శిందే తిరుగుబాటు సక్సెస్.. బలంగా రెబల్ క్యాంప్.. ఠాక్రేకు ఛాన్స్ ఉందా?

author img

By

Published : Jun 23, 2022, 5:30 PM IST

Updated : Jun 23, 2022, 10:10 PM IST

Maharashtra political situation

Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరింది. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు శిందే క్యాంపునకు చేరుకున్న నేపథ్యంలో.. తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనని శివసేన చెబుతుండగా.. ప్రభుత్వం కూలిపోతే విపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ స్పష్టం చేసింది.

Maharashtra political situation: మహారాష్ట్రలో రాజకీయాలు నాటకీయ మలుపులు తీసుకుంటున్నాయి. తిరుగుబాటు నేత ఏక్​నాథ్ శిందే క్యాంపు 42 మంది ఎమ్మెల్యేలతో బలంగా కనిపిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలలో 35 మంది శివసేన వారు కాగా.. ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. గురువారం రాత్రి మరికొంతమంది శివసేన ఎమ్మెల్యేలు రెబల్స్​కు జతకలిశారు. వీరంతా అసోం రాజధాని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్​లో బస చేస్తున్నారు. ఇందుకు సంబంధించి.. రెబల్ క్యాంపు నుంచి వీడియోలు బయటకు వచ్చాయి.

shinde camp mla
శిందే క్యాంపు ఎమ్మెల్యేలు

శివసేనకు సభలో 54 మంది సభ్యుల బలం ఉంది. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు శిందేవైపు చేరితే.. చట్టబద్ధంగా శాసనపక్ష హోదా పొందే అవకాశం రెబల్స్​కు లభిస్తుంది. గురువారం రాత్రి అసోంకు చేరుకున్న ఎమ్మెల్యేలతో కలుపుకొంటే.. రెబల్ వర్గానికి మ్యేజిక్ ఫిగర్ లభించినట్లే కనిపిస్తోంది. తాజా పరిస్థితుల్లో ఠాక్రే సర్కారు కూలడమే తరువాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా శిందేను ఎన్నుకున్నారు.

Maharashtra political drama: ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 24 గంటల్లో ఎమ్మెల్యేలు ముంబయికి తిరిగి వస్తే సమస్యలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించవచ్చని అన్నారు. "మీరు నిజంగా శివసైనికులైతే పార్టీని విడిచిపెట్టరు. మీ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ట్విట్టర్​, వాట్సాప్ ద్వారా లేఖలు రాయొద్దు. 24 గంటల్లోగా ముంబయికి వస్తే సీఎం ఠాక్రేతో చర్చిద్దాం. రెబల్ ఎమ్మెల్యేలు హిందుత్వ గురించి మాట్లాడుతున్నారు. అఘాడీ నుంచి శివసేన తప్పుకోవాలని భావిస్తే ఆ విషయాన్ని ముంబయికి వచ్చి చెప్పండి. సమస్య ప్రభుత్వంతో అయినప్పుడు ఠాక్రేతో చర్చించండి" అని సంజయ్ రౌత్ అన్నారు. అదే సమయంలో, ఠాక్రే వర్ష బంగ్లా (సీఎం అధికారిక నివాసం)కు తిరిగి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు రౌత్. 'గువాహటిలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలలో 21 మంది మాతో టచ్​లో ఉన్నారు. ముంబయికి వచ్చాక వారు మాతోనే కలుస్తారు' అని రౌత్ చెప్పారు.

Maharashtra political news: మహావికాస్ అఘాడీ సర్కారు కూలిపోతే తాము విపక్షంలో కూర్చుంటామని మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత జయంత్ పాటిల్ పేర్కొన్నారు. శరద్ పవార్​తో కీలక భేటీకి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనించాం. ప్రభుత్వం నిలబడేందుకు చేయాల్సినదంతా చేయాలని పవార్ చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకు, ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాం. ముఖ్యమంత్రి పదవి శివసేనకు కేటాయించాం. వారు సొంత ఎమ్మెల్యేలలో ఎవరికైనా పదవి ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వం నిలబడితే అధికారంలో ఉంటాం. లేదంటే విపక్షంలో కూర్చుంటాం. ఇతర పార్టీలతో ఎన్సీపీ చేతులు కలపదు" అని స్పష్టం చేశారు. అదే సమయంలో శిందేకు చురకలు అంటించారు. 'పక్క రాష్ట్రాలలో కూర్చోవడం కాదు. దమ్ముంటే రెబల్ మంత్రి శిందే ఇక్కడకు వచ్చి తన బల నిరూపణ చేసుకోవాలి. ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్​ వద్దకు వెళ్లాలి' అని హితవు పలికారు.

