Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియాను ప్రభుత్వం నడుపుతుందా?

author img

By

Published : Jan 13, 2022, 8:16 AM IST

vodafone idea news

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియాలో 35.8శాతం వాటా తీసుకోవడం వెనుక ఆ కంపెనీని చేజిక్కించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్‌ స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించిన వెంటనే వైదొలుగుతామని.. సాధ్యం కాకుంటే నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని రాజారామన్‌ వెల్లడించారు.

Vodafone Idea: బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్న వొడాఫోన్‌ ఐడియాలో 35.8 శాతం వాటా తీసుకోవడం వెనుక ఆ కంపెనీని స్వాధీనం చేసుకొనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్‌ స్పష్టం చేశారు. ఆ సంస్థకు చేయూతనివ్వడం కోసమే ఆ పనిచేశామన్నారు. సంస్థ యాజమాన్య విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టంచేశారు. 'అది ప్రైవేటు కంపెనీ గానే నడుస్తుంది. ఆ సంస్థ ఎప్పుడు బకాయిలు చెల్లిస్తుందో, అప్పుడు ప్రభుత్వం వాటాలను వెనక్కి ఇచ్చేసి బయటకొస్తుంది. ఈ రంగంలో తగిన సంఖ్యలో కంపెనీలు ఉండి, ఆరోగ్యకర పోటీతో నడవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న'ట్లు ఆయన 'ఈనాడు'తో చెప్పారు. ముఖ్యాంశాలివీ..

వొడాఫోన్‌ ఐడియా బకాయిలు చెల్లించలేని పరిస్థితికి వస్తే ఏం జరుగుతుంది?

అలాంటి సమస్య వస్తే.. దివాలా స్మృతి లాంటి ప్రామాణిక ప్రక్రియలు ప్రభుత్వం ముందుంటాయి. ఇప్పటికి మాత్రం ఆ సంస్థ యథావిధిగా పనిచేస్తూ వినియోగదారులకు సమర్థంగా సేవలు అందించాలని కోరుకుంటున్నాం.

బకాయిలు చెల్లించకపోతే.. ఆ వాటాలను మరో కంపెనీకి విక్రయించొచ్చు కదా?

అలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని 'దీపమ్‌' విభాగం నిర్దేశించిన ప్రామాణిక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రకారం ముందుకెళ్తుంది. ప్రభుత్వానికి కంపెనీలను నడిపే ఉద్దేశం ఏమాత్రం లేదు. వ్యూహాత్మక రంగాల్లోనూ ప్రభుత్వం ఒకటి, రెండు సంస్థలకే పరిమితమవుతోందని గుర్తించాలి.

గతంలో ఇలా చేయలేదు.. ఇప్పుడెందుకు?

టెలికాం కంపెనీల చెల్లింపులకు మారటోరియం ఇస్తున్నాం. గత సెప్టెంబరులో ప్రకటించిన ఉపశమన పథకంలో కల్పించిన వెసులుబాట్లను అనుసరించి, కొన్ని కంపెనీలు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ రంగంలో ఒకట్రెండు కంపెనీలు మాత్రమే మిగిలితే, సమస్యగా మారుతుంది. అందుకే ఎక్కువ కంపెనీలు ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ అదనపు ప్రయత్నం చేసి కంపెనీలు నిలదొక్కుకునేలా చేయూతనిస్తున్నాం.

What is Vodafone Idea future

కంపెనీ బకాయిల చెల్లింపునకు వనరులను సమీకరించుకుంటుందని విశ్వసిస్తున్నాం. ఇటీవల ఆ సంస్థ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. డిసెంబరులో రూ.800 కోట్ల బకాయిలు చెల్లించింది. మున్ముందు ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం.

వొడాఫోన్‌ వాటాను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగిస్తారన్న ఊహాగానాలున్నాయి?

ఈ సంస్థను నడపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేనందున, మరో ప్రభుత్వ రంగ సంస్థకు దీని వాటాలను అప్పగించే ప్రశ్నే తలెత్తదు. ఒకవేళ ఇంకెవరికైనా విక్రయించాలనుకుంటే మాత్రం.. పెట్టుబడుల ఉపసంహరణ నిబంధనల ప్రకారమే జరుగుతుంది.

ఇదీ చూడండి: క్యూ3లో అదరగొట్టిన ఇన్ఫీ​- టీసీఎస్​ భారీ బైబ్యాక్​ ఆఫర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.