సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేసిన ఠాక్రే.. కుటుంబ సభ్యులతో సహా..

author img

By

Published : Jun 22, 2022, 7:10 AM IST

Updated : Jun 22, 2022, 9:54 PM IST

Maharashtra political crisis

21:52 June 22

సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేసిన ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. వర్ష బంగ్లా నుంచి తన లగేజీతో పాటు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని బయటకు వచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

21:18 June 22

'శిందేను సీఎంను చేయండి..'
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ భేటీ అయ్యారు. సుప్రియా సూలే, జితేంద్ర అవద్‌తో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన పవార్‌.. దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం పవార్‌, సుప్రియా సూలేతో కలిసి తన నివాసం నుంచి బయటకు వచ్చిన సీఎం ఉద్ధవ్‌ తన మద్దతుదారులకు అభివాదం చేశారు. అయితే, ఈ కీలక భేటీలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేను ముఖ్యమంత్రి చేయాలని శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ సూచించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్‌ శిందే వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు నలుగురు స్వతంత్రులతో కలిపి 34మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు నిలవగా.. తాజాగా మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చార్టర్డ్‌ విమానంలో గువాహటికి చేరుకున్నట్టు సమాచారం.

ఉద్ధవ్‌ ప్రసంగం తర్వాత ఏక్‌నాథ్‌ ట్వీట్‌
మరోవైపు, శివసేన మనుగడ కోసం అసహజమైన పొత్తు నుంచి బయటపడటం ఎంతో అవసరమని ఆ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన నేత ఏక్‌నాథ్‌ శిందే అన్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసంగించిన అనంతరం ఆయన ట్విటర్‌లో స్పందించారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో కేవలం కాంగ్రెస్‌, ఎన్సీపీలే లబ్ధి పొందాయని.. శివసైనికులు మునిగిపోయారన్నారు. పార్టీ, శివసైనికుల మనుగడ కోసం అసహజమైన కూటమి నుంచి బయటపడటం అవసరమని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

17:56 June 22

గుజరాత్​లో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు తమను బలవంతంగా తీసుకెళ్లినట్లు ఫోన్ చేసి చెప్పారని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. శివసేన ఎమ్మెల్యేలలో ఓ ఒక్కరు తనను రాజీనామా చేయమన్నా.. వెంటనే పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. తన తర్వాత కూడా శివసేన నేతే సీఎం అయితే సంతోషిస్తానని పేర్కొన్నారు.

17:53 June 22

  • శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదు: ఉద్ధవ్‌ ఠాక్రే
  • హిందుత్వ అనేది మా గుర్తింపు, భావజాలం: ఉద్ధవ్‌ ఠాక్రే
  • సీఎం పదవి తీసుకోవాలని శరద్ పవార్ నన్ను కోరారు: ఉద్ధవ్‌
  • శరద్ పవార్‌ కోరిక మేరకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాం: ఉద్ధవ్‌
  • ముఖ్యమంత్రిగా నా విధులు సమర్థంగా నిర్వహించా: ఉద్ధవ్ ఠాక్రే
  • రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకున్నా: ఉద్ధవ్‌ ఠాక్రే

17:44 June 22

శివసేన ఎమ్మెల్యే ఏక్​నాథ్ షిందే ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన తర్వాత తొలిసారి ఫేస్​బుక్​ లైవ్​లో ప్రసంగించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఇది బాలా సాహెబ్ శివసేన కాదని కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలు బాలా సాబెహ్ సిద్ధాంతాలేంటో వారు చెప్పాలన్నారు. శివసేన అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉందన్నారు. హిందుత్వమే శివసేన భావజాలమని స్పష్టం చేశారు.

15:33 June 22

'బలవంతంగా ఇంజెక్షన్లు ఇచ్చారు'
రెబల్ మంత్రి ఏక్​నాథ్ శిందేతో సూరత్​కు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్​ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఇంజెక్షన్లు ఇచ్చారని తెలిపారు. తనకు హార్ట్ ఎటాక్ రానప్పటికీ.. ఇంజెక్షన్లు ఇచ్చారని చెప్పారు. ఎలాగోలా సురక్షితంగా మహారాష్ట్రకు రాగలిగానని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంతకుముందు, నితిన్ భార్య పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.

"మంగళవారం నన్ను 20-20 మంది పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పారు. నాకు ఎలాంటి గుండెనొప్పిరాలేదు. నా రక్తపోటు అదుపులోనే ఉంది. వారి ఉద్దేశం తప్పు. నాకు బలవంతంగా ఇంజెక్షన్లు ఇచ్చారు. నేను ఉద్ధవ్ ఠాక్రే, బాలాసాహెబ్ ఠాక్రే శివసైనికుడిని. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది" అని నితిన్ దేశ్​ముఖ్ చెప్పారు.

