'నేను పదవి నుంచి తప్పుకుంటా.. మోదీకి చెప్పేశా'.. గవర్నర్ ప్రకటన
Published: Jan 23, 2023, 4:20 PM


'నేను పదవి నుంచి తప్పుకుంటా.. మోదీకి చెప్పేశా'.. గవర్నర్ ప్రకటన
Published: Jan 23, 2023, 4:20 PM
మహారాష్ట్ర గవర్నర్‌గా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు భగత్ సింగ్ కోశ్యారీ. ప్రధాని మోదీకి కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. మూడేళ్లుగా మహారాష్ట్ర ప్రజల నుంచి తాను పొందిన ప్రేమానూరాగాలు మరిచిపోలేనివని కోశ్యారీ అన్నారు. మహారాష్ట్ర పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలిపినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల ముంబయి పర్యటనకు.. ప్రధాని వచ్చిన సందర్భంగా తన మనసులో మాటను ఆయనకు తెలిపినట్లు కోశ్యారీ పేర్కొన్నారు.
"నేను అన్ని రాజకీయ పదవుల నుంచి వైదొలగాలని అనుకుంటున్నాను. నా శేష జీవితాన్ని చదవడం, రాయడం ఇతర కార్యకలాపాలలో గడపాలనేదే నా కోరిక. ముంబయి పర్యటనకు వచ్చిన ప్రధానికి ఇదే విషయం చెప్పాను" అని భగత్ సింగ్ కోశ్యారీ ట్వీట్ చేశారు. "సాధువులు, సంఘ సంస్కర్తలు, యోధులకు నిలయమైన మహారాష్ట్ర లాంటి గొప్ప రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మూడేళ్లుగా ఇక్కడి ప్రజల నుంచి నేను పొందిన ప్రేమానూరాగాలు మరిచిపోలేనివి." అని అందులో పేర్కొన్నారు.
జనవరి ప్రారంభంలో ఓ సభలో మాట్లాడిన కోశ్యారీ.. తాను గవర్నర్ అయిన తరువాత సంతోషంగా లేనట్లు తెలిపారు. తనకు ఈ స్థానం సరైదని కాదని అభిప్రాయపడ్డారు. 2022 నవంబర్‌లో ఛత్రపతి శివాజీపై.. కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఔరంగాబాద్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీలో మాట్లాడిన ఆయన.. శివాజీని ఓల్డ్ ఐకాన్‌గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెను దుమారం రేపాయి. 2019 సెప్టెంబర్‌లో మహారాష్ట్ర గవర్నర్‌గా కోశ్వారీ నియమితులయ్యారు.