ఇక, అఘాడీ నుంచి వైదొలుగుతామన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరి వరకు శివసేనతో కలిసే ఉంటామని, బలపరీక్షకూ సిద్ధమేనని కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పష్టం చేశారు. వేరే వారితో పొత్తులు కుదుర్చుకోవాలంటే అది శివసేన ఇష్టం అని అన్నారు.

రెబల్ కిడ్నాప్ డ్రామా?
తిరుగుబాటు చేసి తిరిగి ముంబయికి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్​ముఖ్ తనను కిడ్నాప్ చేశారని చెప్పారు. పారిపోయేందుకు ప్రయత్నించగా.. సూరత్ పోలీసులు పట్టుకున్నారని ఆరోపించారు. 300-350 మంది పోలీసులు తమపై నిఘా వేశారని చెప్పారు. తనకన్నా ముందు ఎమ్మెల్యే ప్రకాశ్ అభిత్కర్ పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని తెలియగానే పారిపోయి వచ్చానని చెప్పారు. అయితే, ఆయన ఆరోపణలను రెబల్స్ దీటుగా తిప్పికొట్టారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో నవ్వుతూ కలిసి ఉన్న ఫొటోలను విడుదల చేశారు.

maharashtra-political-crisis
మీడియా సమావేశంలో నితిన్ దేశ్​ముఖ్
maharashtra political crisis
విమానం ముందు సెల్ఫీలు
maharashtra political crisis
తిరుగుబాటు ఎమ్మెల్యేలతో విమానంలో...

కాగా, మరో ఎమ్మెల్యే కైలాశ్ పాటిల్ సైతం తనను ట్రాప్ చేసి సూరత్​కు తీసుకెళ్లారని ఆరోపించారు. కిలోమీటర్ దూరం నడిచి అక్కడి నుంచి పారిపోయి వచ్చానని చెప్పారు. తనను ఎమ్మెల్యేను చేసిన శివసేన పార్టీకి వెన్నుపోటు పొడవనని చెప్పుకొచ్చారు.

మరోవైపు, శివసేన రెబల్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్​కు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. 'ద్రోహి' అని రాసి ఉన్న బ్యానర్లను నియోజకవర్గవ్యాప్తంగా ప్రదర్శించారు. ఇక, కొన్ని ప్రాంతాల్లో దేవేంద్ర ఫడణవీస్​ మళ్లీ సీఎం అయ్యేలా చూడాలని ప్రార్థిస్తూ భాజపా వర్గాలు బ్యానర్లు కట్టాయి.

నెక్ట్స్ ఏంటి? ఎవరి చేతుల్లో ఏముంది?
ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ ముగింపు ఏక్​నాథ్ శిందే చేతుల్లో ఉంది. శివసేన సర్కారు నిలబడాలన్నా.. భాజపా ప్రభుత్వం ఏర్పడాలన్నా.. లేదా అసెంబ్లీ రద్దు కావాలన్నా.. శిందే నిర్ణయమే కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న అవకాశాలను ఓసారి పరిశీలిస్తే..