15:11 June 22

'అసెంబ్లీ రద్దు ప్రతిపాదన లేదు'
రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే ప్రతిపాదనేదీ లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తామని చెప్పారు. అసెంబ్లీ రద్దుకు ఠాక్రే యోచిస్తున్నారన్న వార్తల మధ్య ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ముంబయిలో కాంగ్రెస్ నిర్వహించిన సీఎల్పీ మీటింగ్​కు 41 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత బాలాసాహెబ్ థోరట్ తెలిపారు. కాంగ్రెస్​కు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మిగిలిన ముగ్గురు రాజధానికి బాలాసాహెబ్ చేరుకుంటున్నట్లు చెప్పారు. 44 మంది ఎమ్మెల్యేలందరూ కలిసే ఉన్నారని అని స్పష్టం చేశారు.

14:43 June 22

ఎమ్మెల్యేలకు లేఖ!
ఈరోజు సాయంత్రం జరిగే కీలక సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలందరికీ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు లేఖ రాశారు. గైర్హాజరైన వారిని పార్టీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు పరిగణిస్తామని అన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారి ప్రాథమిక సభ్యత్వాన్నీ రద్దు చేస్తామని చెప్పారు.

14:12 June 22

46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు: శిందే
మహారాష్ట్రలో సంక్షోభం నేపథ్యంలో తిరుగుబాటు మంత్రి ఏక్​నాథ్​ శిందే కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏఎన్​ఐకి వెల్లడించారు. ఇందులో 6-7 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు భాజపా నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, తాము కూడా వారిని సంప్రదించలేదని పేర్కొన్నారు.

''ఇప్పటివరకైతే మేం శివసైనికులమే. మేం సీఎం లేదా శివసేనతో ఎలాంటి చర్చలు జరపలేదు. భవిష్యత్​ కార్యాచరణపైనా ఎలాంటి నిర్ణయానికి రాలేదు.''

- ఏక్​నాథ్​ శిందే

14:09 June 22

ఎమ్మెల్యేలను కిడ్నాప్​ చేస్తున్నారు: రౌత్​

ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే విధానసభను రద్దు చేస్తారని వివరణ ఇచ్చుకున్నారు శివసేన నేత సంజయ్​ రౌత్​. ఎమ్మెల్యేలను కిడ్నాప్​ చేసి బయటకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నితిన్​ దేశ్​ముఖ్​ను దారుణంగా కొట్టి, ఆస్పత్రిలో చేర్చడం వంటివి వినే ఉంటారని అన్నారు. నితిన్​పై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు రౌత్​.

13:23 June 22

ఉద్ధవ్​ ఠాక్రేకు కరోనా: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు కూడా కరోనా సోకినట్లు తెలిపారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కమల్​ నాథ్​. శాసనసభ రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర కేబినెట్​ భేటీ అయింది. సీఎం ఠాక్రే.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా హాజరయ్యారు.

11:55 June 22

శాసనసభ రద్దు?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఓ ట్వీట్​ చేశారు శివసేన సీనియర్​ నేత సంజయ్​ రౌత్​. విధానసభ రద్దయే పరిస్థితులు ఉన్నట్లు హింట్​ ఇచ్చారు.

11:12 June 22

'శిందేతో మాట్లాడా.. మాతోనే ఉంటారు'

ఏక్​నాథ్​ శిందే వెంట ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నామని, వారంతా శివసేనలోనే ఉన్నట్లు చెప్పారు పార్టీ సీనియర్​ నేత సంజయ్​ రౌత్​. చివరివరకు పోరాడతామని స్పష్టం చేశారు. శిందే పార్టీ సీనియర్​ నేత అని.. దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఒకరినొకరు విడిచివెళ్లడం చాలా కష్టమని చెప్పారు. ఈరోజు ఉదయం శిందేతో గంట సేపు మాట్లాడానని, దీని గురించి పార్టీ చీఫ్​కు వివరించినట్లు వెల్లడించారు.

10:28 June 22

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తన అనుచర ఎమ్మెల్యేలతో సూరత్‌ వెళ్లిన రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లారు. దీంతో మహా రాజకీయం ఇప్పుడు అసోంకు చేరుకుంది. ఈ ఉదయం వీరంతా ఛార్టెడ్‌ విమానంలో గువాహటికి చేరుకున్నారు.

హిమంత రక్షణలో: గువాహటి ఎయిర్‌పోర్టులో భాజపా ఎంపీలు పల్లబ్‌ లోచన్‌ దాస్‌, సుశాంత బోర్గెహెన్‌.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. అనంతరం వారిని నగర శివారులో ఉన్న రాడిసన్‌ బ్లూ హోటల్‌కు తరలించారు. ఛార్టెడ్ విమానంలో ఎంతమంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారన్నది మాత్రం తెలియనప్పటికీ.. వారిని మూడు బస్సుల్లో హోటల్‌కు తరలించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ హోటల్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా హోటల్‌కు వచ్చి శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలను కలిసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

40 మంది ఎమ్మెల్యేల మద్దతుంది: శిందే

గువాహటి ఎయిర్‌పోర్టు వద్ద శిందే మీడియాతో మాట్లాడారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వర్గం చీలిపోదని చెప్పారు. మరో ఆరుగురు స్వతంత్రులు కూడా తనకు మద్దతిస్తున్నారని అన్నారు. త్వరలోనే తాము గవర్నర్‌ను కలవాలనుకుంటున్నట్లు శిందే తెలిపారు. ఇదిలా ఉండగా.. సూరత్‌ హోటల్‌లో శిందే, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

కేబినెట్‌ భేటీకి ఠాక్రే పిలుపు..

