రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా.. 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు..

author img

By

Published : May 13, 2022, 7:07 AM IST

Rajya Sabha polls 2022

Rajya Sabha polls 2022: 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్​ విడుదల చేసింది భారత ఎన్నికల సంఘం. 57 మంది ఎంపీల పదవీకాలాలు జూన్​ 21 నుంచి ఆగస్టు ఒకటిలోపు పూర్తి కానున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలున్నాయి. జూన్​ 10న పోలింగ్​, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉండనుంది.

Rajya Sabha polls 2022: రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది. జూన్‌ 10న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. 15 రాష్ట్రాలకు సంబంధించిన 57 మంది ఎంపీల పదవీకాలాలు జూన్‌ 21 నుంచి ఆగస్టు ఒకటి లోపు పూర్తి కానున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలున్నాయి. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 11 స్థానాలు, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి ఆరేసి ఖాళీ అవుతున్నాయి. పదవీకాలం పూర్తవుతున్న వారిలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చిదంబరం, జైరాం రమేష్‌, కపిల్‌ సిబల్‌, అంబికా సోని తదితరులున్నారు. తెలంగాణ నుంచి తెరాస ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, భాజపా ఎంపీలు వై.సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్‌, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21వ తేదీతో పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు పూర్తి మెజారిటీ ఉండడంతో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఒడిశా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న తెలుగు వ్యక్తి నెక్కంటి భాస్కర్‌రావు (బిజద) పదవీకాలం జులై ఒకటో తేదీతో ముగుస్తుంది.

వందలోపు స్థానాలకు భాజపా
57 స్థానాల ఎన్నికలతో రాజ్యసభలో భాజపా సభ్యుల సంఖ్య వంద లోపునకు పడిపోనుంది. ఇటీవలే భాజపా వంద మంది సభ్యుల మార్కును చేరుకుంది. ఏపీ నుంచి భాజపాకు సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి రాజ్యసభకు ఏపీ నుంచి భాజపా అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేవు. పంజాబ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అకాలీదళ్‌ సభ్యుడు, కాంగ్రెస్‌ ఎంపీ అంబికా సోని పదవీకాలం పూర్తికానుంది. పంజాబ్‌లో ఆప్‌ అధికారంలో ఉండడంతో ఈసారి రెండు స్థానాలనూ ఆ పార్టీనే గెలుచుకోనుంది. బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒక్క స్థానానికే పరిమితం కానుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఎనిమిదింటిని భాజపా, దాని మిత్రపక్షాలు, మూడింటిని ఎస్పీ గెలుచుకోనున్నాయి. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందే వారంతా జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: మే 24
  • నామినేషన్ల దాఖలుకు తుది గడువు: మే 31
  • పరిశీలన: జూన్‌ 01
  • ఉపసంహరణకు తుది గడువు: జూన్‌ 03
  • పోలింగ్‌ తేదీ: జూన్‌ 10

(అదే రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు)

ఇదీ చూడండి: 'మూడోసారీ నేనే ప్రధాని'... క్లారిటీ ఇచ్చిన మోదీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.