ముందుగా తన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు గుర్తింపు తెచ్చుకోవాలి. ఇందుకోసం గవర్నర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. గవర్నర్ ఈ ఎమ్మెల్యేలను గుర్తిస్తే ఫిరాయింపు చట్టం నుంచి వీరికి రక్షణ లభిస్తుంది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలో మూడింట రెండొంతుల మంది మద్దతు కూడగట్టగలిగితే.. తమనే శివసేన శాసనసభా పక్షంగా గుర్తించాలని గవర్నర్​ను కోరవచ్చు. ఇందుకోసం ఆయనకు 37 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఎమ్మెల్యేలందరితో కలిసి భాజపాలో చేరే అవకాశం కూడా శిందే ముందుంది. అయితే, శివసేనకు నిజమైన మద్దతుదారుడిగా, బాల్ ఠాక్రేకు విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. భాజపాలో చేరితే ఆ గుర్తింపు పోతుంది. ఠాణె ప్రాంతంపై శిందేకు గట్టి పట్టు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పనిచేసే శివసేన కార్యకర్తలు భాజపాలో చేరుతారా? అంటే కష్టమే! ఇటీవల ఆయన చేసిన ప్రకటనల్లో భాజపాలో చేరుతున్నట్టు ఎక్కడా చెప్పలేదు. ఈ నేపథ్యంలో శిందే ఆ రిస్క్ చేస్తారా అనేది ప్రశ్నార్థకం.

ఠాక్రే ముందున్న ఆప్షన్స్ ఏంటి?
సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తన పార్టీపై పట్టుకోల్పోయారు ఉద్ధవ్ ఠాక్రే! బుధవారం ఫేస్​బుక్ లైవ్​లో భావోద్వేగ ప్రసంగం చేసిన ఆయన.. వెంటనే సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. తద్వారా తన ఓటమిని ఒప్పుకున్నారు! అయితే, ఆయన ఇంకా రాజీనామా చేయలేదు. పరిస్థితులన్నీ ఆయన చేయి దాటిపోయాయని ఇప్పుడే చెప్పలేం. సభలో బలం నిరూపించుకొనే ఒక్క అవకాశం ఆయన ముందు ఉంది. ఇది జరగాలంటే, ముందుగా రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించి.. తనవైపు తిప్పుకోవాలి.

భాజపా ఏం చేయగలదంటే?
ప్రస్తుత పరిణామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి, భాజపా నేత రావ్​సాహెబ్ ధన్వే పాటిల్ చెబుతున్నారు. అయితే, విపక్షనేత దేవేంద్ర ఫడణవీస్​తో భాజపా నేతలు చర్చలు జరుపుతున్నారు.

ప్రభుత్వం కూలిపోతే కలిసొచ్చేది భాజపాకే. అయితే, ముందు శివసేన కూటమి సర్కారు మైనారిటీలో పడిందని గవర్నర్​ గుర్తించాలి. అది జరగాలంటే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు.. తమను ప్రత్యేక కూటమిగానో, శివసేన సభాపక్షంగానో గుర్తింపు పొందాలి. అనంతరం, వీరి మద్దతును భాజపా కూడగట్టుకోవాలి. సభలో అతిపెద్ద పార్టీ భాజపానే కాబట్టి గవర్నర్.. వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. గవర్నర్ ఆహ్వానాన్ని వీరు అంగీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. రెండున్నరేళ్లు అధికారంలో కొనసాగుతారు. భాజపా ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఎన్నికలు అనివార్యం అవుతాయి. రాష్ట్రపతి పాలన విధించి.. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

గవర్నర్ పాత్ర కీలకం..
రాష్ట్రంలో ఇప్పుడు గవర్నర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఎమ్మెల్యేలను గుర్తించాలని శిందే లేఖ రాస్తే.. సంఖ్యాబలంపై గవర్నర్ నిర్ధరణకు రావాలి. శిందే అభ్యర్థనను ఠాక్రే సవాల్ చేస్తే.. అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి.. అవిశ్వాస తీర్మానానికి ఆదేశించాలి. ప్రభుత్వం కూలిపోతే భాజపాకు ఆహ్వానం అందించే అధికారం గవర్నర్​కు ఉంటుంది.

ఎన్సీపీ-కాంగ్రెస్??
చివరివరకు ఠాక్రేతో ఉంటామని ఎన్సీపీ చెబుతోంది. ప్రభుత్వం కూలిపోతే విపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వం పతనమైతే కాంగ్రెస్​ది సైతం ఇదే పరిస్థితి కానుంది.

ఇదీ చదవండి:

Last Updated :Jun 23, 2022, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.