నమ్మించి లక్షలు చోరీ.. చనిపోయినట్లు డ్రామా.. 9 నెలల తర్వాత సీన్​ రివర్స్!

author img

By

Published : May 9, 2022, 1:15 PM IST

MP Man fakes his death

అతడు ఓ డ్రైవర్. గతేడాది అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న వార్త అందింది. కుటుంబసభ్యులు అంతిమసంస్కారాలు నిర్వహించారు. తీరా చూస్తే.. 9 నెలల తర్వాత చోరీ కేసులో అరెస్టయ్యాడు. ఎవరతడు? ఏం జరిగింది?

చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, చనిపోయినట్లు నమ్మించి మోసం చేసిన వ్యక్తిని.. 9 నెలల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్​ ఛతర్​పుర్​ జిల్లాలో జరిగిందీ ఘటన. ఆ వ్యక్తి చనిపోయాడని అనుకుని అతడి కుటుంబసభ్యులు గతేడాదే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. డీఎన్​ఏ నివేదిక సరిపోలకపోవడం వల్ల అసలు విషయం బయటపడింది.

చోరీ.. అదృశ్యం.. మరణం!: గతేడాది జులై 16న సుధీర్​ అగర్వాల్ అనే వ్యాపారి బమితా పోలీస్​ స్టేషన్​లో ఓ ఫిర్యాదు చేశారు. పికప్ ట్రక్ డ్రైవర్ అయిన సునీల్ నామ్​దేవ్​ తనను మోసం చేసి, డబ్బులు కాజేశాడని ఆరోపించారు. తాను పంపిన ఐరన్ లోడును రాజ్​నగర్​లో దింపి, అక్కడి వారు ఇచ్చిన రూ.6.65లక్షలు తీసుకుని మాయం అయిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు సుధీర్.

కొద్దిరోజుల తర్వాత సునీల్​ నడిపే వాహనం ఓ గోదాము దగ్గర కనిపించింది. జులై 24న బమితా ఠాణా పరిధిలోని కోడాహర్ ప్రాంతంలో గుర్తుతెలియని శవం పడి ఉంది. అది సునీల్​దేనంటూ అతడి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కానీ.. మృతదేహం సాంపిళ్లు సేకరించి చేసిన డీఎన్​ఏ పరీక్ష ఫలితాలు.. సునీల్ కుటుంబసభ్యుల డీఎన్​ఏతో సరిపోలలేదు. ఫలితంగా మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మే 3న బాగేశ్వర్ ధామ్ అలయానికి వెళ్తున్న సుధీర్​కు.. గధా టిగడ్డ ప్రాంతంలో సునీల్ కనిపించాడు. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడిగాడు. సునీల్ ఎదురుదాడికి దిగాడు. ఇప్పటికే తాను పోలీసు రికార్డుల్లో చనిపోయానని, తన జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు.
సుధీర్ అగర్వాల్ పోలీసులకు అసలు విషయం చెప్పారు. వారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గతవారం సునీల్​ను అరెస్టు చేశారు. అతడి దగ్గర ఉన్న రూ.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.