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు నేడు కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేశారు. మంత్రులంతా తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించారు. సంక్షోభం నేపథ్యంలో అటు కాంగ్రెస్‌, ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశం కానుంది.

మహా గవర్నర్‌కు కరోనా..

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్ కోశ్యారీ కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అఘాడీ కూటమి భవిష్యత్తు మరింత సందిగ్ధంలో పడినట్లయింది.

09:31 June 22

ఆస్పత్రిలో చేరిన మహారాష్ట్ర గవర్నర్​: ఆసక్తికర రాజకీయ పరిమామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ ముంబయిలోని హెచ్​ఎన్​ రిలయన్స్​ ఫౌండేషన్​ ఆస్పత్రిలో చేరారు. కరోనా చికిత్స కోసం ఆయన అక్కడికి వెళ్లినట్లు తెలిసింది.

09:24 June 22

ఉద్ధవ్​ ఠాక్రే- కమల్​ నాథ్ భేటీ?
రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బుధవారం కాంగ్రెస్​ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్​కు ఏఐసీసీ పరిశీలకుడుగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్​ నేత కమల్​ నాథ్​ వ్యవహరించనున్నారు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు హాజరుకావాలని తెలిపారు. శాసనసభాపక్ష భేటీ అనంతరం కమల్​నాథ్​ సహా కాంగ్రెస్​ సీనియర్లు.. సీఎం ఉద్ధవ్​ ఠాక్రేను కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

09:23 June 22

పవార్​ నివాసానికి హోం మంత్రి..

రాష్ట్రంలో సంక్షోభం నేపథ్యంలో.. హోం మంత్రి దిలీప్​ వాల్సే పాటిల్​.. ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​ నివాసానికి చేరుకున్నారు.

07:02 June 22

శిందేతో 40 మంది ఎమ్మెల్యేలు.. అసోంకు పయనం.. ఉద్ధవ్ సర్కార్ పతనమేనా?

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్​నాథ్​ శిందే వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వీరంతా ఒకవేళ భాజపాలో చేరితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. మంగళవారం గుజరాత్​లో ఓ హోటల్​లో ఉన్న ఈ బృందం.. ఇప్పుడు అసోంకు వెళ్లింది. ఈ నేపథ్యంలో శిందే చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తాను బాలాసాహెబ్​ ఠాక్రేకు చెందిన శివసేనను వదిలివెళ్లబోనని అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఠాక్రే హిందుత్వను అనుసరిస్తా అని.. దానిని మరింత ముందుకు తీసుకెళ్తా అని అసోంకు వెళ్లేముందు మీడియాతో చెప్పారు.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. అసమ్మతి ఎమ్మెల్యేల వద్దకు.. దూతను పంపారు. ఏక్‌నాథ్‌ శిందేతో ఫోన్‌లో మాట్లాడినా సానుకూలత రాలేదు. మళ్లీ భాజపాతో శివసేన జత కట్టాలని ఉద్దవ్‌కు శిందే సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 288 కాగా శివసేన శాసన సభ్యులు ఒకరు ఇటీవల మరణించారు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 144 కాగా ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ సంఖ్యా బలం 152గా ఉంది. ప్రస్తుతం విపక్ష భాజపాకు 106 మంది సభ్యుల బలం ఉండగా.. స్వతంత్రులు, చిన్నపార్టీల మద్దతుతో తమకు 135 మంది సభ్యుల బలముందని కమలదళం చెబుతోంది. శిందే కలిసివస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమని మహారాష్ట్ర భాజపా కూడా పేర్కొంది. ఈ తరుణంలో శివసేన కూడా మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముంబయిలోని వివిధ హోటళ్లలో తమ సభ్యులను ఉంచినట్లు శివసేన ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.

మరోవైపు సూరత్‌లో ఉన్న శిందే వర్గం ఎమ్మెల్యేలు రాత్రి ప్రత్యేక విమానంలో అసోంలోని గువాహటికి వెళ్లిపోయారు. శిందే వర్గానికి భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సహకరిస్తున్నట్లు సమాచారం. శిందే తిరుగుబాటును శివసేన అంతర్గత వ్యవహారంగా చెబుతున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌ తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశమై శిందే వ్యవహారంపై చర్చలు జరిపారు.

ఇవీ చూడండి: ఏక్​నాథ్ శిందేకు శివసేన షాక్.. 'మోసం' గురించి అసంతృప్త నేత ట్వీట్!

బిహార్​ టు కశ్మీర్​.. మోదీ వచ్చాకే కూలుతున్న ప్రభుత్వాలు.. ఇలా ఎన్నో!

Last Updated :Jun 22, 2022, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.