Sabarmati Ashram: స్వరాజ్య సమర స్ఫూర్తి 'సబర్మతి'

author img

By

Published : Oct 3, 2021, 6:00 AM IST

Updated : Oct 3, 2021, 7:56 AM IST

Sabarmati Ashram

దేశాన్ని ఏకతాటిపై నడిపిన మహాత్ముని వజ్ర సంకల్ప కేంద్రం సబర్మతి ఆశ్రమం. స్వాతంత్ర్యోద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన ముఖ్యకేంద్రం. అనేక చారిత్రక ఉద్యమఘట్టాలకు శ్రీకారం చుట్టిన ప్రాకారం. దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరంలో బాపూజీ నివసించిన సబర్మతి ఆశ్రమ అవలోకనం ఎంతో స్ఫూర్తిదాయకం.

స్వరాజ్య సమర స్ఫూర్తి 'సబర్మతి'

దేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుండి నడిపిన మహాత్మా గాంధీజీని 'సబర్మతి సాధువు' అని పిలిచేవారు. ఎందుకంటే గాంధీజీ, సబర్మతి నదిది అవినాభావ సంబంధం. ఆయన దక్షిణాఫ్రికా నుంచి రాగానే అహ్మదాబాద్​లో ఒక ఆశ్రమం నిర్మించాలని నిర్ణయించారు. అలా 1917లో ఆయన సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పారు. సబర్మతి ఆశ్రమానికంటే ముందు ఆయన కొచ్రాబ్‌ ఆశ్రమంలో రెండేళ్లు నివసించారు.

Sabarmati Ashram
సబర్మతి ఆశ్రమం

"ప్రేమ్ చంద్ భాయి సబర్మతి నది ఒడ్డున ఎకరం పొలాన్ని.. 2 వేల 556 రూపాయల ఖరీదుకట్టి ఇచ్చారు. ముందుగా ఆశ్రమ నిర్మాణం ప్రారంభించారు. కట్టిన వెంటనే కొచ్రాబ్ ఆశ్రమం నుంచి సబర్మతి ఆశ్రమానికి మారిపోయారు."

- డాక్టర్ మాణిక్‌ భాయి పటేల్‌, చరిత్రకారుడు

గాంధీజీకి ఈ ఆశ్రమం గురించి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. అది తన సొంతగానే అభివృద్ధి చెందాలని భావించారు. సబర్మతి నది ఒడ్డున ఆశ్రమ నిర్మాణంతో ఆయన ఆకాంక్ష నెరవేరింది. అందుకే బాపూజీకి సబర్మతి ఆశ్రమ ప్రదేశం ఎంతో నచ్చింది.

Sabarmati Ashram
సబర్మతి ఆశ్రమం

"గాంధీజీ కూడా చెప్పారు. ఆనాడు ఈ స్థలం ఆశ్రమ నిర్మాణానికి సరిగ్గా సరిపోతుందన్నారు. ఎందుకంటే ఒకవైపు శ్మశానం, మరోవైపు జైలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడికి వచ్చే సత్యాగ్రహి ముందు రెండు మార్గాలుంటాయి. సత్యాగ్రహం చేసి జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉండాలి. లేదా సత్యాగ్రహం ద్వారా ప్రాణ త్యాగానికైనా సిద్ధం కావాలి."

- అతుల్‌ పాండ్య, సంచాలకుడు, గాంధీ ఆశ్రమం

నిరాడంబరత గాంధీజీవన శైలికి మరో పేరు. ఇది గాంధీ ఆశ్రమంలో కూడా కనపడుతుంది. ఇదే సమయంలో ఆశ్రమంలో సమష్టి తత్వం మీద దృష్టి కేంద్రీకరించారు. గాంధీజీ ఆశ్రమంలో హృదయకుంజ్ ఎంతో ముఖ్యభాగం. అది గాంధీజీ నివసించిన స్థలం. ఆయన కుటీరానికి ఈ పేరుపెట్టడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.

