కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే.. కాంగ్రెస్ అధికార ప్రకటన

author img

By

Published : May 18, 2023, 12:16 PM IST

karnataka cm

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య​ ఎన్నికయ్యారు. సీఎం రేసులో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ పేరు బలంగా వినిపించినప్పటికీ పార్టీ అధిష్ఠానం సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.

Karnataka CM Siddaramiah : కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత సిద్ధరామయ్య​ రెండోసారి సేవలందించనున్నారు. కొత్త సీఎం రేసులో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​తో పోటీ పడిన ఆయన.. చివరకు పదవిని దక్కించుకున్నారు. సిద్ధరామయ్య, శివకుమార్​లలో ఎవరిని ఎంపిక చేయాలని మల్లగుల్లాలు పడిన పార్టీ అధిష్ఠానం.. మాజీ సీఎం పేరునే ఖరారు చేసింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు కేపీసీసీ అధ్యక్షుడిగానూ డీకే సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం మే 20న ఉంటుందని వెల్లడించారు.

ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తూ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఆదివారం తీర్మానం చేశారు. దీనిని పరిశీలించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి సీఎం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితం వెలువడినప్పటి నుంచే సిద్ధరామయ్య​ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి అంటూ ఆయన అభిమానులు సందడి చేశారు. ఆయన ఇంటి వద్ద పెద్ద పెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. కొత్త ఎమ్మెల్యేలో మెజారిటీ సభ్యులు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.

Siddaramaiah Political Career : రాష్ట్ర రాజకీయాల్లో అపారమైన అభిమానులన్న నేతల్లో సిద్ధరామయ్య ప్రముఖుడు. దేవరాజ్‌ అరసు తర్వాత ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసింది సిద్ధరామయ్యే. ఇటీవల వెలువడిన పలు సర్వేల్లో సీఎం అభ్యర్థుల రేసులో సిద్ధరామయ్యకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. జనతా పరివార్‌ నుంచి 2006లో కాంగ్రెస్‌లోకి వచ్చినా పార్టీ భావజాలాన్ని సులువుగా ఆకళింపు చేసుకున్నారు. బలహీనవర్గాల సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఆయన ఇష్టపడతారు. జనతాదళ్‌లోనూ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య ఇప్పటి వరకు అత్యధికంగా 13సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సొంతం చేసుకున్నారు.

మాట కఠినంగా ఉన్నా అభిమానుల మనసులు గెలిచిన సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలు తక్కువే. 2013లో కాంగ్రెస్‌ పార్టీకి 122 స్థానాల విజయాన్ని అందించడంలో సిద్ధరామయ్య పాత్రను విస్మరించని అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది. అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయని ఆయన ఐదేళ్లపాటు రాష్ట్రంలో అనేక పథకాలను అందించారు. సిద్ధరామయ్య.. కొత్త తరం నాయకులకు మింగుడు పడని నేత. ఆధునిక రాజకీయాలు, వ్యూహాలకు దూరంగా ఉంటారు.

Karnataka Election Results : 224 స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభకు ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీకి 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19 స్థానాలు గెలుపొందాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.