భారత్​కు వచ్చే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. కీలక నిబంధన ఎత్తివేత

author img

By

Published : Nov 21, 2022, 10:53 PM IST

new rules for international passengers in india

Air Suvidha : విమానంలో మాస్క్​ తప్పనిసరిని ఎత్తివేసిన భారత్​ తాజాగా మరో నిబంధనను ఎత్తివేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న 'ఎయిర్​ సువిధ' నిబంధనను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.

Air Suvidha : విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొవిడ్‌ నేపథ్యంలో 'ఎయిర్‌ సువిధ' సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న నిబంధనను ఎత్తివేసింది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ వ్యాక్సిన్‌, ఎన్ని డోసులు , ఎప్పుడెప్పుడు వేయించుకున్నారన్న దానిని కూడా పత్రంలో కచ్చితంగా నింపాలి. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్‌ టెస్టు వివరాలను అందులో పొందుపరచాలి. తాజాగా ఈ నిబంధనను భారత్‌ ఎత్తివేసింది. అయితే ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతనే భారత్‌కు రావడం మంచిదని పేర్కొంది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను ఇటీవల కేంద్రం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

తాజాగా 'ఎయిర్‌ సువిధ' నిబంధనను ఎత్తివేసినప్పటికీ.. కొన్ని అంశాలను ప్రయాణికులు కచ్చితంగా పాటించాలని కేంద్రం పేర్కొంది. ప్రయాణ సమయంలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్లు మాస్కు ధరించాలని, మిగతా ప్రయాణికులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటివారు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు డీ బోర్డింగ్‌ సమయంలోనూ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు కొనసాగుతాయని, ఒకవేళ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లాలని పేర్కొంది. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, దాదాపు అన్నిదేశాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఆంక్షలు ఎత్తివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.