ఆహారం కోసం రైలు దిగిన మహిళపై గ్యాంగ్ రేప్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా

author img

By

Published : Aug 25, 2022, 5:01 PM IST

Updated : Aug 25, 2022, 5:47 PM IST

gangraped near Government Railway Police Station

అర్ధరాత్రి ఆహారం కోసం రైలు దిగిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. రెస్టారెంట్​ను చూపిస్తామని చెప్పి తీసుకెళ్లిన దుండగులు రైల్వే యార్డులో రేప్ చేశారు. మరోవైపు, మైనర్ కజిన్​పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. అడ్డొచ్చిన బామ్మపైనా కోరిక తీర్చుకున్నారు. కేరళలో ఓ మహిళ ఆస్తి కోసం తల్లిదండ్రులకు ఎలుకల మందు కలిపిన టీ ఇచ్చింది. తల్లి మరణించగా.. తండ్రి టీ తాగకుండా తప్పించుకున్నాడు.

రైల్వే స్టేషన్ బయట మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాజస్థాన్​లో కలకలం రేపింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆహారం కోసం రైలు దిగిన మహిళను కిడ్నాప్ చేసి.. గ్యాంగ్ రేప్ చేశారు ఐదుగురు దుండగులు. సామూహిక అత్యాచారం జరిగిన ప్రదేశం ప్రభుత్వ రైల్వే పోలీస్(జీపీఆర్) స్టేషన్​కు 500 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే..
35ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి రైల్లో ప్రయాణిస్తోంది. రైలు బుధవారం రాత్రి జైపుర్ రైల్వే స్టేషన్​కు చేరుకోగానే.. తన భర్తకు ఆహారం తెచ్చేందుకని మహిళ రైలు దిగింది. స్టేషన్ బయట ఐదుగురు యువకులు కనిపించగా.. దగ్గర్లో రెస్టారెంట్లు ఉన్నాయా అని వారిని మహిళ ఆరా తీసింది. ఆమెపై కన్నేసిన కామాంధులు మహిళను వెంట తీసుకెళ్లారు. రెస్టారెంట్ చూపిస్తామని చెప్పి స్టేషన్ బయట ఉన్న రైల్వే యార్డుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఘటన తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి ఐదుగురు నిందితులు పారిపోయారని జీఆర్​పీ పోలీస్ స్టేషన్ అధికారి సంపత్ రాజ్ తెలిపారు. 'బాధితురాలు అక్కడి నుంచి రైల్వే పోలీస్ స్టేషన్​కు చేరుకుంది. ఘటన గురించి సమాచారం ఇచ్చింది. స్టేషన్​లో ఉన్న మహిళా పోలీసులు బాధితురాలిని చూసుకున్నారు. నిందితుల కోసం రైల్వే యార్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాం. వారెవరూ కనిపించలేదు' అని సంపత్ వివరించారు. గురువారం ఉదయం మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం, ఫోరెన్సిక్ టీమ్​ను ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కజిన్​పై రేప్, అడ్డొచ్చిన బామ్మను సైతం..
మధ్యప్రదేశ్ జబల్​పుర్​లో అత్యంత హేయమైన ఘటన జరిగింది. కుటుంబ సంబంధాలకు మచ్చతెచ్చేలా వావివరుసలు మరచి ప్రవర్తించారు కామాంధులు. ఇద్దరు సోదరులు కలిసి మైనర్ కజిన్​పై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని హత్య చేశారు. బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన తమ బామ్మను సైతం కామాంధులు వదిలిపెట్టలేదు. వృద్ధురాలిపైనా తమ పశువాంఛ తీర్చుకున్నారు. మైనర్ పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. ఓ నిందితుడిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు.

