గుజరాత్​లో పశువుల చుట్టూ రాజకీయం.. పోటీపడి ప్రత్యేక హామీలిస్తున్న పార్టీలు

author img

By

Published : Nov 24, 2022, 7:13 AM IST

politics Around cows and cattle in gujara

ఎక్కడైనా ఎన్నికలు జరిగితే రాజకీయ నాయకులు ప్రజల చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆరంభిస్తారు. గుజరాత్‌లో మాత్రం ప్రజలతో పాటు గోవులు, పశువుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆ రాష్ట్రంలో అన్నీ పార్టీలు పోటీపడి మరీ పశుసంరక్షణ కోసం హామీలు, తాయిలాలు ప్రకటిస్తున్నారు.

ఎక్కడైనా ఎన్నికలనగానే రాజకీయ నాయకులు ప్రజల చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆరంభిస్తారు. గుజరాత్‌లో మాత్రం ప్రజలతో పాటు గోవులు, పశువుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ప్రజల్లో గోవులకున్న గౌరవానికి తోడు.. పశువుల్ని సాకే మాల్దారీ వర్గం ఓట్లను ఆకర్షించటానికి పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి.ప్రజలు గోమాతగా పూజించే ఆవును కాదని గుజరాత్‌లో ఏ పార్టీ ముందుకు వెళ్లలేని పరిస్థితి.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నుంచి మొదలెడితే గల్లీ నాయకుడి దాకా అంతా గో ప్రదక్షిణ చేస్తున్నారు. పోటీపడి మరీ గోవుల కోసం, పశు సంరక్షణ కోసం హామీలు, తాయిలాలు ప్రకటిస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించిన ‘ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన’ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం రూ.500 కోట్లను కేటాయించారు. తమ గత బడ్జెట్‌ను గోపక్షపాత బడ్జెట్‌గా ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్‌ అభివర్ణించుకోవటం విశేషం.

gujarat assembly election 2022
గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలు 2022

ఇన్నాళ్లూ లౌకిక ముద్ర కోసమని గోవు అనే పదం వాడకుండా... జంతు పరిరక్షణ అంటూ మాట్లాడుతూ వచ్చిన కాంగ్రెస్‌ కూడా తొలిసారిగా ఈదఫా గోవుల గురించి మేనిఫెస్టోలో ప్రస్తావించింది. రాజస్థాన్‌ తరహాలో.. పాలపై లీటరుకు రూ.5 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా రాష్ట్రంలో గోశాలలను పునర్‌నిర్మిస్తామని, గోవులను రక్షించటానికి మరింతమంది పశువైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో నెగ్గటం కోసం కాకుండా గోవులను సంరక్షించాలనే సదుద్దేశంతో ఈ హామీ ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రత్యేకంగా పేర్కొనటం గమనార్హం. ఇక ఆమ్‌ ఆద్మీపార్టీ హామీల్లో మరో అడుగు ముందుకు వేసింది. గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఆవుకు రోజుకు రూ.40 చొప్పున నిర్వహణ ఖర్చుల కింద చెల్లిస్తామని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

భాజపాకు షాక్‌:
కొద్దికాలంగా ఈ మాల్దారీలు అధికార భాజపా పట్ల ఆగ్రహంతో ఉన్నారు. గుజరాత్‌ పశు నియంత్రణ చట్టమే ఇందుకు కారణం. పట్టణ ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న పశువుల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందంటూ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఫలితంగా.. భాజపా సర్కారు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. మాల్దారీలు ప్రతి పశువును ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేయించి లైసెన్స్‌ పొందాలి.

ఏదైనా పశువు రోడ్లపై కనిపిస్తే.. రూ.5వేల దాకా దాని యజమానికి జరిమానా విధిస్తారు. ఈ చట్టంపై మాల్దారీలు భారీ స్థాయిలో నిరసన తెలిపి ఉద్యమించారు. గాంధీనగర్‌ను స్తంభింపజేశారు. చివరకు.. ఓరోజు పాల సరఫరా నిలిపేశారు. ఉక్కిరిబిక్కిరైన భాజపా సర్కారు చివరకు చట్టాన్ని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ మాల్దారీల్లో కమలనాథులపై ఆగ్రహం చల్లారలేదు. డిసెంబరు 1, 5 తేదీల్లో జరిగే ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని మల్దారీ మహాపంచాయత్‌ నిర్ణయించటం గమనార్హం.

మాల్దారీలను ఆకట్టుకోవాలని..
పార్టీల ఈ ప్రకటనలన్నింటి వెనక.. గోవులపై ప్రేమ, గౌరవాలతో బాటు ఎన్నికల వ్యూహం కూడా దాగుంది. రాష్ట్రంలో గోవులు, పశుసంరక్షకులైన మాల్దారీలను ఆకట్టుకోవాలనేది నాయకుల ఎత్తుగడ! 75 లక్షలకుపైగా జనాభాగల ఈ మాల్దారీ వర్గం... 40-45 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటరీ సీట్ల ఫలితాలపై ప్రభావం చూపుతుందని అంచనా! ఈ వర్గం వ్యవస్థీకృతంగా, ఒక మాటమీద నిలబడి ఉంటుందని అంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.