గవర్నర్ వర్సెస్ సీఎం... ఆ వీడియో రిలీజ్ చేసిన ఆరిఫ్ ఖాన్

author img

By

Published : Sep 19, 2022, 1:43 PM IST

Kerala governor press conference

కేరళ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. లాటరీలు, మద్యం విక్రయాలపైనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆధారపడి ఉండటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కన్నూర్ యూనివర్సిటీలో తన పర్యటన సమయంలో జరిగిన నిరసనకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Kerala governor press conference : కేరళ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్​కు మధ్య వివాదం ముదురుతోంది. 2019లో కన్నూర్ యూనివర్సిటీని సందర్శించిన సమయంలో తనను ఎగతాళి చేశారని ఆరోపిస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. అందుకు సంబంధించిన వీడియోను రాజ్​భవన్ ఆడిటోరియంలో ప్రదర్శించారు. నిరసన జరిగిన సమయంలో ఓ సీనియర్ అధికారి పోలీసులను అడ్డుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం ఆ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారని చెప్పారు.

"నల్ల చొక్కాలు ధరించారని అరెస్టులు చేస్తున్న రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. యూనివర్సిటీలో పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, నా వద్దకు రాకుండా వారిని రాగేశ్ (ప్రస్తుతం సీఎంఓ అధికారి) అడ్డుకున్నారు. అందుకే ఆయనకు ప్రతిఫలం దక్కినట్టు ఉంది. యూనివర్సిటీలో నిరసనలు ప్లాన్ ప్రకారం జరగకపోతే.. కొంతమంది చేతుల్లో ప్లకార్డులు ఎందుకు ఉన్నాయి? ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న వారందరి గొంతు మూయించడంపైనే సర్కారు దృష్టిపెట్టింది. రాజ్​భవన్​ను సైతం వదిలిపెట్టడం లేదు. రాజ్​భవన్​లో నా సిబ్బంది నియామకాలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. అపాయింట్​మెంట్​ను వ్యతిరేకిస్తూ నాకు లేఖలు రాశారు. నాపై ఒత్తిడి తేవాలని చేసే పనులేవీ పనిచేయవు. ఇప్పటికీ వారు కళ్లు తెరవడం లేదు. ఇంకా నాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటు ఇంకొన్ని కారణాల వల్ల ఈ సమస్యను ప్రజలకు చెప్పాలని అనుకున్నా."
-మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, కేరళ గవర్నర్

ప్రభుత్వం తన అధికారాలను కట్టడి చేయలేదని గవర్నర్ పేర్కొన్నారు. సీఎంతో ప్రమాణస్వీకారం చేయించేది తానేనని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం.. లాటరీలు, మద్యం విక్రయాలపైనే ఆధారపడి ఉండటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కన్నూర్​లో రాజకీయ హత్యలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.