కూతురి కోసం 'కులం లేని ధ్రువపత్రం'... తల్లిదండ్రుల ఆదర్శం..

author img

By

Published : May 30, 2022, 9:57 PM IST

No Caste No Religion Certificate

No Caste No Religion Certificate: తమ మూడేళ్ల చిన్నారి కోసం కులం లేని, మతం లేని ధ్రువపత్రాలను తీసుకున్నారు తమిళనాడులోని దంపతులు. తమ కుమార్తెను ఎవరూ కుల, మతాల ఆధారంగా చూడకూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపారు. దీంతో వారిపై పలువురి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

No Caste No Religion Certificate: ఓ బాలిక తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వారిపై ప్రశంసలు కురిపిస్తోంది. తమ కుమార్తెను ఎవరూ కుల, మతం పరంగా చూడకూడదని.. కేవలం ప్రేమతోనే చూడాలని భావించిన తల్లిదండ్రులకు ఆమెకు అరుదైన ధ్రువపత్రాన్ని తీసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్‌ చెందిన నరేశ్‌ విజయ్‌, గాయత్రి దంపతులకు మూడున్నరేళ్ల పాప ఉంది. తమ కుమార్తె విమ్లాను పాఠశాలలో చేర్పించాలని భావించిన వారు.. పలు స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అడ్మిషన్‌ ఫామ్‌లోని కులం, మతం కాలమ్‌లను నింపకుండా ఖాళీగా వదిలేశారు. కానీ ఆ కాలమ్‌లను కచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందని, లేదంటే అడ్మిషన్‌ ఇవ్వలేమని ఆయా స్కూళ్లు స్పష్టం చేశాయి.

పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదని 1973 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలియని బాలిక దంపతులు.. తమ సమస్యను పరిష్కరించాలంటూ కోయంబత్తూర్‌ జిల్లా కలెక్టర్‌ జి.ఎస్‌.సమీరన్‌ను సంప్రదించారు. తమిళనాడు రాష్ట్ర విద్యా శాఖ 1973, 2000 నాటి రెండు వేర్వేరు ఉత్తర్వుల ప్రకారం.. 'కులం లేదు, మతం లేదు' అని తల్లిదండ్రులు చెబితే కులం, మతం కాలమ్‌లను ఖాళీగా ఉంచవచ్చు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ సమీరన్‌ ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు. కానీ రిజర్వేషన్‌ పరంగా ప్రభుత్వం నుంచి పొందే పథకాలు, వెసులుబాటులు అందబోవని స్పష్టం చేశారు.

దీనికి అంగీకరించిన తల్లిదండ్రులు.. నోటరీ నుంచి ధ్రువీకరణ పొంది నార్త్‌ కోయంబత్తూర్‌ తహసీల్దార్‌కు అఫిడవిట్‌ సమర్పించారు. అనంతరం తమ కుమార్తె విమ్లా కోసం కులం లేదు, మతం లేదు ధ్రువపత్రాన్ని తీసుకున్నట్లు తండ్రి నరేశ్‌ విజయ్‌ వెల్లడించారు. కుల, మతం పేరుతో తమ కుమార్తెను నిర్బంధించడం ఇష్టంలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 'దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే సమానత్వం.. విద్యాసంస్థలు విద్యార్థులకు ప్రేమ, సమానత్వం నేర్పాలి' అని విజయ్‌ అన్నారు. చాలా మందికి ఇలాంటి ఓ సర్టిఫికెట్‌ ఉంటుందని తెలియదని పేర్కొన్న విజయ్‌.. ఇకపై ఇలాంటి వీటిని పొందేందుకు మరికొందరు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కులాంతర వివాహం.. ప్రభుత్వ పథకాలు కట్​- ఆ గ్రామంలో వితంతు ఆచారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.