విద్యుత్ తీగకు తగిలిన రథం.. 11 మంది సజీవదహనం

author img

By

Published : Apr 27, 2022, 7:06 AM IST

Updated : Apr 27, 2022, 11:36 AM IST

tanjore-car-festival-accident

06:48 April 27

విద్యుదాఘాతంతో 11మంది సజీవదహనం

Car Festival Accident: తమిళనాడు తంజావురు​లో ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్​ ఆలయ రథం విద్యుత్ తీగకు తగిలి 11 మంది సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రథోత్సవంలో పాల్గొన్న రథం గుడికి తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యుధాఘాతం అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది: తంజావురులోని మారుమూల గ్రామం కలిమేడులోని అప్పర్‌ దేవాలయంలో ఏటా చిత్రై మాసంలో సతయ ఉత్సవాలు జరుపుతారు. ఇందులో భాగంగా 94వ సతయ ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున రథాన్ని కలిమేడు గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు. ఉదయం 3 గంటల 15 నిమిషాల సమయంలో.... వీధి నుంచి రహదారిపైకి రథాన్ని తెచ్చారు. అక్కడ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్న.. హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు రథం తగిలింది. దీంతో రథాన్ని లాగుతున్న వ్యక్తులు,చుట్టుపక్కల ఉన్నవారు విద్యుదాఘాతానికి గురయ్యారు.

విద్యుదాఘాతం అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. ఘటనలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా.. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొద్ది సేపట్లో రథయాత్ర పూర్తవుతుందనగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మోదీ దిగ్భ్రాంతి: అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేలు పరిహారం ప్రకటించారు. ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పునపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైనవైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Last Updated :Apr 27, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.