Rolls Royce Cbi Case : రోల్స్ రాయిస్‌కు షాక్​.. అవినీతి ఆరోపణలపై సీబీఐ కేసు

author img

By

Published : May 29, 2023, 8:13 PM IST

Updated : May 29, 2023, 8:51 PM IST

rolls-royce-cbi-case-cbi-registered-case-against-british-aerospace-and-defence-company

Rolls Royce Cbi Case : బ్రిటన్‌కు చెందిన ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థ రోల్స్ రాయిస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హాక్‌ 115 అడ్వాన్స్‌ జెట్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు.. రోల్స్‌ రాయిస్‌ లంచం ఇచ్చిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

Rolls Royce Cbi Case : ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్‌కు చెందిన ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ రోల్స్‌ రాయిస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌పైనా సీబీఐ కేసు నమోదు చేసింది. భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ కోసం హాక్‌ 115 అడ్వాన్స్‌ జెట్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కాంట్రాక్ట్‌ దక్కించుకునేందుకు.. రోల్స్‌ రాయిస్‌ లంచం ఇచ్చిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. రోల్స్‌ రాయిస్‌ ఇండియా డైరెక్టర్‌ టిమ్‌ జోన్స్‌తో పాటు మధ్యవర్తులైన సుధీర్‌ చౌధరి, అతని కుమారుడు భాను ఛౌదరి, రోల్స్‌ రాయిస్‌ పీఎల్‌సీ, బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది సీబీఐ.

కాగా 24 హాక్‌ 115 ఏజీటీల కొనుగోళ్లకు రోల్స్‌ రాయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్​. దీని విలువ 734.21 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్లుగా ఉంది. అలాగే, 42 ఎయిర్‌ క్రాఫ్ట్‌ల తయారీకి, హిందుస్థాన్‌ ఎరో నాటిక్స్‌కు మెటీరియల్‌ సప్లయ్‌ చేసేందుకు 308.247 మిలియన్‌ డాలర్లు, లైసెన్స్‌ ఫీజు కింద మరో 7.5 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్‌ పూర్తి చేసేందుకు.. నిందితులు పలువురు ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

అయితే, అవినీతి ఆరోపణల కారణంగా ఈ డీల్‌ నిలిచిపోయింది. 2016లో దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ. అనంతరం ఆరేళ్ల తర్వాత కేసు నమోదు చేసింది. 2006-07 మధ్య రోల్స్‌ రాయిస్‌ ఇండియా కార్యాలయాలపై ఐటీ శాఖ సర్వే నిర్వహించిందని.. ఆ సమయంలో ఈ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు బయటపడ్డాయని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. కాకపోతే.. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఆ ఆధారాలను నిందితులు ధ్వంసం చేశారని సీబీఐ వెల్లడించింది.

బీబీసీపై కేంద్ర సంస్థల దాడులు..
దేశంలో అక్రమాలకు పాల్పడే విదేశీ సంస్థలపై భారత దర్యాప్తు సంస్థలు కొరడా ఝులిపిస్తున్నాయి. కాగా కొద్ది రోజులు క్రితం విదేశీ సంస్థ అయిన బీబీసీ వార్తా సంస్థపై కూడా అక్రమాల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. సంస్థ చూపుతున్న ఆదాయం, లాభాల్లో తేడాలున్నాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ(సీబీడీటీ) తెలిపింది. దాంతో పాటు విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించినందుకు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫెమా(ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) కూడా బీబీసీ కేసు నమోదు చేసింది. కంపెనీ చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఉల్లంఘనలపై.. ప్రధానంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది.

Last Updated :May 29, 2023, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.