కొవిడ్​ కట్టడికి కేరళ 'కొత్త వ్యూహం'- గురువారం నుంచే...

author img

By

Published : Aug 4, 2021, 4:58 PM IST

Updated : Aug 4, 2021, 5:39 PM IST

New Strategy On Covid 19 Precaution

కేరళలో గత కొద్ది రోజులుగా రోజుకు 20వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశం మొత్తం నమోదవుతున్న కేసుల్లో సగం అక్కడే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో వైరస్​ కట్టడికి కొత్త వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది కేరళ. కొత్త మార్గదర్శకాలు ఆగస్టు 5 ఉదయం 12 గంటల నుంచి అమలులోకి రానున్నాయి.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్​ కట్టడి ఆంక్షల్లో మరిన్ని సడలింపులు ఇస్తూ.. కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కేరళ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న టెస్ట్​ పాజిటివిటీ రేటు(టీపీఆర్​)తో ఏబీ కేటగిరీల పద్ధతి కాకుండా ప్రతి వెయ్యి నమూనాల్లో ఎన్ని పాజిటివ్​ కేసులు వచ్చాయన్న దాని ఆధారంగా ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. ఇవి ఆగస్టు 5 నుంచే అమలులోకి రానున్నాయి.

కొత్త మార్గదర్శకాల్లోని కీలక అంశాలు..

  • వెయ్యిలో 10 కేసులు వచ్చిన జోన్లలో ట్రిపుల్​ లాక్​డౌన్​ విధించనున్నారు. ఈ జోన్లు మినహా.. మిగిలిన ప్రాంతాల్లో వారానికి ఆరు రోజుల పాటు దుకాణాలు పని చేయనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆదివారాలు పూర్తిస్థాయి లాక్​డౌన్​ ఉంటుంది.
  • దుకాణాల సమయంపై ఉన్న ఆంక్షలనూ తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేయనున్నాయి.
  • దుకాణాలకు వచ్చే కస్టమర్లు కచ్చితంగా కొవిడ్​ వ్యాక్సిన్​ తొలి డోసు తీసుకుని ఉండాలి. లేదా 24 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
  • వివాహాలు, అంత్యక్రియలకు 20 మంది వరకు అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రార్థనా మందిరాల విస్తీర్ణాన్ని బట్టి 40 మంది వరకు భక్తులకు అనుమతి ఉంటుంది.

ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​ కోరారు. కొవిడ్​ జాగ్రత్తలు, వ్యాక్సిన్​ పంపిణీ వివరాలను కేరళ అసెంబ్లీలో వెల్లడించారు.

" కొవిడ్​ కట్టడికి కేరళ అవలంబిస్తున్న విధానాలు సమర్థమైనవి. తక్కువ కాలంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 44.14 శాతం మందికి తొలి డోసు, 17.66 శాతం మందికి రెండో డోసు ఇచ్చాం. ముడో దశ ముప్పును దృష్టిలో ఉంచుకుని టీకా పంపిణీని విస్తృతంగా చేపడుతున్నారు. ఆసుపత్రుల్లో ఉన్నవారితో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నాం. "

- వీణా జార్జ్​, కేరళ ఆరోగ్య మంత్రి.

సీఎంకు కేంద్ర ఆరోగ్య మంత్రి ఫోన్​..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో ఫోన్​లో మాట్లాడారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్​ మాండవియా. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 'ఎన్​సీడీసీ నేతృత్వంలోని కేంద్ర బృందం కేరళ నుంచి తిరిగి వచ్చింది. నివేదిక సమర్పించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​తో మాట్లాడాను. రాష్ట్రంలో కొవిడ్​ పరిస్థితులపై చర్చించాం. వైరస్​ కట్టడి కోసం విజయన్​కు లేఖ కూడా రాశాను. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర సహకారం కోరాం. అలాగే.. కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా కల్పించాం. ' అని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: corona cases : కేరళలో మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు

Last Updated :Aug 4, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.