పీఎఫ్ఐ నాయకుల అరెస్టులకు నిరసనగా హర్తాళ్.. కేరళలో ఉద్రిక్త పరిస్థితులు.. భాజపా కార్యాలయంపై పెట్రోల్​ బాంబు​

author img

By

Published : Sep 23, 2022, 9:46 AM IST

Updated : Sep 23, 2022, 1:48 PM IST

PFI hartal in Kerala

PFI Hartal in Kerala: పీఎఫ్ఐ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కేరళలో ఆ సంస్థ నాయకులు హర్తాళ్​కు పిలుపునిచ్చారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అత్యవసర సర్వీసులకు హర్తాళ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. హర్తాళ్ నేపథ్యంలో పలు యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు రద్దు అయ్యాయి.

పీఎఫ్ఐ నాయకుల అరెస్టులకు నిరసనగా హర్తాళ్.. కేరళలో ఉద్రిక్త పరిస్థితులు

PFI Hartal in Kerala: పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర నేతలను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హర్తాళ్‌కు పిలుపునిచ్చారు ఆ సంస్థ మద్దతుదారులు. అయితే ఈ హర్తాళ్​ వల్ల పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తిరువనంతపురంలో ఆటో, కారుపై ఆందోళనకారులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ రెండు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొల్లాంలో ఇద్దరు పీఎఫ్ఐ కార్యకర్తలు బైక్​పై వచ్చి ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. హర్తాళ్​కు పీఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PFI hartal in Kerala
నిరసనకారుల దాడిలో ధ్వంసమైన కారు అద్దాలు
PFI hartal in Kerala
పహారా కాస్తున్న పోలీసులు

శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె నిర్వహిస్తామని పీఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ హర్తాళ్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు. కేరళ ఆర్టీసీ బస్సులను కట్టక్కాడ వద్ద పీఎఫ్ఐ మద్దతుదారులు నిలిపివేశారు. మరికొన్ని చోట్ల సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కేరళ, కన్నూర్, కాలికట్, ఎంజీ యూనివర్సిటీలు.. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి.

PFI hartal in Kerala
.

తిరువనంతపురం, కొల్లాం, కోజికోడ్, వయనాడ్, అలప్పుజ సహా పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కన్నూర్‌లోని నారాయణ్‌పరా వద్ద ఉదయం వార్తాపత్రికలను పంపిణీ చేయడానికి వెళ్తున్న వాహనంపై ఆందోళకారులు పెట్రోల్ బాంబు విసిరినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కోజీకోడ్​లో 15 ఏళ్ల బాలికకు, కన్నూర్​లో ఓ ఆటో డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. గురువారం ఎన్​ఐఏ అరెస్టు చేసిన వారిలో పీఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ బషీర్‌, జాతీయ ఛైర్మన్ సలాం, జాతీయ కార్యదర్శి నసరుద్దీన్‌ ఎలమారం, మాజీ ఛైర్మన్ అబూబాకర్‌ తదితరులున్నారు.

PFI hartal in Kerala
.

భాజపా కార్యాలయంపై దాడి..
పీఎఫ్‌ఐపై ఎన్‌ఐఏ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే తమిళనాడు.. కోయంబత్తూరులోని భాజపా కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు దుండగులు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. దీంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ దాడిని ఉగ్రదాడిగా అభివర్ణించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

PFI hartal in Kerala
భాజపా కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి

సుమోటోగా స్వీకరించిన హైకోర్టు..
పీఎఫ్‌ఐ హర్తాళ్‌ను కేరళ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పీఎఫ్ఐ చేపట్టిన ఆందోళనల్లో హింసలు చెలరేగిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే హర్తాళ్‌ను నిషేధించామని, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని అంగీకరించలేమని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హింసను అరికట్టేందుకు సాధ్యమైన మార్గాలను చూడాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది.

అసలేంటి పీఎఫ్ఐ కేసు?
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఎన్​ఐఏ సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 106 మంది పీఎఫ్ఐకి చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ దాడులు ఉత్తర్​ప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో గురువారం వేకువజామున జరిగాయి. 40 చోట్ల ఎన్​ఐఏ దాడులు నిర్వహించింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్​, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఎన్​ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది. వీరిని హైదరాబాద్​లో ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి: అమ్మవారి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడికి రూ.60 వేలు జరిమానా!

నదిలో బోల్తా పడ్డ స్కూల్​ విద్యార్థుల బోటు.. ఒక్కసారిగా 25 మంది పిల్లలు!

Last Updated :Sep 23, 2022, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.