మార్చురీలో డెడ్​బాడీల కళ్లు మాయం.. ఎలుకలే కారణమట!

author img

By

Published : Jan 21, 2023, 10:17 PM IST

dead body eyes missing

మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో ఆశ్చర్యకర విషయం బయటపడింది. మార్చురీలోని మృతదేహాల కళ్లు మాయమవ్వడం కలకలం రేపుతోంది. అసలేం జరిగిందంటే?

మృతదేహాలను మార్చురీలో భద్రపరిచినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మృతదేహాలు పాడవ్వకుండా ఫ్రీజర్లలో ఉంచుతారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మృతదేహం నుంచి వాసన రాకుండా లేపనాలు కూడా పూస్తారు. అయితే మధ్యప్రదేశ్‌.. సాగర్‌ జిల్లా ఆస్పత్రిలో మృతదేహాల కళ్లు మాయమయ్యాయి. ఇలా ఒకసారి జరిగితే నిర్వహణ లోపం అనుకోవచ్చు. రెండోసారి కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. అయితే.. ఈ ఘటనలకు ఎలుకలే కారణమై ఉండొచ్చని వైద్యాధికారులు చెప్పడం గమనార్హం.

ఎలుకలు కన్ను ఎత్తుకుపోయాయి!
32 ఏళ్ల మోతీలాల్‌ పొలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లడం వల్ల కుటుంబ సభ్యులు జనవరి 4న సాగర్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. జనవరి 5న వైద్యుడు వచ్చి చూసేసరికి ఓ కన్ను మాయమైంది. అయితే ఫ్రీజర్‌ సరిగా పని చేయకపోవడం వల్ల మృతదేహాన్ని బయటే ఉంచాల్సి వచ్చిందని అందువల్ల ఎలుకలు కన్ను ఎత్తుకుపోయి ఉండొచ్చని అక్కడి వైద్యులు వివరణ ఇచ్చారు.

సరిగ్గా 15 రోజుల తర్వాత జనవరి 19న ఇదే తరహా ఘటన మళ్లీ రిపీట్‌ అయ్యింది. 25 ఏళ్ల రమేశ్‌ అహివార్‌ అనే వ్యక్తి జనవరి 16న తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. వెంటిలేటర్‌పై అతడికి చికిత్స అందించిన వైద్యులు ఆ తర్వాతి రోజు రాత్రి మృతి చెందినట్లు వెల్లడించారు. మెడికో లీగల్‌ కేసు అయినందువల్ల దర్యాప్తు కోసం పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా మృత దేహాన్ని ఫ్రీజర్లో భద్రపరిచారు. ఈ నెల 19న పోలీసుల సమక్షంలో డాక్టర్‌ ఫ్రీజర్‌ను తెరచి చూసేసరికి ఒక కన్ను మాయమైంది.

ఫ్రీజర్‌లో ఉంచినా.. కన్ను ఎలా మాయమైందో అర్థం కావడం లేదని రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వెల్లడించారు. ఎలుకలే కన్నును ఎత్తుకుపోయి ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన అన్నారు. మార్చురీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆస్పత్రి అధికారులకు తాజాగా నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.