కాంగ్రెస్​కు 'లీకుల' భయం.. 'చింతన్ శిబిర్​'లో ఫోన్లు బ్యాన్!

author img

By

Published : May 13, 2022, 3:17 PM IST

CONG CHINTAN SHIVIR

పార్టీ నేతలంతా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. చింతన్ శిబిర్ సమావేశాల సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన సోనియా.. మోదీ పాలన కొనసాగితే... భవిష్యత్​లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ సమావేశాలకు 430 మంది నేతలు హాజరయ్యారు. తమతో పాటు ఫోన్లు తీసుకురావొద్దని వీరికి అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.

రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో కాంగ్రెస్ 'చింతన్ శిబిర్' ప్రారంభమైంది. 430 మంది కాంగ్రెస్ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై వీరంతా చర్చించి తీర్మానాలు చేయనున్నారు. చింతన్ శిబిర్​లో రూపొందించిన తీర్మానాలకు సీడబ్ల్యుసీ ఆమోదం లభించిన తరువాత సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లనుంది కాంగ్రెస్ పార్టీ.

chintan shivir sonia gandhi speech: నవ సంకల్ప్ చింతన్ శిబిర్​లో ప్రారంభోపన్యాసం చేశారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. నేతలంతా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలని సూచించారు. పార్టీ అంతా ఐకమత్యంగానే ఉందన్న సందేశం దేశప్రజలకు ఇవ్వాలని కోరారు. వ్యక్తిగత లక్ష్యాలకన్నా పార్టీకే ఎక్కువ విలువ ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎంతో చేసిందని, ఇప్పుడు పార్టీకి తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా పాలకపక్షంపై విమర్శలు గుప్పించారు. 2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయిందని ఆరోపించారు. మోదీ పాలన కొనసాగితే.. భవిష్యత్​లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

'దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశంలో ఉన్న మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు పెంచారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి. ప్రతిపక్ష నేతలపైకి విచారణ సంస్థలను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గాంధీని చంపిన వారిని హీరోలుగా చిత్రీకరిస్తున్నారు. నెహ్రూ నెలకొల్పిన సంస్థలన్నిటినీ ధ్వంసం చేస్తూ వ్యవస్థలపై ఉన్న జ్ఞాపకాలను తుడిచేస్తున్నారు. లౌకికత్వంపై దాడి చేస్తూ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. ఆదివాసీలు, దళితులు, మహిళలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయి. దేశాన్ని కార్పొరేట్ పరం చేస్తున్నారు. దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలి. అందుకు అనుగుణంగా వాతావరణం పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్​పై ఉంది.'

--సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

ఫోన్లు బ్యాన్!: పార్టీ భవితవ్యాన్ని తేల్చడంలో కీలకమని భావిస్తున్న చర్చల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పగడ్బందీగా వ్యవహరిస్తోంది. సమావేశాల్లో చర్చకు వచ్చే విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతోంది. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై ఏర్పాటైన ఆరు కమిటీల సభ్యులెవరూ తమ మొబైల్ ఫోన్లను వెంట ఉంచుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
'నవ సంకల్ప్ చింతన్ శిబిర్' పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ఉదయ్​పుర్​లోని తాజ్ ఆరవళిలో జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు వివిధ అంశాలపై నేతలు చర్చించనున్నారు. సభ్యులను ఆరు కమిటీలుగా విభజించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల ఇంఛార్జీలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మాజీ కేంద్రమంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశాలకు హాజరయ్యారు. ఆదివారం చర్చలకు చివరి రోజు కాగా.. ఆరోజు ఉదయం 11గం.లకు వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. సమావేశంలో రూపొందించిన డిక్లరేషన్​పై కమిటీ చర్చించనుంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​లో 'ఒకే కుటుంబం- ఒకే పదవి​' రూల్.. సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.