50 నిమిషాల్లోనే 1,484 అగ్రో రోబోలు తయారీ.. చైనా రికార్డ్ బ్రేక్ చేసిన విద్యార్థులు​

author img

By

Published : Jan 24, 2023, 1:06 PM IST

bhopal students made agro robot

మధ్యప్రదేశ్​కు చెందిన 1,484 మంది స్కూల్​ స్టూడెంట్స్​ కేవలం 50 నిమిషాల్లోనే.. అగ్రో రోబోలను తయారుచేసి గిన్నిస్​ రికార్డ్​ను సొంతం చేసుకున్నారు. వ్యవసాయ రంగానికి సాయపడే.. ఈ రోబోలను తయారుచేసి చైనా పేరిట ఉన్న రికార్డ్​ను బ్రేక్​ చేశారు.

భోపాల్​లో అగ్రో రోబోలు తయారు చేసిన 1,484 మంది విద్యార్థులు

మధ్యప్రదేశ్​ భోపాల్​కు చెందిన విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. అగ్రో రోబోల తయారీలో గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ను నెలకొల్పారు. వివిధ పాఠశాలలకు చెందిన 6 నుంచి 9 తరగతి విద్యార్థులు 1,484 మంది కేవలం 50 నిమిషాల్లోనే తయారు చేశారు. మరి కొందరు విద్యార్థులైతే ఈ రోబోలను కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి చేయడం విశేషం.

సైన్స్​ ఫెస్టివల్​లో భాగంగా విజ్ఞాన్ భారతి ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో.. మౌలానా ఆజాద్​ నేషనల్​ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ పాఠశాలలకు చెందిన 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 1,484 మంది అనుకున్న సమయానికి అగ్రో రోబోలు తయారుచేశారు. పలువురు విద్యార్థులు.. దాదాపు 15 నిమిషాల్లో రోబోను తయారు చేశారు. గతంలో ఈ రికార్డ్​ చైనాలోని హాంకాంక్​ పేరిట ఉండేదని కమిటీ నిర్వహకులు వెల్లడించారు. ఆ కార్యక్రమంలో 270 మంది విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారని కమిటీ నిర్వహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1,484 మంది 6 నుంచి 9 తరగతి విద్యార్థులు.. నాలుగు రకాల అగ్రో రోబోలను తయారుచేశారు. వారిలో ఒక్కొక్కరూ ఒక్కోరకం రోబోను తయారుచేశారు. అందులో ఒకటి విత్తనాలను మట్టిలో నాటడానికి సహాయపడగా.. రెండోరకం రోబోలు మొక్కలకు నీటిని అందించడానికి ఉపయోగపడుతుంది. నేలను చదును చేయడానికి ఒకటి.. నేలను దున్నడానికి మరో రోబో సహాయపడుతుందని కమిటీ నిర్వహకులు వెల్లడించారు.

ఈ రోబోలను తయారుచేయడాని ఎక్కువ రోజులు సాధన కూడా చేయలేదని విద్యార్థులు తెలిపారు. తామెంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని.. ఈ రోబోల తయారీ కొత్త అనుభవాన్ని అందించిందని విద్యార్థులు తెలిపారు. చైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్​ శాస్త్రీయ, సాంకేతిక మంత్రి ఓంప్రకాశ్​ సక్లేచా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిన్నిస్ వరల్డ్​ రికార్డ్​ న్యాయనిర్ణేతలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు.. వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.