ఉద్యోగులపై రైల్వే శాఖ కొరఢా.. మూడు రోజులకు ఒకరిపై వేటు.. బలవంతంగా వీఆర్ఎస్

author img

By

Published : Nov 24, 2022, 2:35 PM IST

Railway department layoffs employees

ఉద్యోగులపై రైల్వే శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. పనితీరు సరిగా లేని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కొరఢా ఝుళిపిస్తోంది. లంచాలు తీసుకునే వారిని, సరిగ్గా పనిచేయని వారిని గుర్తించి.. బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి పంపిస్తోంది.

పనితీరు సరిగా లేని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై రైల్వే శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతి 3రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021 జులై నుంచి ఇప్పటివరకు 139 మంది ఉద్యోగులకు బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి పంపించగా.. మరో 38 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు రైల్వే అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. బుధవారం కూడా లంచం తీసుకుంటూ చిక్కిన ఇద్దరు సీనియర్‌ గ్రేడ్‌ అధికారులను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో 5లక్షల లంచం తీసుకుంటూ ఒక అధికారి, రాంచీలో 3లక్షలు తీసుకుంటూ మరో అధికారి దొరికిపోయారని సమాచారం. గతేడాది రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల పనితీరు విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ ఇప్పటికే కేంద్రమంత్రి పలుమార్లు ఉద్యోగులను హెచ్చరించారు. ఇక అవినీతికి పాల్పడే ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.