సత్యాగ్రహంతో రైతులు సాధించిన విజయం : రాహుల్ గాంధీ

author img

By

Published : Nov 19, 2021, 11:45 AM IST

rahul

కేంద్రం అహంకారంపై రైతులు సత్యాగ్రహ మార్గంలో విజయం సాధించారని సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సాగు చట్టాల రద్దుకోసం సుదీర్ఘ పోరాటం చేసిన అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

గతేడాది కేంద్రం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సత్యాగ్రహం ద్వారా కేంద్రం అహంకారాన్ని ఓడించారని.. అన్యాయానికి వ్యతిరేకంగా అంతిమ విజయం సాధించారని' పేర్కొన్నారు.

"దేశంలోని అన్నదాతలు సత్యాగ్రహం ద్వారా అహంకార ప్రభుత్వ మెడలు వంచారు. అన్యాయానికి వ్యతిరేకంగా విజయం సాధించిన రైతులకు అభినందనలు. జై హింద్, జై హింద్ కా కిసాన్"

--రాహుల్​ గాంధీ

'విజయం మీదే..'

'చట్టాల రద్దుకోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతుకు అభినందనలు. భాజపా ప్రభుత్వం క్రూరత్వాన్ని చూసి రైతులు బెదరలేదు' అని బంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

'రైతు త్యాగాల ఫలితమే..'

సాగు చట్టాల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ 'సరైన దిశలో అడుగు' అని అభిప్రాయపడ్డారు. వీటిని 'నల్ల' చట్టాలుగా అభివర్ణించిన సిద్ధూ.. ఈ విజయం రైతుల త్యాగాలకు దక్కిన ఫలితంగా పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మోదీకి పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

"గొప్ప శుభవార్త. గురునానక్ జయంతి పవిత్ర దినోత్సవం సందర్భంగా 'పంజాబీ వాసుల' డిమాండ్లను అంగీకరించినందుకు, నల్ల చట్టాలను రద్దు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. రైతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని భావిస్తున్నా."

--అమరీందర్ సింగ్ ట్వీట్

నూతన చట్టాల రద్దు ప్రకటనపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)లోని 'ఉగ్రహన్ వర్గం' స్వాగతించింది. 'ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం మంచి చర్య' అని బీకేయూ ఉగ్రహన్ విభాగం నేత జోగీందర్ సింగ్ ఉగ్రహన్ తెలిపారు. నిరసనలో ఉన్న రైతులు తమ ఇళ్లకు వెళ్లాలని ప్రధాని చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. 'రైతు సంఘాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని' వెల్లడించారు.

గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాట్లాడిన మోదీ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించారు.

అయితే.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రైతు సంఘాలు గతేడాది నుంచి దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్ర 11 దఫాలు చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.