'పీఎం కేర్స్​ ఫండ్​' ట్రస్టీగా రతన్​ టాటా.. వారిపై మోదీ ప్రశంసలు

author img

By

Published : Sep 21, 2022, 5:02 PM IST

trustees-of-pm-cares-fund

PM Cares fund: పీఎం కేర్స్​ ఫండ్​ ట్రస్టీలుగా వ్యాపార దిగ్గజం రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కేటీ థామస్ సహా మరికొందరు ప్రముఖులు చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలో జరిగిన సమావేశానికి వారంతా హాజరయ్యారు.

PM Cares fund: కొవిడ్ తరహా సంక్షోభాలు తలెత్తితే.. అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఏర్పాటు 'చేసిన పీఎం కేర్స్ ఫండ్​'కు మనస్ఫూర్తిగా విరాళాలు ఇచ్చిన వారందరినీ కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం పీఎం కేర్స్​ ఫండ్​ ట్రస్టీల బోర్డు సమావేశానికి హాజరైన మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. బోర్డులో కొత్తగా ట్రస్టీలుగా చేరిన ప్రముఖుల్ని ఆయన స్వాగతించారు.

పీఎం కేర్స్​ ఫండ్​ ట్రస్టీలుగా ఇటీవల నామినేట్ అయిన టాటా గ్రూప్​ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్​సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా.. తొలిసారి ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ భేటీలో ట్రస్టీల హోదాలో పాల్గొన్నారు. 'పీఎం కేర్స్​ ఫర్ చిల్డ్రన్​' పేరిట 4,345 మంది చిన్నారులకు అండగా నిలవడం సహా.. పీఎం కేర్స్ ఫండ్ ద్వారా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై ట్రస్టీలంతా చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

"క్లిష్ట సమయంలో పీఎం కేర్స్​ ఫండ్ అద్భుతమైన పాత్ర పోషించిందని ట్రస్టీలు కొనియాడారు. విపత్తు తలెత్తాక సహాయ కార్యక్రమాలతో స్పందించడమే కాక.. ముందుగానే నష్టాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలన్న దార్శనికతను ఈ ఫండ్ కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. పీఎం కేర్స్​ ఫండ్​ పనితీరును మరింత విస్తృతం చేసేందుకు కొత్త ట్రస్టీల భాగస్వామ్యం ఎంతగానో ఉపకరిస్తుందని ప్రధాని అన్నారు. వారి అపార అనుభవం.. అవసరంలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు మరింత వేగంగా స్పందించేలా చేస్తుందని ఆకాంక్షించారు" అని ప్రధాని కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మాజీ కాగ్ రాజీవ్ మహర్షి; ఇన్ఫోసిస్ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​ సుధా మూర్తి; టీచ్ ఫర్​ ఇండియా సహ వ్యవస్థాపకులు ఆనంద్ షా సహా మరికొందరు ప్రముఖులతో పీఎం కేర్స్​ ఫండ్​కు సలహాదారుల బోర్డు ఏర్పాటు చేయాలని ట్రస్టీలు నిర్ణయించినట్లు వెల్లడించింది.

విపత్తులతో ప్రభావితమైన అండగా నిలిచేందుకు జాతీయ స్థాయిలో సహాయ నిధి ఉండాలన్న ఉద్దేశంతో పీఎం కేర్స్​ ఫండ్​ను ఏర్పాటు చేశారు. కొవిడ్​ వ్యాప్తి ప్రారంభమైనప్పుడు.. 2020 మార్చి 27న కేవలం రూ.2.25లక్షలతో ఈ నిధిని ప్రారంభించిన ప్రధాని.. పెద్దఎత్తున విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రముఖులు, సాధారణ ప్రజలు తమవంతు సాయం చేశారు. ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10,990 కోట్లు జమ అయ్యాయి. రూ.3,976కోట్లు సహాయ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. ఇందులో కరోనా సమయంలో వలసదారుల సంక్షేమం కోసం రూ.1000కోట్లు వెచ్చించగా.. మరో రూ.1,392కోట్లను కొవిడ్ టీకాల కొనుగోలుకు కేటాయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.