Letter to Godavari Board: 'పెద్దవాగు మినహా మిగతా ప్రాజెక్టుల స్వాధీనం అక్కర్లేదు'

author img

By

Published : Nov 22, 2021, 6:41 PM IST

Updated : Nov 22, 2021, 7:46 PM IST

telangana enc writes to grmb

18:38 November 22

'పెద్దవాగు మినహా మిగతా ప్రాజెక్టుల స్వాధీనం అక్కర్లేదు'

(Letter to Godavari Board) గోదావరిపై ఉన్న పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు నీటిపారుదలశాఖ ఇంజనీర్ ​ఇన్​ చీఫ్​ మురళీధర్​ లేఖరాశారు. పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు ఇదివరకే నిర్ణయం జరిగిందని.. అందుకు విరుద్ధంగా ఉపసంఘం సభ్యులెవరికీ సమాచారం లేకుండా బోర్డు అధికారులు ఇతర ప్రాజెక్టులను సందర్శించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమన్న తెలంగాణ.. బోర్డు, ఉపసంఘం అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుల స్వాధీనం కోసం నివేదిక తయారు చేయడం తగదన్నారు.  

బోర్డు, ఉపసంఘం నిర్ణయాలకు అనుగుణంగానే బోర్డు కార్యాలయం పనిచేయాల్సి ఉంటుందన్న తెలంగాణ.. బోర్టు నిర్ణయాలకు సంబంధం లేకుండా వెళ్లిన అధికారుల అభిప్రాయాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు మినహా తెలంగాణకు మాత్రమే నీరిచ్చే ఇతర ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టుల స్వాధీనం (Telangana irrigation projects) కోసం నివేదికల తయారీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేశారు.      

క్షేత్రస్థాయిలో జీఆర్​ఎంబీ పర్యటన..

కేంద్రం గెజిట్​కు (central gazette notification) అనుగుణంగా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డులకు స్వాధీనం చేయాలన్న ప్రతిపాదనల పలు ప్రాజెక్టులను జీఆర్​ఎంబీ బృందం ఇటీవల పరీశీలించింది. బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్‌లో ప్రాజెక్టులను పరిశీలించింది. సింగూర్ జలశాయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరీశీలించింది. అనంతరం నిజాంసాగర్, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల.. గరిష్ట వరద నిల్వ సామర్థ్యాలు, నిర్వహణ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈనెల 17న ఐదో దఫా ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించారు. గెజిట్‌ షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు అధికారులతో సమావేశం అయింది. 

కేఆర్​ఎంబీ సైతం..

గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీ(krishna board) పరిధిలో చేర్చేందుకు.. కేఆర్​ఎంబీ ఉప సంఘం కన్వీనర్ బీఆర్కే పిళ్లై ఆధ్వర్యంలో.. 15 మంది సభ్యుల బృందం నాగార్జునసాగర్​లో పర్యటించింది. నల్గొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఏఎంఆర్పీతో పాటు... దానికి అనుబంధంగా గల పుట్టంగండిని సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, లోలెవెల్ కెనాల్, ఎడమ కాల్వల వద్దకు చేరుకుని.. వాటి స్థితిగతుల్ని అధ్యయనం చేశారు. అనంతరం సాగర్​లోని ఎన్నెస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్లుగా ప్రాజెక్టుకు వచ్చిన వరదలు.. గతంలో చేపట్టిన పూడికతీత, ప్రస్తుతం ఎడమ కాల్వ పరిస్థితి గురించి స్థానిక అధికారుల నుంచి వివరాలడిగారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి ఎప్పుడు తెస్తారని కేఆర్​ఎంబీ బృందం ఎన్నెస్పీ అధికారులను అడగ్గా... అది తమ పరిధిలోని అంశం కాదని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలియజేశారు. ప్రాజెక్టుతోపాటు అనుబంధ నిర్మాణాలను పరిశీలించామన్న ఆయన... ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకున్నాక అనుసరించే రూట్ మ్యాప్​పై అధ్యయనం చేసినట్లు వివరించారు.

ఇదీచూడండి: Niranjan reddy on BJP and Congress: 'రాష్ట్ర రైతులను పట్టించుకోలేదని దుష్ప్రచారం'

Last Updated :Nov 22, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.