'భాజపాను గద్దె దించుతాం.. వారికి తలవంచే ప్రసక్తే లేదు'.. లాలూ ఫైర్

author img

By

Published : Sep 21, 2022, 7:26 PM IST

lalu prasad yadav

2024 ఎన్నికల్లో భాజపాను గద్దె దించుతామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. నితీశ్ కుమార్ విపక్షాలను ఏకం చేస్తున్నారని, త్వరలో సోనియా, రాహుల్​లను తాము కలుస్తామని చెప్పారు. మరోవైపు, ఎస్పీ, బీఎస్పీ మధ్య మరోసారి పొత్తు కుదురుతుందేమోనన్న అనుమానాల నేపథ్యంలో మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు మరోసారి జట్టుకడుతున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాను అడ్డుకోవడంలో సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా భాజపా పనిచేస్తోందని, వారిని ప్రశ్నించకుండా ఎస్పీ నిస్సహాయంగా మారిపోయిందని అన్నారు.

అసలేమైందంటే..
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై నిరసనగా ర్యాలీ నిర్వహించేందుకు సమాజ్​వాదీ పార్టీ.. ఇటీవల పోలీసుల అనుమతి కోరింది. అయితే, పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు. దీనిపై స్పందించిన మాయావతి.. విపక్ష పార్టీల నిరసనలకు అనుమతించకపోవడం ఏంటని యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సమాజ్​వాదీతో బీఎస్పీ మరోసారి కలుస్తుందేమోనన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే బుధవారం.. అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీపై విమర్శలు గుప్పించారు మాయ. 'ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన లౌకికశక్తులు... కుల, మతతత్వ, ప్రజావ్యతిరేక భాజపా విధానాలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఎస్పీని ప్రధాన విపక్షంగా నిలిపారు. కానీ, భాజపాకు పోటీ ఇవ్వడంలో సమాజ్​వాదీ విఫలమవుతోంది. దీంతో ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి అడ్డూ లేకుండా భాజపా ప్రభుత్వం పనిచేస్తోంది. అసెంబ్లీలో అంతమంది సభ్యుల బలం ఉన్నా.. చాలా బలహీనంగా, నిస్సహాయంగా కనిపిస్తోంది' అని మాయావతి ట్వీట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఎన్నికల్లో చతికిలపడటం వల్ల.. ఈ రెండు పార్టీల మధ్య బంధం తర్వాత కొనసాగలేదు.

భాజపాను ఓడిస్తాం..
మరోవైపు, ఆర్జేడీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్​లో పాల్గొన్న ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. భాజపాపై నిప్పులు చెరిగారు. భాజపా.. అల్లర్లకు తెగబడే పార్టీ అని మండిపడ్డారు. భాజపాకు తలవంచక పోవడం వల్లే తాను జైలుకు వెళ్లానంటూ చెప్పుకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

rjd-meeting-in-presence-of-lalu-yadav-in-patna
ఆర్జేడీ మీటింగ్​లో లాలూ, తేజస్వీ యాదవ్

'ఏ పార్టీ అయినా నా ముందే తలవంచింది. నేను మాత్రం తలవంచలేదు. ఒకవేళ నేను వారి(భాజపా) ముందు తలవంచి ఉంటే.. జైలుకు వెళ్లి ఉండేవాడిని కాదు. ఇప్పటికీ నేను ఒకటే చెబుతున్నా.. భాజపాకు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వను. భాజపాను చెత్తబుట్టలోకి పంపే సమయం ఆసన్నమైంది. 2024లో భాజపాను కూకటివేళ్లతో పెకిలించాలి. ఆర్ఎస్ఎస్, భాజపా మనకు చిరకాల ప్రత్యర్థులు. నితీశ్ కుమార్.. విపక్షాలను ఏకం చేస్తున్నారు. త్వరలో నేను, నితీశ్ కలిసి సోనియా గాంధీని కలుస్తాం. భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత రాహుల్ గాంధీతోనూ భేటీ అవుతాం' అని లాలూ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.