'బహిష్కార ఉత్తర్వు అసాధారణ చర్య'

author img

By

Published : Jan 29, 2022, 4:57 AM IST

Updated : Jan 29, 2022, 5:48 AM IST

SC

Supreme court judgement: వ్యక్తిని బహిష్కరించడం అంటే నిర్ణీత కాలం వరకు అతనిని తన సొంత ఇంటిలో కూడా నివసించేందుకు తిరస్కరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అతనికి జీవనోపాధి కూడా లభించకుండా చేయడమేనని పేర్కొంది. ఇటువంటి ఉత్తర్వు జారీ అసాధారణమైన చర్య అని స్పష్టం చేసింది.

Supreme court judgement: ఒక ప్రాంతం నుంచి వ్యక్తిని బహిష్కరించడం అంటే నిర్ణీత కాలం వరకూ అతనిని తన సొంత ఇంటిలో కూడా నివసించేందుకు తిరస్కరించడమేనని, జీవనోపాధి లభించకుండా చేయడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి ఉత్తర్వు జారీ అసాధారణమైన చర్యేనని స్పష్టం చేసింది. దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే పౌరుడి ప్రాథమిక హక్కుపైనా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లా నుంచి ఓ వ్యక్తిని రెండేళ్ల పాటు బహిష్కరిస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది.

2020 డిసెంబరులో జారీ అయిన ఈ ఉత్తర్వును గత ఏడాది డిసెంబరులో బాంబే హైకోర్టులో పిటిషనర్‌ సవాల్‌ చేశారు. పోలీసుల ఉత్తర్వును రద్దు చేసేందుకు న్యాయస్థానం తిరస్కరించిన కారణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రికార్డులో నమోదైన ఆధారాల ప్రకారం.. బహిష్కరణ ఉత్తర్వు ఏకపక్షంగా, విచక్షణారహితంగా జారీ అయినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధారణకు వచ్చింది. కుటుంబ వివాదంలో ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు జల్నా పోలీసులు దురుద్దేశపూర్వకంగా జిల్లా నుంచి ఆ వ్యక్తిని రెండేళ్లపాటు బహిష్కరించారు.

దీని కోసం మహారాష్ట్ర పోలీస్‌ చట్టం-1851లోని సెక్షన్‌ 56 (1)(ఎ)(బి) నిబంధనను సాకుగా వాడుకున్నారు. బాంబే హైకోర్టు తీర్పునూ సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. బహిష్కార చర్య అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

సామాజిక, మత ట్రస్టులపై నియంత్రణ పరిమితి దాటొద్దు- సుప్రీం కోర్టు

స్వతంత్ర ప్రతిపత్తి గల సామాజిక మత ట్రస్టులపై ప్రభుత్వాలు అపరిమితమైన నియంత్రణను చెలాయించటం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిధిని అతిక్రమించి ఆయా సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే వాటి స్వయంపాలనకు, ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లుతుందని, ఆయా ట్రస్టుల స్థాపిత లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన పార్సీ జొరాష్టియన్‌ అనుమన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ యు.యు. లలిత, జస్టిస్‌ ఆర్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం శుక్రవారం ఈ తీర్చును వెలువరించింది. ఆ సంస్థకు చెందిన అయిదు స్థిరాస్తుల విక్రయానికి అనుమతించింది. ప్రజల విరాళాలతో నడిచే ట్రస్టుల ఆస్తుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఉంటాయని, అయితే, దీనిని అవకాశంగా తీసుకుని వాటి పాలనా వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం తగదని స్పష్టం చేసింది. ఇండోర్‌లోని తమ ట్రస్టుకు చెందిన ఆస్తుల విక్రయానికి అనుమతించాలని కోరుతూ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ సొసైటీస్‌కు సంస్థ దరఖాస్తు చేసుకోగా అధికారులు నిరాకరించారు. దీనిపై హైకోర్టులోని ఇండోర్‌ ధర్మాసనాన్ని ఆశ్రయించినా తీర్పు వ్యతిరేకంగానే వచ్చింది. ట్రస్ట్​ కార్యకలాపాలన్నీ సక్రమంగానే ఉన్నాయని, సభ్యులందరి అభిప్రాయం మేరకే ఆస్తుల విక్రయ నిర్ణయం జరిగినందున ప్రభుత్వం అనుమతి నిరాకరణ సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇండోర్‌ ధర్మాసనం తీర్పును తప్పుపట్టింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: గుడిసెలో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం

Last Updated :Jan 29, 2022, 5:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.