'ఎన్నికల కోసమే శంకుస్థాపన అన్నారు.. ఈ ఎయిర్​పోర్ట్​తో వారికి గట్టి దెబ్బ'

author img

By

Published : Nov 19, 2022, 12:19 PM IST

Etv Bharat

అరుణాచల్​ ప్రదేశ్​లో తొలి "గ్రీన్ ఫీల్డ్" విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్​కు ఇదే తొలి విమానాశ్రయం కావడం విశేషం. ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మోదీ.. ఈశాన్య రాష్ట్రాలపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ధ్వజమెత్తారు.

అరుణాచల్ ప్రదేశ్​లో తొలి "గ్రీన్ ఫీల్డ్" విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇటానగర్‌లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన ఈ "డోనీ-పోలో" విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్‌లో తొలి ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. 2019 నవంబర్‌లో మోదీ ఈ గ్రీన్​ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయగా సుమారు రూ.645 కోట్లతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

Donyi Polo Airport in Itanagar
అరుణాచల్​ ప్రదేశ్​ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్​ పోర్ట్​

"నేను 2019లో శంకుస్థాపన చేసినప్పుడు కొంత మంది రాజకీయనేతలు విమర్శించారు. అసలు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించరని, ఎన్నికల కోసమే మోదీ శంకుస్థాపన చేస్తున్నాడని అన్నారు. తాజా ప్రారంభోత్సవంతో వారికి గట్టి దెబ్బ తగిలినట్టు అయ్యింది. స్వాతంత్య్రం తరువాత ఈశాన్య రాష్ట్రం భిన్నమైన యుగానికి సాక్షిగా మారింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి బలైపోయింది. వాజ్​పేయీ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిని మార్చేందుకు కృషి జరిగింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వం అటల్​దే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను సుదూర ప్రాంతాలని అనుకునేవి. కానీ మా ప్రభుత్వం వాటికీ ప్రాధాన్యం ఇచ్చింది. సేవ చేసేందుకు మీరు నాకు అవకాశం కల్పించారు. దీంతో ఈశాన్యంలో మార్పు తెచ్చేందుకు మరో శకం ప్రారంభమైనట్లైంది." అని మోదీ అన్నారు.

Donyi Polo Airport in Itanagar
అరుణాచల్​ ప్రదేశ్​ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్​ పోర్ట్​

మోదీ ప్రారంభించిన విమానాశ్రయంలో.. 8 చెక్‌ఇన్ కౌంటర్లతోపాటు వెయిటింగ్‌ హాల్‌లను ఏర్పాటు చేశారు. మెుత్తం 4,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన "డోనీ-పోలో" విమానాశ్రయంలో 2,300 మీటర్ల పొడవైన రన్​వేను నిర్మించారు. దీనిపై బోయింగ్-747 లాంటి భారీవిమానాలను సులభంగా ల్యాండింగ్, టేకాఫ్ చేయవచ్చని అధికారులు వివరించారు.

Donyi Polo Airport in Itanagar
అరుణాచల్​ ప్రదేశ్​ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్​ పోర్ట్​

దీంతోపాటు పశ్చిమ కమెంగ్ జిల్లాలో నిర్మించిన 600 కిలోవాట్ల హైడ్రో పవర్‌ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. 8వేల 450 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పశ్చిమ కమెంగ్‌ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారి... జాతీయ గ్రిడ్‌కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.