Sabarmati Ashram
సబర్మతి ఆశ్రమంలోని మహాత్ముడి విగ్రహం

"గాంధీజీ అధికారిక నివాసానికి 'హృదయకుంజ్' అని పేరుపెట్టడంలో కేశవ్ కేల్కర్ ఉద్దేశం సుస్పష్టం. ఎందుకంటే ఆశ్రమానికి గాంధీజీ హృదయం లాంటి వారు. అందువల్ల ఆ ప్రదేశానికి హృదయకుంజ్ పేరే ఉండి తీరాలి. హృదయకుంజ్​లో మహాత్మునికి ప్రత్యేకమైన పడకగది ఏమీ లేదు. ఆయన చరఖా వడికే ఆ వరండాలోనే నిద్రపోయేవారు."

- అతుల్ పాండ్య, సంచాలకుడు, గాంధీ ఆశ్రమం

ప్రార్థనా సమావేశానికి హృదయకుంజ్ దగ్గర లోనే ఒక ప్రదేశం ఉంది. ఆశ్రమంలో దినచర్య ప్రార్థనతోనే ప్రారంభమైంది.

Sabarmati Ashram

" ప్రార్ధనకు గాంధీజీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని మనందరికీ తెలుసు. ఉదయం 4 గంటల 30 నిమిషాలకు ఆశ్రమంలో ఆయన దినచర్య ప్రార్థనతోనే మొదలై సాయంత్రం ప్రార్థనతోనే ముగుస్తుంది. రేపటి రోజున ఏం చేయాలో ఆరోజు సాయంత్రం సమావేశంలో చర్చించేవారు."

- అతుల్ పాండ్య, సంచాలకుడు, గాంధీ ఆశ్రమం

గాంధీజీ అంటే దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ ప్రసిద్ధులు. అందువల్ల ఆయన్ని కలిసేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు వస్తుండేవారు. అయినప్పటికీ ఆశ్రమ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండేవి.

Sabarmati Ashram
గాంధీ స్మారక సంగ్రాహాలయ్​

"ఇంగ్లాండులో నివసించే మీరాబాయి గాంధీజీ బోధనలతో ఎంతో ప్రభావితమయ్యారు. ఆమె ఇంగ్లాండు నుంచి మనదేశానికి వచ్చి గాంధీజీ ఆశ్రమంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఇందుకోసం తన వేషధారణనే మార్చివేశారు. ఖాదీ తయారీకి చరఖా తిప్పటం నేర్చుకున్నారు."

- డాక్టర్ మాణిక్‌ భాయి పటేల్‌, చరిత్రకారుడు

ఆశ్రమం అంటే కేవలం మహాత్మాగాంధీజీకో, లేక సత్యాగ్రహులకో ఆశ్రయమిచ్చే ప్రదేశం కాదు. సబర్మతి ఆశ్రమం భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ఆయువుపట్టు లాంటిది. ఈ ఆశ్రమం అనేక ఉద్యమాలకు శంఖారావం పూరించిన ప్రదేశం. జాతి జాగృతికి, సామాజిక మార్పునకు కేంద్రం. ప్రస్తుతం సబర్మతి ఆశ్రమంలో 165 భవనాలున్నాయి. గాంధీజీ మరణం తర్వాత ఆయన జ్ఞాపికల సమాహారంగా ' మైలైఫ్‌ ఈజ్ మై మెసేజ్' అనే గ్యాలరీని ఏర్పాటు చేశారు. బాపూజీ బాల్యం నుంచి అంతిమ ఘడియల దాకా ఆ జీవిత ఘటనలను ప్రతిబింబించే గ్యాలరీ ఇది. స్వావలంబన, కుటీరపరిశ్రమలకు స్ఫూర్తినిచ్చే ఉద్దేశంతోనే మహాత్ముడు సబర్మతి ఆశ్రమం ఆయన మరణానంతరం స్మారక మ్యూజియం అయ్యింది.

Sabarmati Ashram
సబర్మతి ఆశ్రమం

బాపూజీ ఉపయోగించిన కళ్లజోడు, చేతికర్ర, చరఖా, మంచినీళ్లు తాగే రాగిపాత్ర తదితర అమూల్య జ్ఞాపికలు మ్యూజియంలో ఉంచారు.

ఇదీ చూడండి: Gandhi Jayanti: స్వాతంత్య్ర సంగ్రామానికి ఊపిరి 'సేవాగ్రామ్'

Last Updated :Oct 3, 2021, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.