టాటాకు అప్పగించే ముందే ఎయిర్​ ఇండియా అప్పుల బదిలీ

author img

By

Published : Oct 11, 2021, 5:54 PM IST

AirIndia

ఎయిర్ ​ఇండియా అప్పులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థను టాటా గ్రూప్​కు అప్పగించే ముందే.. హామీ ప్రకారం డిసెంబర్​ నాటికి రుణాల బదిలీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అప్పుల వివరాలు వెల్లడించింది ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడుల నిర్వహణ సంస్థ.

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకున్న తర్వాత.. అప్పులను బదిలీపై కేంద్రం దృష్టి సారించింది. సంస్థ బాధ్యతలు టాటా సన్స్​కు అప్పగించే ముందే.. ఇంధన సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన రూ.16,000 కోట్ల బకాయిలను ప్రత్యేక సంస్థ ఎయిర్​ ఇండియా అసెట్స్​ హోల్డింగ్స్​ లిమిటెడ్​ (ఏఐఏహెచ్​ఎల్)కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది.

అప్పులే కాకుండా.. చమురు మార్కెటింగ్ సంస్థలకు చెల్లించాల్సిన ఇంధన బిల్లులు, ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్స్​, వ్యాపారులకు సంబంధించిన బకాయిలు ఏఐఏహెచ్​ఎల్ భరించనున్నట్లు ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడుల నిర్వహణ సంస్థ (దీపమ్​) కార్యదర్శి తుహిన్​ కాంత పాండే పేర్కొన్నారు. డిసెంబర్ చివరి నాటికి ఈ అప్పులు మరింత పెరగకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అప్పటి వరకు సంస్థ రోజువారీ కార్యకలాపాలకు కావాల్సిన రూ.20 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంటుందని స్పష్టం చేశారు.

ఎయిర్ ​ఇండియాను టాటా గ్రూప్​కు అప్పగించే ముందు.. సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కాలానికి బ్యాలెన్స్​ షీట్లను క్లియర్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఏవైనా లయబిలిటీ​ ఉంటే వాటిని.. ఏఐఏహెచ్​ఎల్​కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు పాండే.

ఎయిర్ ఇండియా అప్పు ఎంత?

ఈ ఏడాది ఆగస్టు నాటికి ఎయిర్​ ఇండియాకు మొత్తం రూ.61,562 కోట్ల అప్పు ఉన్నట్లు తేలింది. ఇందులో రూ.15,300 కోట్లను టాటా గ్రూప్​ భరించనుంది. మిగతా రూ.46,262 కోట్లను ఏఐఏహెచ్​ఎల్​కు బదిలీ చేయనుంది ప్రభుత్వం. వీటన్నింటితో పాటు ఎయిర్​ ఇండియా భూములు, భవనాలను కూడా బదిలీ చేయనుంది. వీటి విలువ రూ.14,718 కోట్లు.

2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎయిర్​ ఇండియా కోసం ప్రభుత్వం రూ.1.10 లక్షల కోట్ల సహాయాన్ని అందించింది ప్రభుత్వం. ఇందులో రూ.54,584 కోట్లను నగదు రూపంలో సహాయం చేయగా.. రూ.55,692 కోట్లను దీర్ఘకాల గ్యారంటీల రూపంలో ఇచ్చింది. అయినప్పటికీ సంస్థ మాత్రం లాభాల బాట పట్టలేదు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.