'రిపబ్లిక్ డే రోజున ఇళ్లలోనే ఉండండి.. లేదంటే అంతే'.. ఉగ్రవాది హెచ్చరిక

author img

By

Published : Jan 21, 2023, 10:46 PM IST

sikh for justice banned in india

రిపబ్లిక్ డే రోజున దిల్లీలో ఉగ్రదాడులకు పాల్పడతామంటూ సిక్‌ ఫర్‌ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)కు చెందిన గురుపత్వంత్ సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌జే, గురుపత్వంత్‌ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు యావత్‌ దేశం సిద్ధమవుతుండగా.. సిక్‌ ఫర్‌ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థకు చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైంది. రిపబ్లిక్‌ డే రోజున ప్రత్యేక పంజాబ్‌ అనుకూల సంస్థ ఎస్‌ఎఫ్‌జే ఉగ్రదాడులకు పాల్పడుతుందన్నది ఆ వీడియో సారాంశం. "జనవరి 26న ఇళ్లల్లోనే ఉండండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిల్లీనే మా లక్ష్యం. అదే రోజున ఖలిస్థాన్‌ జెండాను ఆవిష్కరిస్తాం" అని గురపత్వంత్‌ సింగ్‌ వీడియోలో చెప్పాడు. ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగుర వేసిన వారికి 5 లక్షల డాలర్ల నజరానా ఇస్తామని ప్రకటించాడు. 2023లో భారత్‌ నుంచి పంజాబ్‌ను వేరు చేస్తామని తెలిపాడు.

ఈ నేపథ్యంలో వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది ఎస్‌ఎఫ్‌జే సంస్థతోపాటు గురుపత్వంత్‌ సింగ్‌పై సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. వీడియో చూసిన తర్వాత షాక్‌కు గురయ్యానని స్థానికంగా ఉంటూనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం దారుణమని ఆయన అన్నారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌జే, గురుపత్వంత్‌ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుపత్వంత్‌ను భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాకుండా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో ఎస్‌ఎఫ్‌జే పైనా నిషేధం విధించింది. రెండు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేందుకు యత్నించాడన్న కారణంతో గురుపత్వంత్‌పై పోలీసులు గత ఏడాది కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని దిల్లీ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సిటీ పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాని స్థానికులను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.