నాగాలాండ్​ కాల్పులపై షా విచారం- అసలేమైందో సవివరంగా చెప్పిన మంత్రి

author img

By

Published : Dec 6, 2021, 3:33 PM IST

Updated : Dec 6, 2021, 5:08 PM IST

nagaland firing incident

Amit Shah on Nagaland firing incident: ఉభయసభల వేదికగా.. నాగాలాండ్​ కాల్పుల ఘటనపై కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తిరుగుబాటుదారుల కదలికలపై సమాచారం అందుకున్న జవాన్లు ఆపరేషన్​ చేపట్టారని వివరించారు. ఈ క్రమంలోనే ఓ వాహనాన్ని అపినట్టు తెలిపారు. ఆదేశాలిచ్చినా ఆగకపోవడం వల్ల వాహనంపై కాల్పులు జరిపినట్టు స్పష్టం చేశారు.

Amit shah statement on Nagaland fire incident: నాగాలాండ్​ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సిట్​ను ఏర్పాటు చేసినట్టు, నెల రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించినట్టు తెలిపారు. తిరుగుబాటుదారులపై చర్యలు చేపట్టే క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్ని సంస్థలకు సూచించారు.

నాగాలాండ్​ ఘటనపై ఉభయ సభల్లో సోమవారం మధ్యాహ్నం ప్రకటన చేశారు అమిత్​ షా. తొలుత లోక్​సభలో ప్రసంగించిన ఆయన.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.

"మోన్​ పట్టణంలో తిరుగుబాటుదారులు సంచరిస్తున్నట్టు పక్కా సమాచారంతో 21 పారా కమాండో బృందం ఆపరేషన్​ చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనాన్ని జవాన్లు అడ్డుకున్నారు. అదేశాలిచ్చినా, ఆ వాహనం ఆగలేదు. దీంతో అనుమానం మరింత పెరిగి, జవాన్లు కాల్పులు జరిపారు. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు మరణించారు. అయితే వాహనంలో ఉన్నది తిరుగుబాటుదారులు కాదని, పౌరులను ఆ తర్వాత తెలిసింది. జవాన్లే వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనిక శిబిరాలను ధ్వంసం చేశారు. ప్రజలు చెదరగొట్టేందుకు జవాన్లు కాల్పులు జరపక తప్పలేదు. ఈ ఘటనలో ఓ జవానుతో పాటు మరో ఏడుగురు పౌరులు మరణించారు."

-- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

అమిత్​ షా చేసిన ప్రకటనపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాంగ్రెస్​, డీఎంకే, ఎస్​పీ, బీఎస్​పీ, ఎన్​సీపీలు లోక్​సభ నుంచి వాకౌట్​ చేశాయి. అటు నాగాలాండ్​ కాల్పుల అంశం నేపథ్యంలో రాజ్యసభలో ఉదయం నుంచి వాయిదాల పర్వం కొనసాగింది. అమిత్​ షా చేసిన ప్రకటన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.

ఇదీ చూడండి:- నాగాలాండ్​ ఘటనపై రగడ- పార్లమెంటులో వాయిదాల పర్వం

Last Updated :Dec 6, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.