptocurrency blockchain technology), దాని ప్రయోజనాలను అందిపుచ్చుకోడానికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలనే ఆలోచనా ఉంది. ఏ వ్యక్తి క్రిప్టోకరెన్సీ మైనింగ్‌, ఉత్పత్తి-జారీ, కొనుగోలు-అమ్మకం, బదిలీ, వాటితో ఒప్పందాలు చేయకుండా, కలిగి ఉండకుండా నిరోధించేలా బిల్లు ఉంటుందనీ చెబుతున్నారు. మనదేశంలోని క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు బైయూ కాయిన్‌ సీఈఓ శివమ్‌ థక్రాల్‌ తెలిపారు. బిట్‌కాయిన్‌, ఎథేరియమ్‌ వంటి అధిక ఆదరణ గల క్రిప్టో ఆస్తులను ముందస్తు అనుమతితో ఎక్స్ఛేంజీల్లో క్రయవిక్రయాలకు వీలుకల్పించాలని, పన్ను విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ విధానానికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చేవరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఎదురు చూడాలని కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ సీఈఓ ఆశిష్‌ సింఘాల్‌ వివరించారు. మదుపర్ల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించాలని ఓకేఎక్స్‌.కామ్‌ సీఈఓ జే హో కోరారు.

కొన్నింటికే అనుమతి?

క్రిప్టో కరెన్సీలను 'ఫైనాన్షియల్‌ అస్సెట్‌' గా(cryptocurrency financial asset) పరిగణించే ఆలోచన ప్రభుత్వానికి ఉందని, తద్వారా చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా క్రిప్టో కాయిన్లు ఉన్నాయి. ఇందులో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ- మైనింగ్‌ ఆధారంగా డిసెంట్రలైజ్డ్‌ ఫ్రేమ్‌వర్క్‌తో ఉన్నవి 10- 15కు మించవు. వీటికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని, కొన్ని ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఆవిష్కరిస్తున్న సొంత కాయిన్లకు అనుమతి ఇవ్వకపోవచ్చని చెబుతున్నాయి.

ఎంపిక చేసిన క్రిప్టోల 'ట్రేడింగ్‌'కు మాత్రమే అనుమతి ఇచ్చి, వాటిని మార్పిడి సాధనాలుగా వినియోగించడానికి వీల్లేకుండా నిషేధించే అవకాశం కనిపిస్తోంది.

క్రిప్టో 'భారత్‌'..

  • ప్రపంచ వ్యాప్తంగానూ క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, నష్టభయం ఎక్కువగా ఉన్నప్పటికీ.. పెట్టుబడిపై అధిక ప్రతిఫలం లభిస్తుందనే ఆశతో క్రిప్టో వైపు మదుపరులు మొగ్గుచూపుతున్నారు. మనదేశంలో కోట్ల మంది మదుపర్లు వీటిపై పెట్టిన పెట్టుబడుల విలువ రూ.6 లక్షల కోట్లని అంచనా.
  • క్రిప్టో కరెన్సీపై గత ఏడాది మార్చిలో నిషేధాన్ని ఆర్‌బీఐ ఎత్తివేశాక మనదేశంలోనూ క్రిప్టో కరెన్సీపై నగరాలతో పాటు గ్రామీణ ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది. మనదేశంలో 15 క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ ప్లాట్‌ఫామ్‌లపై 10 కోట్ల మందికి పైగా మదుపరులు క్రయవిక్రయాలు సాగిస్తున్నారని అంచనా.
  • క్రిప్టో మదుపర్ల సంఖ్యలో అమెరికా, రష్యా వంటి దేశాలూ మన తర్వాతే ఉన్నాయి. అమెరికాలో 2.7 కోట్ల మంది, రష్యాలో 1.7 కోట్లు, నైజీరియాలో 1.3 కోట్ల మంది క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లున్నారు.
  • మనదేశంలో కాయిన్‌స్విచ్‌కుబేర్‌, వజీరెక్స్‌ ప్రధాన క్రిప్టో ఎక్స్ఛేంజీలుగా ఉన్నాయి. కాయిన్‌స్విచ్‌కుబేర్‌లో 1.1 కోట్లు, వజీరెక్స్‌లో 83 లక్షల ట్రేడింగ్‌ ఖాతాలున్నాయి.

ఇన్ని కాయిన్లు మిగలవు: రాజన్‌

ప్రస్తుతం వేల సంఖ్యలో ఉన్న క్రిప్టో కాయిన్లు సమీప భవిష్యత్తులో అంతర్థానం అవుతాయని, రెండో, మూడో బలమైన కాయిన్లు మిగులుతాయని ఆర్‌బీఐ పూర్వ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌(raghuram rajan on cryptocurrency) పేర్కొన్నారు. కొనేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల క్రిప్టో ధరలు పెరుగుతున్నాయి కానీ, వాటికి వాస్తవిక విలువ ఏముందని ఆయన ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంపై స్పందిస్తూ, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ విస్తరించేందుకు, దానివల్ల లభించే సత్ఫలితాలను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.