నిందితులిద్దరూ తమ బామ్మతో కలిసి జబల్​పుర్​లో నివసిస్తున్నారని ఏఎస్పీ ప్రదీప్ కుమార్ షిందే తెలిపారు. 'నిందితులు ఆగస్టు 13న తమ మేనమామ కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఆగస్టు 13 నుంచి 19 వరకు మైనర్​పై రోజూ అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న వాళ్ల బామ్మ నిందితులను ప్రశ్నించింది. దీంతో ఆమెను నిందితులు కొట్టారు. తర్వాత అత్యాచారం చేశారు. మైనర్​పై భౌతికంగా దాడి చేయడం వల్ల ఆగస్టు 19న ఆమె ఆరోగ్యం దెబ్బతింది. వెంటనే ఆమెను విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి పంపించారు. చికిత్స పొందుతూనే ఆగస్టు 20 బాలిక చనిపోయింది' అని ప్రదీప్ కుమార్ వివరించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని శవానికి సాధారణ పోస్టు మార్టం పరీక్షలు నిర్వహించారు. అయితే, బాధితురాలి తండ్రి ఇచ్చిన వాంగ్మూలంతో చిన్నారి మృతదేహానికి మరోసారి శవపరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. బాలిక శవాన్ని సమాధిలో నుంచి బయటకు తీసి.. పరీక్షల కోసం పంపించనున్నారు. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

ఆస్తి కోసం తల్లిదండ్రులకు విషం ఇచ్చి..
కేరళ త్రిస్సూర్ జిల్లాలోని కున్నాంకులం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన తల్లికి విషయం ఇచ్చి హత్య చేసింది. ఆస్తి కోసం తేనీరు​లో ఎలుకల మందు కలిపి చంపేసింది. ఆమెను గురువారం అరెస్టు చేశారు. 'టీ తాగిన తర్వాత నిందితురాలి తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఆగస్టు 18న ఆస్పత్రిలో చేరింది. రెండు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకున్నా.. కారణం ఏంటన్నది తెలియలేదు. విషం కలిపిన ఆహార పదార్థాలు సేవించడం వల్లే ఆరోగ్యం దెబ్బతిని ఉండొచ్చని మూడో ఆస్పత్రి వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. బుధవారం శవపరీక్షలు నిర్వహించగా.. మృతురాలి శరీరంలో ఎలుకల మందు ఆనవాళ్లు కనిపించాయి. అనుమానం వచ్చి ఆమె కూతుర్ని ప్రశ్నిస్తే.. తల్లిని హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. తల్లి చనిపోయిన తర్వాతే ఆస్తి వస్తుందని తెలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది' అని పోలీసులు తెలిపారు.

kerala
మృతురాలు

నిందితురాలికి వివాహం అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందునే ఇలాంటి పన్నాగం పన్నిందని పోలీసులు తెలిపారు. ఆమెకు రూ.8 లక్షలు అప్పు ఉందని చెప్పారు. తన తండ్రిని చంపేసేందుకూ నిందితురాలు ప్లాన్ వేసిందని చెప్పారు. 'నిందితురాలు తన తండ్రికి కూడా విషం కలిపిన టీ ఇచ్చింది. అంతకుముందే, ఆహారం కాస్త రుచి మారిందని ఆయన గ్రహించాడు. అనుమానం వచ్చి టీ తీసుకోలేదు. ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించాం. శరీరంలో విషపదార్థాలు కనిపించలేదు. దీనిపై నిందితురాలిని ప్రశ్నించగా.. తండ్రిని చంపేందుకు కూడా ప్రయత్నించినట్లు ఒప్పుకుంది. ఇద్దరికీ విషయం కలిపిన టీ ఇచ్చినట్లు తెలిపింది. టీ తాగిన తర్వాత తల్లి ఆరోగ్యం క్షీణించగా స్వయంగా నిందితురాలే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులతో చెప్పింది' అని పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kunnamkulammurder_25082022090446_2508f_1661398486_742_2508newsroom_1661403311_458.jpg
పోలీసుల అదుపులో నిందితురాలు
Last Updated :Aug 25, 2022, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.