పాదయాత్ర తొలిరోజే PKకు షాక్.. జనం రాక గ్రౌండ్ మొత్తం ఖాళీ!

author img

By

Published : Oct 3, 2022, 8:49 AM IST

prashant kishor jan suraj padyatra

సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజైన ఆదివారం పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది.

ప్రశాంత్ కిశోర్.. దేశంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త. ఇండియన్ పొలిటికల్ యాక్షన్​ కమిటీ-ఐప్యాక్ వ్యవస్థాపకుడు. ఆ సంస్థ ద్వారా ఎన్నో రాజకీయ పార్టీలకు సలహాదారుగా సేవలందించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రచారం సహా అనేక రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల కోసం పనిచేశారు. పీకే సేవలు పొందిన వారిలో చాలా మంది విజయం సాధించారు కూడా. జనం నాడిని అంచనా వేయడం; ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టేలా, ప్రజల మెప్పు పొందేలా ప్రచార వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిశోర్ దిట్ట అని చెబుతుంటాయి రాజకీయ వర్గాలు.

రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటి వరకు తెరవెనుక ఉండి పనిచేసిన పీకే.. ఇప్పుడు నేరుగా కదన రంగంలోకి దిగారు. స్వరాష్ట్రం బిహార్​లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యమంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జన సురాజ్ పేరిట ఆ రాష్ట్రంలో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది ఇక్కడే. పీకే పాదయాత్ర 12 నుంచి 18 నెలల పాటు కొనసాగనుంది. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్లనున్నారు. దాదాపు 3,500 కి.మీ ఆయన నడవనున్నారు.

పాదయాత్ర తొలిరోజే PKకు షాక్.. జనం రాక గ్రౌండ్ మొత్తం ఖాళీ

భారీ లక్ష్యాలు, అందుకు తగిన ఏర్పాట్లతో ఆదివారం పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే నిరాశ ఎదురైంది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసినా.. అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కనిపించినవారిలో కొందరు.. పీకే కోసం రాలేదని, అక్కడి గాంధీ ఆశ్రమ సందర్శన కోసం వచ్చినవారన్నది స్థానికుల మాట.

prashant kishor jan suraj padyatra
ఖాళీగా మైదానం
prashant kishor jan suraj padyatra
స్టేజీ వద్ద జనం

మూడు లక్ష్యాలతో పీకే పాదయాత్ర..
మూడు లక్ష్యాలతో ప్రశాంత్​ కిశోర్​ పాదయాత్ర కొనసాగుతుందని ఆయన టీమ్​ చెబుతోంది. క్షేత్రస్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకురావడం, వివిధ రంగాల్లో ఉన్న నిపుణుల ఆలోచనలకు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో యాత్ర సాగుతుందని​ స్పష్టం చేసింది.

'జన్​ సురాజ్'​ సామాజిక సంస్థను స్థాపించి..
నిజానికి.. కొన్నేళ్ల క్రితమే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్​లోని అధికార పక్షం జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ అధిష్ఠానం ఆయన్ను 2020 జనవరిలో బహిష్కరించింది. ఆ తర్వాత పీకే బిహార్ లో 'జన్ సురాజ్' పేరుతో ఒక సామాజిక సంస్థను స్థాపించారు. ఈ వేదిక పేరు మీదే ఆయన ఈ పాదయాత్ర చేపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.