అంబానీని మించిన జావో- ప్రపంచ కుబేరుడైన క్రిప్టో బిలియనీర్‌

author img

By

Published : Jan 11, 2022, 7:01 AM IST

11th on the list of Bloomberg Kuberas

Binance CEO CZ's Net Worth: క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన 'బినాన్స్‌' అధిపతి చాంగ్‌పెంగ్‌ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ (107 బిలియన్‌ డాలర్లు-10వ స్థానం), రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (93 బిలియన్‌ డాలర్లు- 12వ స్థానం) మధ్య జావో చోటు పొందారు.

Binance CEO CZ's Net Worth: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన 'బినాన్స్‌' అధిపతి చాంగ్‌పెంగ్‌ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. చైనా మూలాలున్న కెనడా జాతీయుడైన జావో నికర సంపద విలువను 96 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7.2 లక్షల కోట్లు)గా బ్లూమ్‌బర్గ్‌ లెక్కకట్టింది. ఫలితంగా ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ (107 బిలియన్‌ డాలర్లు-10వ స్థానం), రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (93 బిలియన్‌ డాలర్లు- 12వ స్థానం) మధ్య జావో చోటు పొందారు. టెక్‌ సంపన్నులు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌ గేట్స్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ల సరసన జావో చేరడానికి, క్రిప్టో కరెన్సీల జోరు దోహదపడింది. క్రిప్టో వర్గాలు జావోను 'సీజడ్‌'గా వ్యవహరిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలియనీర్‌ కూడా జావోనే.

  • బినాన్స్‌లో జావో వాటా ఆధారంగా బ్లూమ్‌బర్గ్‌ ఆయన సంపదను లెక్కించింది. 2021లో బినాన్స్‌ 20 బి.డాలర్ల (దాదాపు రూ.1,50,000 కోట్లు) ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ సంస్థలో జావోకు 90 శాతం వాటా ఉంది. అయితే బ్లూమ్‌బర్గ్‌ లెక్కల కంటే జావో నికర సంపద మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జావోకు ఉన్న బిట్‌కాయిన్‌ నిల్వలు, బినాన్స్‌ జారీ చేసే బినాన్స్‌ కాయిన్‌లో వాటాలను బ్లూమ్‌బర్గ్‌ లెక్కలోకి తీసుకోలేదు. వీటిని కలిపితే నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న బిల్‌ గేట్స్‌ (135 బి.డాలర్ల సంపద), జుకర్‌బర్గ్‌ (124 బి.డాలర్ల సంపద)లకు సరిసమానంగా జావో నిలవొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
  • వ్యక్తిగత క్రిప్టో పెట్టుబడుల వివరాలను జావో ఎప్పుడూ ప్రకటించలేదు. తన సంపదలో ఎక్కువ శాతం వాటా క్రిప్టోలదే అని గతంలో ఆయనే వెల్లడించారు.
  • ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన బినాన్స్‌ ఆర్థిక వివరాలను ప్రకటించదు. రోజుకు ఈ సంస్థ 170 బి.డాలర్ల విలువైన క్రిప్టో లావాదేవీలను జరుపుతుంది. ఏ ఇతర పోటీ సంస్థ లావాదేవీలతో పోల్చినా, ఇది పలు రెట్లు అధికం కావడం గమనార్హం.

ఇదీ చదవండి: జీవితకాల గరిష్ఠం నుంచి బిట్‌కాయిన్‌ 40 శాతం పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.