వైద్య పరీక్షల కోసం 7కి.మీ నడిచి వెళ్లిన గర్భిణీ.. వడదెబ్బతో మృతి

author img

By

Published : May 15, 2023, 5:38 PM IST

Pregnant woman dies of sunstroke

మహారాష్ట్ర పాల్ఘర్​లో హృదయవిదారక ఘటన జరిగింది. వడదెబ్బకు ఓ నిండు గర్భిణీ బలైంది. ఆరోగ్య పరీక్షల కోసం పీహెచ్​సీకి నడిచి వెళ్లిన ఓ గర్భిణీ.. వడదెబ్బ వల్ల మృతి చెందింది. మరోవైపు.. ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన ఒడిశాలో వెలుగుచూసింది.

దేశంలో ఎండలు భగభగమంటున్నాయి. ఉదయం 7 దాటిందంటే ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అయితే ఓ గర్భిణీ మాత్రం ఇంత వేసవిలోనూ 7 కిలోమీటర్లు నడిచి వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నడిచివెళ్లింది. దీంతో ఆమె వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో సోమవారం జరిగింది.

ఇదీ జరిగింది..
పాల్ఘర్​లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్​( 21) అనే గర్భిణీ జనరల్ చెకప్​ కోసం దండల్వాడి పీహెచ్​సీకి బయలుదేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుంది. అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ వైద్య సేవలు అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరింది. అయితే అప్పటికే ఎండలు భగభగమంటున్నాయి. తిరిగి ఆటోలో బయలుదేరి హైవేపై దిగి కాలి నడకన స్వగ్రామానికి బయలుదేరింది. ఎలాగోలా మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది.

అయితే సోనాలి వడదెబ్బ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారు అక్కడ సోనాలికి ప్రథమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. సోనాలిని అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది.

'సెమీ-కోమోర్బిడ్ కండిషన్ కారణంగా సోనాలి మరణించింది. ఆమె వడదెబ్బకు గురైంది. అందువల్ల ఆమెతో పాటు, ఆమె గర్భంలో ఉన్న గర్భస్థ శిశువు సైతం మరణించింది. తీవ్రమైన ఎండలో 7 కి.మీ నడవడం వల్ల ఆమె వడదెబ్బకు గురైంది. బాధితురాలి రక్త హీనత వ్యాధి ఉంది.'

-- వైద్యులు

కుళ్లిన స్థితిలో మృతదేహాలు..
ఒడిశా.. సంబల్​పుర్​లో దారుణం జరిగింది. ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో ఓ మహిళ, ఆమె ఇద్దరు మైనర్​ పిల్లల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది..
సాజియా పర్వీన్​(32) అనే మహిళ, ఆమె కుమారుడు అబ్దుల్ రెహ్మాన్​(10), కుమార్తె హౌమైరా(8)తో కలిసి సంబల్​పుర్​లోని గౌంటియాపరాలో నివసించేది. ఆమె భర్త ఏడాదిన్నర క్రితం మరణించాడు. అయితే పర్వీన్ తల్లి ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పర్వీన్ తల్లి కుమార్తె ఇంటికి శనివారం వచ్చింది. కుమార్తె ఇంటి తలుపులు కొట్టింది. ఎంతకీ ఆమె తలుపులు తెరవలేదు. వెంటనే పర్వీన్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కుళ్లిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.