కాలేజీ అమ్మాయికి బలవంతంగా ముద్దులు.. హద్దులుమీరిన ర్యాగింగ్‌

author img

By

Published : Nov 19, 2022, 10:25 PM IST

seniors Sexual harassment on juniors

విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ అంటూ లైంగికపరమైన వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మందిపై కాలేజీ యాజమాన్యం వేటు వేసింది.

మన దేశంలో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. ఇంకా ఈ విష సంస్కృతి కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈ ర్యాగింగ్‌ పేరుతో విద్యార్థులు హద్దులు దాటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒడిశాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ అంటూ లైంగికపరమైన వేధింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది.

గంజాం జిల్లాలోని బినాయక ఆచార్య కళాశాలలో ఈ దారుణ ఉదంతం చోటుచేసుకుంది. డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరంలో చేరిన ఓ విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో మితిమీరి ప్రవర్తించారు. కాలేజీలో ఫ్రెషర్‌ అయిన మరో విద్యార్థితో ఆమెకు బలవంతంగా ముద్దులు పెట్టించారు. ఇందుకు ఆ విద్యార్థి అభ్యంతరం చెబితే సీనియర్లు కొట్టారు. బాధిత విద్యార్థిని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుండగా.. పక్కనే ఉన్న సీనియర్‌ విద్యార్థి చేయి పట్టుకుని ఆపి కర్రతో బెదిరించాడు.

ఇదంతా కొంతమంది సీనియర్‌ అమ్మాయిలు అక్కడే నిలబడి నవ్వుతూ చూశారు తప్ప.. ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా రావడంతో ఈ ఘటన తీవ్ర దుమారానికి దారితీసింది.దీంతో కళాశాల యాజమాన్యం చర్యలు చేపట్టింది. యాంటీ ర్యాగింగ్‌ కమిటీ, క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, ప్లస్‌టు చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులకు కంపల్సరీ టీసీ ఇచ్చి తొలగించింది.

వీరిలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు విద్యార్థుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మరో ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావడంతో వారిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డులో హాజరుపర్చి.. బాలల సంరక్షణ కేంద్రానికి పంపించారు. నిందితుల్లో ఒకడైన ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి అభిషేక్‌ నాయక్‌.. బిజు జనతా దళ్‌ విద్యార్థి విభాగానికి చెందిన వాడని తెలుస్తోంది. గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.